అనుకరణ అనర్థదాయకం
బౌద్ధనీతి
ఒక అడవిలో ఒక మహా సరోవరం ఉంది. దాన్నిండా కలువలూ, తామరలు విరబూసి ఉంటాయి. తామర తూడులు, దుంపలూ మంచి బలవర్ధకమైన ఆహారం. ఆ సరోవరం ప్రాంతంలో ఒక ఏనుగు నివసిస్తూ ఉంటుంది. అది ప్రతి రోజూ ఆ సరోవరంలో దిగి, స్నానం చేస్తూ కొన్ని తామర తూడుల్ని, దుంపలతో సహా పీకి, వాటిని తొండంతో ఝాడించి, దుంపలకంటిన బురదని శుభ్రం చేసుకుని తినేది. వాటి వల్ల అది ఆరోగ్యంగా, అందంగా, పుష్టిగా తయారైంది.
అక్కడికి దగ్గర్లోనే ఒక నక్క కూడా ఉండేది. అది ఏనుగును చూసి దాని పౌష్టికత్వానికీ, ఆరోగ్యానికీ అసూయ పడింది. అసలు ఏనుగు ఏం తింటుందో గమనించి, తానూ ఆ సరోవరంలోకి దిగి, తామర దుంపల్ని పీకి, శుభ్రం చేసుకోవడం కుదరక, ఆ బురదతోనే వాటిని తినడం మొదలు పెట్టింది. తనకు తగని ఆహారం కావడం వల్ల తామర తూడులు దానికి అరగలేదు. దుంపల కంటిన బురద కడుపులో పేరుకుపోయింది. దాంతో నక్క రోజు రోజుకీ క్షీణించి, చివరికి మరణించింది.
బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘భిక్షువులారా! చూశారా! దురాశ వల్ల తనకు తగని విషయాల్లో ఇతరులను అనుకరించడం వల్ల, తనకు కాని పనులను చేయడం వల్ల నక్కకు ఏ గతి పట్టిందో!’’ అని ధర్మం ప్రబోధం చేశాడు.
- బొర్రా గోవర్ధన్