అంబేడ్కర్ ఆలోచనల వక్రీకరణ బాధాకరం
అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్‌తుంబ్డే
హైదరాబాద్: అంబేడ్కర్ ఆలోచనలు, తాత్విక చింతనపై ‘ఆర్గనైజర్’ పత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేయడం హర్షణీయమని, అదే సమయంలో ఆయన ఆలోచనలను వక్రీకరించడం బాధాకరమని, అంబేడ్కర్ మనవడు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్‌తుంబ్డే అన్నారు. తాత్విక చింతన, సామాజిక, ఆర్థిక అంశాలపై అంబేద్కర్ భావజాలం చాలా విశిష్టమైనదని కొనియాడారు. ‘అంబేడ్కర్ ఆలోచనలను ఎవరూ వక్రీకరించలేరు.’
అనే పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ చెప్పినవి చెప్పినట్లు రాస్తే తమకు బాధ కలిగి ఉండేది కాదని, అబద్ధాలను జోడించి పుస్తకాన్ని విడుదల చేయడం సరికాదని విచారం వ్యక్తం చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం మాట్లాడుతూ అంబేడ్కర్‌పై ఆర్గనైజర్ అనే ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక తీసుకువచ్చిన ప్రత్యేక సంచికలో ఒకటి తప్ప అన్ని వ్యాసాల్లోనూ వక్రీకరణలు ఉన్నాయన్నారు.
వక్రీకరణలను, మోసాలను, అవమానాలను ఎదుర్కొనేందుకే ‘అంబేడ్కర్ ఆలోచనలను ఎవరూ వక్రీకరించలేరు’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. అన్ని ప్రధాన నగరాల్లో సదస్సులను ఏర్పాటు చేసి ఈ వక్రీకరణలను ప్రజల్లో ఎండగడతామన్నారు. కార్యక్రమంలో ఇఫ్లూ అసోసియేట్ ప్రొఫెసర్ కె.సత్యనారాయణ, హెచ్‌సీయూ అసోసియేట్ ప్రొఫెసర్లు కె.వై.రత్నం, కె.లక్ష్మీనారాయణ, విరసం నేత వరవరరావు పాల్గొన్నారు.