Borra govarthan
-
అనుకరణ అనర్థ దాయకం
పూర్వం వారణాసిలో ఒక కాకి ఉండేది. దాని పేరు సవిట్ఠకుడు. ఆ రోజుల్లో వారణాసిలో కరువు వచ్చింది. ఆహారం దొరక్క సవిట్ఠకుడు తన భార్యను వెంట తీసుకుని ఆహారం కోసం వెదుకుతూ హిమాలయాలకు చేరాడు. అక్కడ ఒక పెద్ద సరస్సు కనిపించింది. ఆ సరస్సు సమీపంలో వీరకుడు అనే ఒక నీటి కాకి కనిపించింది. వీరకుడు రెక్కలాడిస్తూ, నీటిమీద తిరుగుతూ, ఉన్నట్టుండి నీటిలో మునిగి చేపను పట్టి తెచ్చి కడుపారా తినేవాడు. వీరకుణ్ణి చూసిన సవిట్ఠకుడు దగ్గరకు వెళ్లాడు. తమ ఇబ్బందిని వివరించాడు. ‘‘మంచిది. ఇక్కడే ఉండండి. ఆహారం నేను తెచ్చి పెడతాను’’అని వీరకుడు అభయం ఇచ్చాడు. రోజూ చేపల్ని పట్టి తెచ్చి, తాను తిని మిగిలినవి వారికి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లు జరిగింది. ఒకరోజున సవిట్ఠకునికి ఒక ఆలోచన వచ్చింది. ‘నేనూ నల్లగా ఉన్నాను. ఈ వీరకుడూ నల్లనే. మా ఇద్దరి కాళ్లూ, కళ్లూ, రెక్కలూ అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి. మరి నేనెందుకు చేపల్ని పట్టలేను? ఈ వీరకుని దయాభిక్ష మీద బతకాల్సిన పనేముంది?’ అనుకున్నాడు. వీరకునితో అదే విషయం చెప్పాడు. ‘‘మిత్రమా! ఆ పని చేయకు. నేను నీటి కాకిని. నీవు కాకివి. నీకిది తగదు. నన్ను అనుకరించకు. ఆపద తెచ్చుకోకు. ఒకరి మీద ఆధారపడడం నచ్చకపోతే ఈ సరోవర తీరాన్ని వదిలి అడవిలోకి వెళ్లు. అక్కడ నువ్వు హాయిగా వేటాడి జీవించగలవు’’ అని హితవు చెప్పాడు వీరకుడు. కాని సవిట్ఠకుడు మిత్రుని మాటలు వినలేదు. వీరకుణ్ణి అనుకరిస్తూ నీటిపై వేగంగా ఎగిరి నీటిలో మునిగాడు. తిరిగి పైకి వచ్చేటప్పుడు నాచులో చిక్కుకున్నాడు. ఊపిరాడక మరణించాడు. లేనిపోని గొప్పలకు పోయి ఇతరులను అనుకరించడం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరిస్తూ, బుద్ధుడు దేవదత్తుని గురించి చెప్పిన జాతక కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
మానవత్వమే మనిషి సహజగుణం
బౌద్ధవాణి నిరంజనా నది ఒడ్డున ఒక బౌద్ధ భిక్షువు స్నానం చేస్తున్నాడు. ఆయన స్నానం చేసే చోటుకు దగ్గరగా ఒక మేడి చెట్టు ఉంది. అది ఏటి గట్టున ఉండి నదిలోకి వాలి ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక తేలు ఉంది. అది ఆ చెట్టు కొమ్మలను అల్లుకున్న సాలెగూడు కేసి పాకుతూ జారి తటాలున నీటిలో పడింది. తేలు నీటిలో జారి పడడం చూసిన భిక్షువు గబాలున పోయి రెండు చేతులను దోసిలిగా చేసి ఆ తేలును నీటిలో మునగకుండా పెకైత్తాడు. దాన్ని మెల్లగా మరలా కొమ్మ మీద పెట్టాడు. ఆ సమయంలో తేలు కసుక్కున కుట్టింది. అది అలా కుట్టగానే భిక్షువు బాధతో ‘‘అమ్మా’’అంటూ పెద్దగా అరిచాడు. అంతలోనే ఆ తేలు మరలా జారి పడింది. ఆ భిక్షువు మరలా రక్షించి, కొమ్మ మీద ఉంచాడు. అది మరలా కుట్టింది. ఇలా రెండు మూడుసార్లు జరిగింది. అది నీటిలో పడడం, భిక్షువు దానిని రక్షించడం, తిరిగి అది కుట్టడం, భిక్షువు బాధతో అరవడం... ఈ తతంగాన్నంతా ఒడ్డున గొర్రెలు మేపుకుంటున్న ఒక వ్యక్తి చూసి, పగలబడి నవ్వుతూ, ‘‘స్వామీ! తేలు కుడుతుందని తెలియదా! దాన్ని కాపాడడం ఎందుకు? కుట్టినప్పుడల్లా అమ్మా అబ్బా అని అరవడం ఎందుకు? మీకేమైనా పిచ్చా?’’ అన్నాడు. దానికి భిక్షువు నవ్వుతూ, ‘‘నాయనా, కుట్టడం దాని నైజం. రక్షించడం నా నైజం. కుట్టకపోతే అది దాని సహజగుణాన్ని మరచిపోయినట్లు. రక్షించకపోతే నేను నా సహజగుణాన్ని మరచినట్లు. మానవత్వం అంటే ఇదే! ఎదుటివారి కష్టసుఖాల్ని అర్థం చేసుకునే గుణం ఈ చరాచర సృష్టిలో మనిషి ఒక్కడికే ఉంది. దాన్ని కోల్పోతే మనం మానవత్వాన్ని కోల్పోయినట్లే’’ అన్నాడు. పశువుల కాపరి భిక్షువుకు నమస్కరించాడు. - బొర్రా గోవర్థన్