పచ్చని ప్రకృతి మధ్య ఉండే గ్రామం తోటపల్లి. పేరుకు తగ్గట్టే ఆ గ్రామం చుట్టూ పండ్ల తోటలు. ఊరికి దూరంగా చిన్న చిన్న కొండలు. ఊరి మధ్య ఒక ప్రభుత్వ పాఠశాల. చాలా మంచి పాఠశాలగా పేరు పొందడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల పిల్లలు కూడా ఆ పాఠశాలకు వస్తారు. అలా చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చే గ్రామం పెద్దవరం. అయితే ఆ గ్రామం నుండి పాఠశాలకు వచ్చే దారిలో ఒక పిల్ల కాలువ ఉంది. అది ఎగిరి దూకి రాగలినంత చిన్నది కాదు. వంతెన నిర్మించ వలసినంత పెద్దది కూడా కాదు. కాబట్టి కాలువ మధ్యలో ఒక తూము వేసి మట్టిపోసి దారి ఏర్పాటు చేశారు. ఐతే... ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో ఆ దారి దెబ్బతింది. వాహనాల తాకిడికి తూము కూడా కొద్దిగా పగిలిపోయింది.
దానితో నీటిప్రవాహానికి దారంతా కొట్టుకుపోయింది. తూము కూడా దూరంగా జరిగిపోయింది. చిత్తడి నేల కావడంతో నేలంతా బురద బురద అయ్యింది. ఆ దారి గురించి పట్టించుకున్న నాథుడు లేడు. అయినా ఆ దారి గుండా బడి పిల్లలు అలాగే నడిచి పోతున్నారు. కొందరైతే కాలు జారి పడిపోతున్నారు. బట్టలు, పుస్తకాలు తడిసి తిరిగి ఇంటికి వెళ్లి పోతున్నారు. మామూలుగా ఆ దారి వెంట కొందరు టీచర్లు కూడా మోటారు సైకిళ్లపై వస్తూనే ఉంటారు. ఇప్పుడు వారు ఈ దారిగుండా పోవడం మాని... చాలా దూరం ప్రయాణం చేసి బడికి పోతున్నారు. వారిలో సుధీర్ మాస్టర్ కూడా ఒకరు.ఆయన ఒక రోజున ధైర్యం చేసి ఈ దగ్గరి దారిమీదుగా పాఠశాలకు వెళ్లడానికి వచ్చాడు. కాలవ దగ్గర జాగ్రత్తగా మోటార్ సైకిల్ దించాడు. కానీ అవతలి ఒడ్డుకు పోగానే చక్రం జారిపోయింది. బండి పక్కకి ఒరిగిపోయింది. మాస్టారు కాలు ఆనించాడు. కాలు బురదలో దిగబడింది. ఫ్యాంటుకు బురద అంటింది.
అప్పుడు అక్కడే ఉన్నారు తథాగత్, అతని చెల్లెలు సుజాత. వారు వెళ్లి మోటార్ సైకిల్ పడకుండా పట్టుకున్నారు. వెనక నుండి బలంగా పైకి నెట్టారు. సుధీర్ మాస్టారు గట్టెక్కి, వారిద్దరికీ థాంక్స్ చెప్పి – ‘నా ఫాంట్ స్కూలుకు వెళ్లి కడుక్కుంటాను. ఈ రోజున ఆటల పోటీలు ఉన్నాయి. త్వరగా వచ్చేయండి’ అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ అన్నాచెల్లెళ్ళు చదువులోనే కాదు ఆటల్లో కూడా మంచి మంచి బహుమతి పొందగలరు. తథాగత్ ఎనిమిదో తరగతి. అతని చెల్లి ఏడు. తథాగత్ ఆలోచిస్తూ బ్యాగ్ పక్కన పెట్టి – ‘చెల్లి! మొన్న నీవు ఇక్కడ పడిపోయావు. అంతకుముందు చాలా మంది మన స్కూల్ పిల్లలు పడిపోయారు. ఈ రోజు మాస్టారు కూడా పడిపోయారు. కాబట్టి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. ఈ రోజే ఈ దారిని సరి చేస్తాను. కాబట్టి స్కూల్‌కి రాను. నువ్వు వెళ్ళు’ అన్నాడు
‘మాస్టర్లు, అమ్మానాన్నలు తిడతారేమో’ అంది గౌతమి. ‘అయినా సరే ఈ దారి బాగు చేస్తాను. నీవు వెళ్లు’ అన్నాడు. ‘లేదన్నయ్య! నేనూ వెళ్ళను. నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాను’ అంటూ సుజాత తన సంచిని కూడా కింద పెట్టింది. అలా వారిద్దరూ పని ప్రారంభించారు. దూరంగా పడి ఉన్న తూమును బలంకొద్దీ తెచ్చారు. మధ్యలో పెట్టారు. దూరంగా ఉన్న రాతిముక్కలు తెచ్చి బలమైన దారి నిర్మించారు. సాయంత్రం ఇంటికి చేరి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారెంతో సంతోషపడ్డారు. ఆ రోజు సాయంత్రం స్కూల్లో జరిగిన సభలో అన్నా చెల్లెలు ఇద్దరూ చదువుల్లో బహుమతులు పొందారు. ఆటలో పాల్గొనక పోవడం వల్ల బహుమతులు రాలేదు. కానీ వారిద్దరినీ హెడ్మాస్టర్ గారు ఎంతో మెచ్చుకున్నారు. వారు చేసిన పనికిగాను ఇద్దరినీ సత్కరించి బహుమతులు అందించారు. సుధీర్ మాస్టారు అయితే ప్రత్యేకంగా ఇద్దరికీ ఖరీదైన పెన్నులు ప్రజెంట్ చేశారు. సమాజ సేవ ఎలాంటి గౌరవాన్ని తెస్తుందో అందరికీ అర్థం అయింది.
– బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment