సాక్షి, సిద్దిపేట: ఏ దేవాలయానికి వెళ్లినా సహజంగా రావి, వేప చెట్లే దర్శనమిస్తాయి. కానీ సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి దేవాలయంలో మాత్రం గంగరేగు చెట్టు కనిపిస్తుంది. స్వామివారి మండపానికి ఎదురుగా ఉన్న గంగరేగు చెట్టు వద్దనే భక్తులు పట్నాలు వేసి, మొక్కులు చెల్లిస్తారు. చెట్టుకు ముడుపు కూడా కడతారు.
మొక్కులన్నీ ఇక్కడే..
ప్రతి ఏడాది మూడు నెలల పాటు కొమురవెల్లి జాతర జరుగుతుంది. జనవరి 19వ తేదీ నుంచి ప్రారంభమై..మార్చి 24న అగ్ని గుండాల ప్రవేశంతో జాతర ముగుస్తుంది. బుధ, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకున్న తర్వాత ‘కష్టాలు తీరిస్తే గంగరేగు చెట్టు కింద పట్నం వేస్తాం’అని మొక్కుకుంటారు. సమస్యలు తీరగానే సకుటుంబంగా కొమురవెల్లికి తరలివస్తారు. ఒగ్గు పూజారితో గంగరేగు చెట్టు కింద మల్లన్న పట్నాలు వేయిస్తారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించేది కూడా ఇక్కడే. కల్యాణకట్టలో కత్తిరించిన తలనీలాలను వెంట తెచ్చుకొని, గంగరేగు చెట్టు మొదల్లో వేయడం ఆనవాయితీ. ఈ చెట్టుకు బంతిపూల మాల వేసి, స్వయంగా స్వామివారికే అలంకరించిన అనుభూతిని పొందుతారు.
ఎప్పుడూ పచ్చగా...
ఈ గంగరేగు చెట్టుకు ఎంతో మహిమ ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఈ చెట్టు మాత్రం ఏడాది పొడవునా పచ్చదనంతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇందుకు కారణం స్వామి మహిమేనని నమ్ముతారు. ఈ చెట్టు ఆకుతోపాటు స్వామి చేతిలో బండారి(పసుపు) తింటే అనారోగ్యం దూరమవుతుందని భక్తుల నమ్మకం. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెట్టు ఆకులను వెంట తీసుకెళ్లి, అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తూ ఉంటారు. ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే, వారిని మల్లన్న దేవాలయానికి తీసుకొచ్చి.. స్వామి దర్శనం చేయించడంతోపాటు గంగరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంటారు.
మంచి జరుగుతుందని..
గంగరేగు చెట్టును దేవుడు చెట్టుగా భావిస్తారు. గంగరేగు చెట్టు ఆకుతోపాటు స్వామి వారి చేతిలోని బండారి తినడం వలన ఆరోగ్యంగా ఉండటంతోపాటు మంచి జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా భక్తుల ముడుపులు, పట్నాలు వేస్తారు.
– మహాదేవుని మల్లికార్జున్, వంశపారంపర్య అర్చకుడు
Comments
Please login to add a commentAdd a comment