కోర్కెల ఉచ్చు
బౌద్ధవాణి
అన్ని దుఃఖాలకీ కోరికలే కారణం అనేది బుద్ధుడు చెప్పిన సత్యం. ఈ కోరికలకు మనసే మూలం అంటాడు బుద్ధుడు. మనస్సును అదుపులో ఉంచి, దురాశాపూరితమైన కోర్కెల్ని మనస్సులోకి రానీయకుండా ఉంటే దుఃఖం కలగదని చెప్తాడు. ఒక దురాశ బయలుదేరితే, అది మరో దురాశను రేపి బందీగా చేస్తుందని అంటాడు.ఈ విషయం మీద ఒకసారి మాట్లాడుతూ, ‘‘భిక్షువులారా! హిమాలయ ప్రాంతాల్లో మనుషులుగానీ, కోతులుగానీ సంచరించలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మనుషులు తిరగలేని ప్రదేశాల్లో కోతులు మాత్రమే తిరుగాడే ప్రదేశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో వేటగాళ్లు జిగురు పూసిన ఉచ్చుల్ని ఉపయోగిస్తారు.
తెలివి గలిగిన కోతులు కొత్తగా కనిపించే ఆ ఉచ్చుల జోలికి వెళ్లవు. కానీ ‘అదేందో చూద్దాం’ అనే తుంటరి కోతులు వాటిని పట్టుకుని చిక్కుకుపోతాయి. ఇలాగే ఒక కోతి వెళ్లి తన ఎడమ చేత్తో ఆ ఉచ్చును పట్టుకుని లాగింది. దాని చేయి ఆ ఉచ్చుకు అతుక్కుపోయింది. వెంటనే అతుక్కుపోయిన ఉచ్చును విడిపించుకోడానికి కుడిచేతిని ఉపయోగించింది. అదీ అతుక్కుపోయింది. చేతుల బలం చాలడం లేదనుకుని రెండు కాళ్లనూ ఉపయోగించి తన్నిపట్టి లాగింది. దాంతో రెండు కాళ్లూ అతుక్కుపోయాయి. ఇక లాభం లేదనుకుని ఉచ్చును కొరికేయాలని పళ్లతో ఉచ్చుతాడును గట్టిగా కొరికింది. చివరికి దాని మూతి కూడా అతుక్కుపోయింది. కోర్కెల వెంట పడడం కూడా ఇలానే ఉంటుంది’’ అని చెప్పాడు బుద్ధ భగవానుడు. దాంతో కోర్కెల వలలో చిక్కుకోవడం ఎంత ప్రమాదమో వారందరికీ తెలిసివచ్చింది.
- బొర్రా గోవర్ధన్