మానవత్వమే మనిషి సహజగుణం
బౌద్ధవాణి
నిరంజనా నది ఒడ్డున ఒక బౌద్ధ భిక్షువు స్నానం చేస్తున్నాడు. ఆయన స్నానం చేసే చోటుకు దగ్గరగా ఒక మేడి చెట్టు ఉంది. అది ఏటి గట్టున ఉండి నదిలోకి వాలి ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక తేలు ఉంది. అది ఆ చెట్టు కొమ్మలను అల్లుకున్న సాలెగూడు కేసి పాకుతూ జారి తటాలున నీటిలో పడింది. తేలు నీటిలో జారి పడడం చూసిన భిక్షువు గబాలున పోయి రెండు చేతులను దోసిలిగా చేసి ఆ తేలును నీటిలో మునగకుండా పెకైత్తాడు. దాన్ని మెల్లగా మరలా కొమ్మ మీద పెట్టాడు. ఆ సమయంలో తేలు కసుక్కున కుట్టింది. అది అలా కుట్టగానే భిక్షువు బాధతో ‘‘అమ్మా’’అంటూ పెద్దగా అరిచాడు.
అంతలోనే ఆ తేలు మరలా జారి పడింది. ఆ భిక్షువు మరలా రక్షించి, కొమ్మ మీద ఉంచాడు. అది మరలా కుట్టింది. ఇలా రెండు మూడుసార్లు జరిగింది. అది నీటిలో పడడం, భిక్షువు దానిని రక్షించడం, తిరిగి అది కుట్టడం, భిక్షువు బాధతో అరవడం...
ఈ తతంగాన్నంతా ఒడ్డున గొర్రెలు మేపుకుంటున్న ఒక వ్యక్తి చూసి, పగలబడి నవ్వుతూ, ‘‘స్వామీ! తేలు కుడుతుందని తెలియదా! దాన్ని కాపాడడం ఎందుకు? కుట్టినప్పుడల్లా అమ్మా అబ్బా అని అరవడం ఎందుకు? మీకేమైనా పిచ్చా?’’ అన్నాడు.
దానికి భిక్షువు నవ్వుతూ, ‘‘నాయనా, కుట్టడం దాని నైజం. రక్షించడం నా నైజం. కుట్టకపోతే అది దాని సహజగుణాన్ని మరచిపోయినట్లు. రక్షించకపోతే నేను నా సహజగుణాన్ని మరచినట్లు. మానవత్వం అంటే ఇదే! ఎదుటివారి కష్టసుఖాల్ని అర్థం చేసుకునే గుణం ఈ చరాచర సృష్టిలో మనిషి ఒక్కడికే ఉంది. దాన్ని కోల్పోతే మనం మానవత్వాన్ని కోల్పోయినట్లే’’ అన్నాడు.
పశువుల కాపరి భిక్షువుకు నమస్కరించాడు.
- బొర్రా గోవర్థన్