బర్రె దూడ గట్టుమీద మేస్తోంది. దాని వంక ఒకసారి కళ్ళు తెరచి చూసి గట్టిగా మూసుకున్నాడు విశాల్. దాన్ని వాడు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకసారి కురిసిన భారీ వర్షాలకు చావిడి గోడ విరిగిపడి దూడ కాళ్ళు విరిగాయి. తర్వాత నెమ్మదిగా కోలుకుంది. దాన్ని ఇప్పుడు మరింత భద్రంగా పెంచుకుంటున్నాడు విశాల్.
ఆ రోజు బడి నుండి వచ్చాక ఊరి చివరికి పశువులను తోలుకు పోయాడు. మిగిలిన పిల్లలతో కలసి ఆటలలో పడ్డాడు. అంతలో దూడ అరుపు వినిపించి చుట్టూ చూశాడు. అక్కడ విశాలాక్షి తన బర్రె దూడను కొట్టేస్తోంది. పరుగున వెళ్లి ‘ఎందుకలా కొడుతున్నావు? అది అవిటిది కదా! కనిపించట్లేదా?’ అన్నాడు కోపంగా. ‘మా నారుమడిలో పడి మేసేసింది. దీన్ని కొట్టాలా వద్దా?’ అంటూ మళ్లీ కొట్టింది.
‘పచ్చగా ఉంటే పశువుల రావా? ముందు అలా కొట్టడం ఆపు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావ్’ అన్నాడు తన చేతిలోని కర్రను ఎత్తి పెట్టి. వాళ్ళిద్దరి మధ్య గొడవ. తిట్లు.
‘ఆపుతావా ఆపవా’ అంటూ తన చేతిలో ఉన్న కర్రతో విశాలాక్షిని కొట్టాడు. ఏడుస్తూ ఇంటికి పోయింది విశాలాక్షి. అరగంట తర్వాత తన కూతురు విశాలాక్షిని తీసుకుని విశాల్ వాళ్ళ ఇంటికి వచ్చాడు సోమన్న. వాళ్ళు వచ్చేసరికి విశాల్ తండ్రి సత్యం వసారా అరుగు మీద కూర్చుని ఉన్నాడు. విశాల్ ఆయన పక్కనే ఉన్నాడు. ‘చూడు బావా! మీ వాడు మా పిల్లని ఎలా కొట్టేశాడో’ అంటూ కందిపోయిన దెబ్బలను చూపించాడు. విశాలాక్షి ఏడుస్తూనే ఉంది. ‘ఏం జరిగింది?’అని పిల్లలిద్దర్నీ అడిగాడు సత్యం. ఎవరి వాదన వారిది.
‘మా చేలో పడి మేసిన దూడను కొట్టక ఏం చేయాలి?’ అన్నాడు సోమన్న.
‘‘దూడను కాదు, నన్ను కొట్టాలి’ అంటూ ముందుకు వచ్చి నిలబడ్డాడు విశాల్.
‘నిన్నా?’ ‘అవును మామ. నన్నే. పశువు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేస్తుంది. దానిని నేను జాగ్రత్తగా కాయాలి. నా తప్పు వల్ల అది దెబ్బలు తింది. పైగా కుంటిది. తప్పు నాది కాబట్టి నన్నే కొట్టాలి‘ అన్నాడు మరింత ధైర్యంగా. ఆ మాటలకు అక్కడ ఉన్న వారంతా నిశ్చేష్టులయ్యారు. సోమన్నకు కోపం మాయమైపోయింది. పెద్దగా నవ్వి ‘బావా! వీడు మామూలోడు కాదు. నాకే బుద్ధి చెప్పాడు’ అంటూ నవ్వాడు.
‘నీకు బుద్ధి చెప్పటం ఏమిటి?’ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సత్యం. ‘అవును బావా! తప్పు దీనిది కాదు. వీడిది కాదు. బర్రె దూడదీ కాదు. నాది. నా మడి చుట్టూ కంచె వేసుకుంటే ఈ గొడవ లేదు కదా. ఇప్పుడే వెళ్లి ఆ పని చేస్తాను‘ అన్నాడు భుజం మీద ఉన్న కండువా తలకు చుట్టుకుని. ‘మామ! నేనూ వస్తా. నీకు సహాయం చేస్తా.‘ అంటూ ఆ వెనకే వెళ్లాడు విశాల్.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment