పూర్వం కశ్యపు బుద్ధుని కాలంలో వేగళింగ అనే నగరం ఉండేది. అ నగర శివారులో ఘటికారుడు అనే కుమ్మరి ఉండేవాడు. అతనికి జ్యోతిపాలుడు అనే మిత్రుడు ఉండేవాడు. అప్పుడు ఆ ్రపాంతాన్ని కికీలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఘటికారుడు కశ్యప బుద్ధుని ఉపాసకుడు. కశ్యపుని ధర్మ ప్రబోధాలు విని ధార్మికంగా జీవిస్తూ ఉండేవాడు. కుండలు చేయడానికి కావలసిన మట్టిని పలుగు పారలతో తవ్వి తీసేవాడు కాదు. క్రిమికీటకాలు తన పలుగు కింద పడి చనిపోతాయని. ఎలుకలు తవ్విపోసిన మట్టిని మాత్రమే తీసుకుని పోయి కుండలు చేసేవాడు. ఆ కుండల్ని కూడా ఎక్కువ ధరకు అమ్మేవాడు కాదు.
వాటిని ఆరుబయట ఉంచేవాడు. కావలసిన వాళ్లు కుండల్ని తీసుకుని అక్కడ ఉంచిన గంపల్లో తాము చెల్లించాల్సిన ధరకు సరిపడే ధనాన్ని గానీ, నూకల్ని గానీ, ధాన్యాన్ని గానీ ఉంచి వెళ్ళేవారు. అలా... నిజాయితీగా, ధర్మబద్ధంగా తాను జీవిస్తూ అందరూ జీవించాలని కోరుకునేవాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ అంధులు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి ఆలనా ΄ాలనా చూసేవాడు. వారు కూడా ధార్మికులే. ఇతరులు లేని సమయంలో ఎవరైనా భిక్షువులు గానీ, యోగులుగానీ భిక్షకు వస్తే...‘‘అయ్యా! మేము ఇద్దరం గుడ్డివాళ్ళం. లేవలేని ముసలివాళ్ళం. అదిగో ఇంట్లో ఉట్టిమీద ఆహారం ఉంది. మీకు కావలసినంత మీరే తీసుకోండి. మేము ఇచ్చే భిక్షగా భావించండి’’ అనేవారు.
ఒకరోజున కికీలుడు తన రాజభవనం ముందు నిలబడ్డాడు. అటుగా కశ్యపబుద్ధుడు తన శిష్యగణంతో వెళ్తున్నాడు. కికీలక మహారాజు వారి ముందుకు వచ్చి నమస్కరించి– ‘‘భగవానులు మమ్ము అనుగ్రహించాలి. భిక్షుసంఘంతో వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి’’ అని వేడుకున్నాడు. ‘‘లేదు మహారాజా! నేను వేరొకరికి మాట ఇచ్చాను’’ అన్నాడు. ‘‘ఎవరికి భగవాన్? నేను ఈ దేశానికి రాజుని. ప్రభువుగా వెళ్ళి వారిని అర్థిస్తాను. ఈరోజు ఆ అవకాశం నాకు ఇవ్వమంటాను. మరోమారు వారిని తీసుకోమంటాను’’ అన్నాడు.
‘‘లేదు మహారాజా! ఈ రోజు నేను వారి ఇంటనే భిక్ష స్వీకరించాలి’’ అని ముందుకు నడిచాడు. భిక్షుగణం ఊరి చివరకు వెళ్ళింది. అప్పటికే పట్టిన మబ్బుల్నుండి సన్నని చినుకులు రాలుతున్నాయి. భిక్షు సంఘం వెళ్ళేసరికి... ఘటికారుని పూరి΄ాక మీద పరచిన ఎండు గడ్డిని తీసివేసి కట్టలు కట్టారు. ఆ కట్టల్ని ఎవరో మోసుకుపోతున్నారు. గడ్డి తీయడంతో పాక మీద ఖాళీలు కనిపిస్తున్నాయి. కశ్యప బుద్ధుణ్ణి వారు గౌరవంగా ఇంటి వసారాలోకి ఆహ్వానించారు. ఆ చూరు కిందే కూర్చుని పచ్చడి మెతుకుల భిక్ష స్వీకరించారు. వర్షం పెరిగింది. తడుస్తూనే ధర్మోపదేశం చేశాడు కశ్యపుడు.
ఘటికారుడు కశ్యపునికి పాదాభివందనం చేశాడు. భిక్షాగణం తిరిగి బయలుదేరింది. దారిలో చెట్టుకింద కికీలమహారాజు కనిపించాడు. ‘‘చూశావా! మహారాజా! ఘటికారుడు ఎంతటి దానపరుడో! ఎవరో గడ్డి అడిగారు. తన దగ్గర లేదు. అయినా తన ఇంటి మీద పరచిన గడ్డిని తీసి దానం చేశాడు. అతను మహాదాత. అతని భిక్ష స్వీకరించడం మాకు ఎంతో సంతోషం’’ అంటూ ముందుకు కదిలాడు. తాను సమర్పించే గొప్ప భోజనాన్ని కాదని, పూరిగుడిసెలో పచ్చడి మెతుకుల కోసం కశ్యపు బుద్ధుడు ఎందుకు వెళ్ళాడో రాజుకి అర్థమైంది. తనకంటే ఘటికారుడే గొప్పవాడని గ్రహించాడు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment