
పూర్వం వారణాసిలో ఒక కాకి ఉండేది. దాని పేరు సవిట్ఠకుడు. ఆ రోజుల్లో వారణాసిలో కరువు వచ్చింది. ఆహారం దొరక్క సవిట్ఠకుడు తన భార్యను వెంట తీసుకుని ఆహారం కోసం వెదుకుతూ హిమాలయాలకు చేరాడు. అక్కడ ఒక పెద్ద సరస్సు కనిపించింది. ఆ సరస్సు సమీపంలో వీరకుడు అనే ఒక నీటి కాకి కనిపించింది. వీరకుడు రెక్కలాడిస్తూ, నీటిమీద తిరుగుతూ, ఉన్నట్టుండి నీటిలో మునిగి చేపను పట్టి తెచ్చి కడుపారా తినేవాడు. వీరకుణ్ణి చూసిన సవిట్ఠకుడు దగ్గరకు వెళ్లాడు. తమ ఇబ్బందిని వివరించాడు.
‘‘మంచిది. ఇక్కడే ఉండండి. ఆహారం నేను తెచ్చి పెడతాను’’అని వీరకుడు అభయం ఇచ్చాడు. రోజూ చేపల్ని పట్టి తెచ్చి, తాను తిని మిగిలినవి వారికి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లు జరిగింది. ఒకరోజున సవిట్ఠకునికి ఒక ఆలోచన వచ్చింది. ‘నేనూ నల్లగా ఉన్నాను. ఈ వీరకుడూ నల్లనే. మా ఇద్దరి కాళ్లూ, కళ్లూ, రెక్కలూ అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి. మరి నేనెందుకు చేపల్ని పట్టలేను? ఈ వీరకుని దయాభిక్ష మీద బతకాల్సిన పనేముంది?’ అనుకున్నాడు.
వీరకునితో అదే విషయం చెప్పాడు. ‘‘మిత్రమా! ఆ పని చేయకు. నేను నీటి కాకిని. నీవు కాకివి. నీకిది తగదు. నన్ను అనుకరించకు. ఆపద తెచ్చుకోకు. ఒకరి మీద ఆధారపడడం నచ్చకపోతే ఈ సరోవర తీరాన్ని వదిలి అడవిలోకి వెళ్లు. అక్కడ నువ్వు హాయిగా వేటాడి జీవించగలవు’’ అని హితవు చెప్పాడు వీరకుడు.
కాని సవిట్ఠకుడు మిత్రుని మాటలు వినలేదు. వీరకుణ్ణి అనుకరిస్తూ నీటిపై వేగంగా ఎగిరి నీటిలో మునిగాడు. తిరిగి పైకి వచ్చేటప్పుడు నాచులో చిక్కుకున్నాడు. ఊపిరాడక మరణించాడు. లేనిపోని గొప్పలకు పోయి ఇతరులను అనుకరించడం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరిస్తూ, బుద్ధుడు దేవదత్తుని గురించి చెప్పిన జాతక కథ ఇది.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment