మనోవీధులు ఊడ్పించాడు! గురువును చేశాడు!!
అది మగధ రాజధాని. అందులో వీధులు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడు సునీతుడు. రాత్రంతా వీధులు ఊడ్చి పగలు ఊరి చివరి తన గుడిసెలో గడిపేవాడు. బుద్ధుని గురించి విని, ఒకసారి బుద్ధుని ప్రబోధం వినాలనే కుతూహలం కలిగింది. తాను అంటరాని వాడు. అందరితో కలసి కూర్చొని వినడం ఎలా? అని ఆలోచించుకుని బాధపడ్డాడు. ఒక తెల్లవారు జామున వీధి ఊడ్చే సమయంలో బుద్ధుడు అటుగా రావడం చూసి, పక్కకు తప్పుకుని ఆయన వెనకే అనుసరించాడు. చాటుగా దాగి, ధర్మప్రబోధం వినసాగాడు.
ఆ రోజుల్లో ధార్మిక విషయాలు ప్రబోధించడానికి కేవలం బ్రాహ్మణ, క్షత్రియులే అర్హులు. మిగిలిన వారు దూరంగానే ఉండేవారు. సునీతుణ్ణి గమనించిన బుద్ధుడు, ‘‘రా! ఇటురా! నా దగ్గరకు రా!’’ అని పిలిచి దగ్గరకు తీసుకున్నాడు. వివరాలు అడిగి తెలుసుకుని,‘‘సునీతా! ధర్మప్రబోధానికి నీవూ అర్హుడివే!. నీవు ఇన్నాళ్లూ ఈ చీపురుతో వీధుల్లోని మురికిని ఎత్తిపోశావు. నేలను శుభ్రం చేశావు. ఇకనుండి జ్ఞానం అనే చీపురును చేతబట్టు.
నీ మనసులోని మలినాలను శుభ్రం చేసుకో. నీ ధర్మప్రబోధాలతో మనుషుల మనసుల్లోని చెడ్డ ఆలోచనల్ని, దురలవాట్లని, అనైతిక కార్యక్రమాల్ని ఊడ్చిపారెయ్యి’వారిలోని అజ్ఞానాన్ని తొలగించు. వారి మనోవీధుల్ని పరిశుద్ధపరచు. రా!’’అంటూ భిక్షుదీక్ష ఇచ్చాడు. సునీతుడు అహోరాత్రాలూ కష్టపడి, విద్య నేర్చుకుని, తక్కువ కాలంలో గొప్ప భిక్షువుగా రాణించాడు. గౌరవ మర్యాదలు పొందాడు. అలా మొదటిసారిగా అన్ని కులాలవారికీ ధర్మంలో ప్రవేశం కల్పించిన వాడు బుద్ధుడు. వారితో ధార్మిక ప్రబోధం చేయించాడు. గౌరవం, కీర్తి కల్గించాడు. అలాంటి వారిలో ఒకడే సునీతుడు.
– డా. బొర్రా గోవర్ధన్