పూర్వం హిమాలయ ప్రాంతంలో మణిశిలలతో నిండిన ఒక ప్రదేశం ఉండేది. అక్కడ ఉన్న ఒక కొండగుహలో దాదాపు ముప్ఫై సూకరాలు జీవిస్తూ ఉండేవి. ఆ చుట్టుపక్కల దొరికే దుంపల్ని ముట్టెతో తవ్వుకొని తిని జీవించేవి. కొంతకాలం పాటు అక్కడ ఎలాంటి భయం లేకుండా బతికాయి. కొన్నాళ్ల తర్వాత... ఒక సింహం వచ్చి ఆ పర్వతం మీద తిరుగుతూ ఉండేది. అది ఆ గుహమీదికి గాని, దగ్గరకు కానీ వచ్చినప్పుడు ఆ మణిశిలమీద దాని రూపం ప్రతిఫలించేది. దాంతో అది మరింత పెద్దగా కనిపించేది. ఆ సింహాన్ని చూసి సూకరాలకి భయం పుట్టి, గజగజలాడేవి. గుహదాటి బైటకు వచ్చేవి కావు. అలా అవి రోజురోజుకూ భయం పెంచుకుంటూ, తిండి తినక బక్కచిక్కి పోయాయి.
అప్పుడు వాటిలో కొన్ని సూకరాలు ఇలా అన్నాయి... ‘‘అయ్యో! మనకు ఏమిటి ఈ సింహపు దడుపు? అది కనిపించితేనే వణుకు పుట్టిస్తుంది. దానికి కారణం ఈ మణిశిలే. లేని దాన్ని మరింత పెద్దగా చూపుతుంది. కాబట్టి మనం బయటకు పోయి, బురద పులుముకొని వద్దాం. ఆ బురదను ఈ మణిశిల గుహగోడలకు పూద్దాం. అప్పుడు అది మనకు కనపడదు’’అన్నాయి. ‘సరే’ అని సూకరాలన్నీ చెరువు గట్టుకు పోయి, ఇసుక మట్టిలో పొర్లాడి గుహ దగ్గరకు వచ్చి గుహ గోడలకి రుద్దడం మొదలు పెట్టాయి.
సూకరాల శరీరాలకంటిన ఇసుక రేణువులకు, వాటి వెంట్రుకల రాపిడికి శిలలు మరింత ప్రకాశమానమయ్యాయి. గోడలకు మకిలి అంటకపోగా మరింతగా మెరిశాయి. బుద్ధుడు ఈ కథ చెప్పి– ‘‘మనం అనవసరంగా మంచివారిపై లేనిపోనివి కల్పించి చెబితే నిజం తెలిశాక వారి గుణగణాలు మరింత ప్రకాశిస్తాయి కానీ, వారికెలాంటి అపఖ్యాతీ కలగదు’’అని ప్రబోధించాడు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment