ఒక అడవిలో రెండు చిలకలు ఉన్నాయి. ఒక వేటగాడు ఆ రెంటినీ పట్టి రాజుగారికి కానుకగా సమర్పించాడు. రాజు వాటి అందానికి, మాటలకు ముగ్ధుడై బంగారు పంజరాలు చేయించి పెంచుకోసాగాడు. వాటికి రుచికరమైన ఆహారం అందిస్తూ, వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజున అదే వేటగాడు ఒక అందమైన కోతిని పట్టి తెచ్చి రాజుకు సమర్పించాడు. దాని చేష్టలకు ముచ్చటపడ్డ రాజు, దాన్ని ఎంతో శ్రద్ధతో పెంచుతున్నాడు.
కొత్తగా వచ్చిన కోతి మీద శ్రద్ధ పెరగడంతో చిలుకల మీద అశ్రద్ధ ఏర్పడింది. వాటికి సరైన ఆలనాపాలన లేక చిక్కిపోయాయి. ఈ పరిస్థితి చూసిన చిన్న చిలుక, పెద్ద చిలుకతో –‘‘చూశావా అన్నా! రాజుగారికి కోతిమీద ఇష్టం పెరిగింది. మనకు అన్న పానీయాలు అందడం లేదు. మనం ఇక్కడినుంచి వెళ్లిపోదాం’’ అంది. అప్పుడు అన్న చిలుక– ‘‘తమ్ముడూ! తొందరవద్దు. రాజుకి మన మీద ప్రేమ లేక కాదు. కొత్తగా వచ్చింది కాబట్టి కోతిమీద అతని ప్రేమ మళ్లింది. అది కోతి. దాని చేష్టలే దాన్ని ఇక్కడినుంచి తరిమేస్తాయి. సహనం వహించు’’ అన్నాడు.
ఆ రాజుగారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి వారు ఆ కోతి దగ్గరకు వచ్చి ఆటపట్టించారు. కోతికి కోపం వచ్చి, పళ్లు బైటకు తీసి, చెవులు రిక్కించి గట్టిగా అరిచి వాళ్ల మీదికి దూకింది. దానితో వాళ్లు భయంతో కేకలు పెట్టారు. రాజుకి విషయం తెలిసి, ‘ఆ కోతిని బైటికి తరిమేయండి’అని ఆజ్ఞాపించాడు. కోతిపోయాక రాజుగారి ఆలనాపాలనా చిలుకల మీదకి మళ్లింది. చిలుకల అందం, మధుర భాషణం వల్ల వీటికి తిరిగి మర్యాదలు దక్కాయి. వాటి సహన గుణమే వాటికి మేలు చేసింది.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment