ఒక జాతిగాని, కులంగానీ, వంశంగానీ మొత్తంగా ఉన్నతోన్నతమైంది ఉంటుందా అనే ధర్మసంశయం ఆనందుణ్ణి పట్టి పీడించసాగింది. ఆనందుడు బుద్ధుని సోదరుడు. భిక్షువై, తన అన్న ఆదర్శాలను పాటిస్తూ, భిక్షు సంఘంలో జీవించాడు. ఆనందుడు ఒకసారి బుద్ధునితో– ‘‘భగవాన్! మీరు సింధూ దేశంలో మేలు జాతి సైంధవ అశ్వాలు ఉంటాయని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో శ్రేష్ఠమైన వృషభాలు జన్మిస్తాయని చెప్పారు. మేలు జాతికి చెందిన ఛద్ధంతి ఏనుగులు ఏనుగుల్లో ఉత్తమమైనవని సెలవిచ్చారు. అలాగే ధాన్యాల్లో, ఫలాల్లో, వృక్షాల్లో ఉత్తమ జాతి గురించి వివరించారు. కానీ, ఉత్తమమైన మానవ జాతి గురించి, ఆ జాతి జీవించే ప్రదేశాలూ, దేశాలూ, వంశాలూ, జాతుల గురించి చెప్పనే లేదు?’అని ప్రశ్నించాడు.
దానికి బుద్ధుడు –‘‘ఆనందా! అలాంటి ప్రత్యేక జాతులూ, వంశాలు మానవుల్లో ఉండవు. ఒకే గుణాన్ని అందిపుచ్చుకునే వంశంగానీ, జాతిగానీ, కులంగానీ ఉండవు. ఉత్తముడైన వాడు ఎక్కడో ఒకచోట జన్మించవచ్చు. అలా ఒక ఉత్తముడు జన్మించడం వల్ల ఆ వంశానికో, జాతికో కీర్తీ సంతోషాలు కలగవచ్చు.
అంతేకానీ, ఉత్తమమైన జాతిగానీ, అధమమైన జాతిగానీ మనుషుల్లో ఉండవు’’ – అని చెప్పాడు. జంతువులు తమ బలాల్ని బట్టి ఉత్తమమైనవి ఎంచబడతాయని, మనుషులు బలాన్ని బట్టిగాక, గుణాల్ని బట్టి ఎంచబడతారనే బుద్ధ సందేశాన్ని ఆనందుడు గ్రహించాడు. జాత్యహంకారులకు ఈ బుద్ధప్రబోధం పెద్ద కనువిప్పు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment