యువరాణి స్వయంవరం జరుగుతోంది. పదహారు రాజ్యాల యువకులు పోటీ పడుతున్నారు ఆ గణరాజ్యాల మొత్తంలో అతి సుందరమైన, సుగుణవతి అయిన ఆ రాకుమారిని తన భాగస్వామిగా చేసుకోవాలని. గదాయుద్ధం, కత్తిసాము, గుర్రపు స్వారీ, మల్లయుద్ధం పోటీలు ముగిసాయి. వందలమంది యువకుల్లో కేవలం ముగ్గురే మిగిలారు. ఆఖరిపోటీ విలువిద్య. ఒంటిచేత్తో లేపలేనంత బరువైన సింహ హనువు అనే ధనుస్సును ఎత్తిపట్టి బాణాన్ని సంధించాలి. తొలిగా వచ్చిన ఇద్దరు సాధ్యం కాక చతికిల పడ్డారు. ఆఖరిగా వచ్చాడు ఒక బాహుబలి. అవలీలగా ధనుస్సు ఎత్తి విల్లు ఎక్కుపెట్టాడు. విజయం సాధించాడు. తాను కోరుకున్న యువతిని భార్యగా పొందగలిగాడు. ఆమె కూడా తన మనస్సు నిండా నిండిన ప్రియుణ్ణే వరించింది.
ఆమె యశోధర... కొలియ సామ్రాజ్య రాకుమారి. అతనే సిద్ధార్థుడు. శాక్యవంశ రాకుమారుడు. వారిద్దరి అనురాగ జీవితం పన్నెండేళ్లు సాగింది. యశోధర గర్భవతి అయ్యింది. చూస్తూండగానే నెలలు నిండాయి. ఒక పున్నమి రోజున పండంటి బిడ్డను కన్నది. రాజ్యం అంతటా సంతోష సంబరాలు.. రాజ్యం, అధికారం, వందిమాగధులు, కుటుంబం, ఇప్పుడు ఈ సంతానం... తనను సంసార చక్రం మరింత బంధిస్తుంది అని అనుకున్నాడు సిద్ధార్థుడు. జ్ఞానసాధన సాధ్యం కాదనుకున్నాడు. మానవాళి దుఃఖ నివారణ మార్గాన్వేషణకు ఇవన్నీ అడ్డంకులే అనుకున్నాడు.
ఆ రోజే... తాను సంసార పరిత్యాగం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ విషయం అందరికీ చెప్పాడు. యశోధర అడ్డు చెప్పలేదు. ఉండిపొమ్మనీ విలపించలేదు. మౌన గంభీర సాగరంగా ఉండిపోయింది. ఆనాటి రాచకుటుంబాల ఆచారం ప్రకారం ఆమె మరొకరిని వివాహం చేసుకోవచ్చు. ఎందరో యువకులు ఆమెను వేడుకున్నారు. ‘మేలు వివాహం చేసుకుంటాం’’అని బతిమాలారు. భయపెట్టారు. కాని, ఆమె తన భర్త అడవిలో ఎలా జీవిస్తున్నాడో అలాగే జీవించాలనుకుంది. కాషాయబట్టలు కట్టింది. ఒంటిపూటే తిన్నది. కటిక నేలమీద పడుకున్నది. సిద్ధార్థుడు ఆరేళ్ల అన్వేషణానంతరం జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు. ఏడేళ్లకు తిరిగి ఇంటికి వచ్చాడు.
తన బిడ్డ రాహులుణ్ణి భిక్షువుగా మార్చి తన వెంట తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత బుద్ధుని తల్లిదండ్రులూ బౌద్ధ అనుయాయులయ్యారు. తండ్రి మరణానంతరం తల్లి గౌతమి, మరికొందరు శాక్యవంశ స్త్రీలు బుద్ధుని భిక్షుణీ సంఘంలో చేరారు. వారిలో యశోధర కూడా ఉంది. సంఘంలో చేరిన నాటి నుండి ఆమె పేరు భద్ర కాత్యాయని. ఒకరోజున... ఆమెకు కడుపు బిగదీసింది. ఉదర శూల వేధించింది. ఈ విషయం భిక్షువుగా జీవిస్తున్న రాహులునికి తెలిసింది. వచ్చి విషయం అడిగాడు.
‘‘నాయనా! రాహులా! నేను అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వస్తూ ఉండేది. మామిడిపండు రసంలో చక్కెర కలుపుకుని తాగితే తగ్గిపోయేది. కానీ ఇప్పుడు నేను భిక్షువుని. భిక్షకు వెళ్లినప్పుడు వారు ఏది పెడితే దాన్నే స్వీకరించాలి. నాకు అది కావాలి, ఇది కావాలని అడగకూడదు కదా!’’ అంది.అంతటి ఉదాత్త మహిళ యశోధర. 40 ఏళ్లపాటు భర్త నడిచిన బౌద్ధ ధర్మప్రచారం చేసి 78 ఏళ్ల వయసులో బుద్ధుని కంటె రెండేళ్ల ముందు ‘పరినిర్వాణం’ చెందింది. భరతదేశానికి మహారాణి కావలసిన యశోధర... బౌద్ధ భిక్షుణిగా అలా సాధారణ జీవితం గడిపిన త్యాగశీలి! బౌద్ధ సాపత్యం ప్రకారం ఇది బుద్ధ జయంతే కాదు.. యశోధర జయంతి కూడా!
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment