ఇంద్రియాలను అదుపు చేయడానికి ధ్యానప్రక్రియ ఒక సాధనం మాత్రమే. అంతేకానీ, ధ్యానం చేస్తే చాలు ఇంద్రియాలు అదుపులోకొస్తాయి, జితేంద్రియులమై పోతాము అనే ఆలోచన కేవలం అపోహ మాత్రమేనని చెబుతూ, ధ్యానానంతరం జితేంద్రియుడినై పోయాను అనుకునే కొందరు భిక్షువులకు బుద్ధుడు ఇలా బోధించాడు. ‘‘భిక్షువులారా! ఒక వ్యక్తి ఒక కుక్కని, ఒక పక్షిని, ఒక నక్కని, ఒక మొసలిని, ఒక పాముని, ఒక కోతిని పెంచాలనుకున్నాడు. వాటిని తెచ్చి బంధించాడు. తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. వాటికి ఎలాటి లోటూ లేకుండా అన్ని వసతులూ ఏర్పాటు చేశాడు.
అవన్నీ అతనికి మాలిమి అయ్యాయి. ‘ఇక ఇవి నన్ను వదిలిపోవు’ అనుకొని ఒకరోజున అన్నింటినీ వదిలిపెట్టాడు. అంతే... కుక్క తన పూర్వ గ్రామానికి పరుగు తీసింది. పక్షి టపటప రెక్కలాడిస్తూ ఆకాశంలోకి లేచిపోయింది. నక్క శ్మశానానికి దౌడు తీసింది. మొసలి చరచరా పాక్కుంటూ దగ్గరలోని సరస్సులోకి వెళ్లిపోయింది. పాము వేగంగా పోయి ఒక పుట్టలో దూరింది. ఇక కోతి, అతన్ని వెక్కిరిస్తూ, ఒక చెట్టుమీదికి ఎగిరి దూకింది.
అలా అవన్నీ తమ సహజ నివాసాలకే వెళ్లిపోయాయి. ఆ ఆరు జంతువులు ఎలా బంధనాలు విడిపోగానే తమ సహజరీతిని ప్రదర్శించాయో, మన ఇంద్రియాలూ అంతే! ఏమాత్రం ఆదమరచి ఉన్నా అదుపు తప్పుతాయి. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి. దీనినే ‘ఎరుక’ అంటారు. మనల్ని మనం నిరంతరం పర్యవేక్షించుకోవడమే ఎరుకతో ఉండటం. ఎరుక లేకపోతే ఆరు జంతువుల్లా ఆరు ఇంద్రియాలు తమ తమ పాత పద్ధతులకేసి పరుగు తీస్తాయి. ఈ విషయం గ్రహించిన భిక్షువులు తమలో ఎరుకను పెంపొందించుకున్నారు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment