కొత్త విభాగాల్లోకి తత్వ హెల్త్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉన్న తత్వ హెల్త్ అండ్ వెల్‌నెస్ కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలే కేసరి బ్రాండ్ పేరుతో కుంకుమ పువ్వు అమ్మకాలను ప్రారంభించిన ఈ సంస్థ త్వరలో డ్రై ఫ్రూట్స్ విపణిలోకి ప్రవేశిస్తోంది. వివిధ దేశాల నుంచి నాణ్యమైన రకాలను సేకరించి ఇక్కడ విక్రయిస్తామని తత్వ హెల్త్ ఎండీ సచిన్ జైన్ తెలిపారు. సాఫ్రాన్ టీ, మిల్క్‌ను సైతం ప్రవేశపెడతామని చెప్పారు.
హైదరాబాద్ మార్కెట్లో కేసరి బ్రాండ్ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా నేషనల్ సేల్స్ మేనేజర్ కె.గురుప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కుంకుమ పువ్వు అత్యధికంగా పండే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాదిన కుంకుమ పువ్వును తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారని వివరించారు. భారత్‌లో సాఫ్రాన్ అమ్మకాల్లో 70-80 శాతం నకిలీదేనని అన్నారు. కశ్మీర్‌లో ఈ ఉత్పాదన సాగు పెంచేందుకు స్పైస్ బోర్డ్‌కు ప్రతిపాదన చేశామన్నారు.