అమ్మవారి ఆరాధనలతో సాగిన ఈ నవరాత్రులు అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అత్యంత మహిమాన్వితమైంది. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్ధినీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తుంది.
మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారు భక్తులు. మహిషాసురుడనే రాక్షసుడుతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా హోరాహోరీగా పోరు సలిపి.. ఆశ్వయుజ శుక్ల నవమి రోజున ఉగ్ర రూపంలో అంతమొందించిందని పురాణ కథనం. అందువల్లే దుర్గమ్మను మహిషాసుర మర్దినిగా కొలుచుకుంటున్నారు భక్తులు
మరికొన్ని చోట్ల చివరి రోజున దుర్గమ్మను సిద్ధిధాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది. ఈ మాతకు నాలుగు చేతులు ఉన్నాయి. కుడి చేతిలో శంఖం, చక్రం, ఎడమవైపున చేతిలో తామరపువ్వులు ఉంటాయి. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రీ మాత అణిమ, ఇషిత్వ, వశిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత.
ఈ మాతను ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని, పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. అంతేగాదు ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారు.
నైవేద్యంగా..
వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం, చక్కెర పొంగలి నివేదిస్తారు.
(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!)
Comments
Please login to add a commentAdd a comment