
జ్ఞానోదయం
బౌద్ధనీతి
ఒకనాడు కపిలవస్తు రాజ్యంలోని గణరాజ్యరాజుల మధ్య విభేదాలు పొడసూపాయి. రాజ్య ఐక్యతకు ముప్పు వాటిల్లింది. ఆ సమయంలో వారంతా బుద్ధుని దగ్గరకు వచ్చి, సలహా అడిగారు. అప్పుడు ఆయన వారితో ‘‘మహారాజులారా! పూర్వం ఓ అరణ్యంలో తిత్తిరి పిట్టల గుంపు ఉండేది. చాలా ఐకమత్యంతో జీవించేవి. వాటిని పట్టి, మాంసం అమ్ముకోవాలని ఆశపడ్డాడు ఒక వేటగాడు. ఆ ప్రాంతంలో నూకలు జల్లాడు. అవి ఆ నూకల మీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. అప్పుడు ఆ పక్షుల్లో పెద్దగా ఉన్న పక్షి వాటికి ధైర్యం చెప్పింది. ‘ఐకమత్యంగా ఉండి అందరం ఒకేసారి పైకి లేచి వలను లేపుకు పోదాం’ అని చెప్పింది. పక్షులన్నీ వలను లేపుకుని వెళ్లి ఒక ముళ్లచెట్టు మీద వదిలి, ఆ సందుల్లోంచి నెమ్మదిగా జారుకుని వెళ్లిపోయాయి. ఇలా కొన్నిసార్లు జరిగింది. ఆ తర్వాత వాటిలో వాటికి అభిప్రాయభేదాలు తలెత్తి, అహంకారం పొడసూపింది. ‘వలను నేను ఎత్తాను అంటే నేనే ఎత్తాను’ అని గర్వపడ్డాయి.
మరోసారి వలలో చిక్కినప్పుడు ఒకదానితో ఒకటి వాదులాడుకున్నాయి. ఆ వాదులాటలు చివరికి తగాదాలుగా మారాయి.
ఈ గొడవలు, గందరగోళాల వల్ల అవి ఈ సారి వలలో చిక్కుకుపోయాయి. వేటగాడు వచ్చి వాటిని పట్టి, అమ్మేసుకున్నాడు.
చూశారా! అహంకారం, అనైక్యతల వల్ల పక్షులన్నీ నాశనం అయ్యాయి’’ అని చెప్పాడు. ఆ రాజులకు జ్ఞానోదయం అయింది. బుద్ధునికి లేచి నమస్కరించారు.
- బొర్రా గోవర్ధన్