Health and Wellness
-
వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
ఇటీవల చిన్న ఆరోగ్య సమస్య వస్తే సంప్రదించడానికి బాగా పరిచయం, వైద్య వృత్తిలో ఐదారు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం, ఎండీ జనరల్ మెడిసిన్ డిగ్రీ ఉన్న ఒక సీనియర్ జన రల్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్లాం. డాక్టర్ చాలా విపులంగా పరీక్ష చేశారు. బహుశా ఆయన స్పెషలిస్ట్ కాకపోవడం వల్లనే ఇలా పరీక్షించగలిగారు. అదే ఏ స్పెషాలిటీ ఆసుపత్రికో కన్సల్టేషన్ కు పోతే ఆ అనుభవమే వేరు. రోగి వంటిమీద ఏ స్పెషలిస్టయినా చెయ్యి వేయడం కానీ, స్టెత్ పెట్టి చూడడం కానీ సాధారణంగా ఉత్పన్నం కాదు. స్పెషలిస్టుల అప్పాయింట్మెంట్ దొరకడం, కలవడం ఒక ప్రహసనం. భారీ మొత్తంలో కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించుకుని, గంటలకొద్దీ వెయిట్ చేసి, బయటనే పారా మెడికల్ వ్యక్తితో బీపీ, సాచ్యురేషన్, బరువు ఇత్యాదులు చూపించుకుని, స్పెషలిస్టును కలిసీ కలవడంతోనే సమస్య విని, తక్షణమే ఖరీదైన డయాగ్నాస్టిక్ పరీక్షలు చేయించాలి అంటారు చాలామంది. రిపోర్టులు వచ్చిన తరువాత చాలా మంది స్పెషలిస్టులు పూర్తిగా వాటి ఆధారంగా చికిత్స మొదలు పెట్టడమే కాని క్లినికల్‌గా కోరిలేట్ చేసుకోవడం ఆరుదేమో అనాలి. పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్టుల దగ్గర, వాళ్లు చూడడానికి ముందు ఒక సహాయక డాక్టర్ రోగి వివరాలు తీసుకుంటారు. ఆ వివరాల మీదా, రేడియాలజీ, పాథాలజీ పరీక్షల రిపోర్టుల మీదా ఆధారపడి సాగు తున్నది ఆధునిక వైద్యం. ఇది మంచిదా కాదా అంటే జవాబు చెప్పగలిగేవారు ఆ రంగానికి చెందిన నిపుణులే. వైద్యరంగంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పులు, అభివృద్ధి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సిందే కాని, వాటి మరో కోణం కొంత ఆందోళనకు దారి తీస్తుంది అనడం తప్పుకాదేమో! ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్ చదువుతో ఆపి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రయివేట్ ప్రాక్టీసో చేసుకునేవారు. ఎక్కువలో ఎక్కువ జనరల్ మెడిసిన్, లేదా జనరల్ సర్జరీ చదివేవారు. వారిదగ్గరికి పోయిన రోగికి చికిత్స చేసే క్రమంలో రోగి నాడి చూడడం దగ్గరనుండి, స్టెతస్కోప్ వంటిమీద పెట్టి రోగ నిర్ధారణ చేయడంతో సహా, బీపీ చూడడం, అవసరమైన వారికి స్వయంగా ఇంజక్షన్ ఇవ్వడం, కట్టు కట్టడం లాంటి అనేకమైన వాటిని డాక్టర్ స్వయంగా చేసేవాడు. రోగికి ఎంతో తృప్తి కలిగేది. వారే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎప్పుడైతే స్పెషలిస్టులు వైద్య రంగంలో పెరిగిపోసాగారో, ఒక్కో రుగ్మతకు ఒక్కో డాక్టర్ అవసరం పెరగసాగింది. ఈ నేపథ్యంలో, ఎంబీబీఎస్ తప్ప అదనపు స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ లేని ప్రజా వైద్యుడు, 50–60 సంవత్సరాల క్రితమే వృత్తిపరంగా రోగుల అన్నిరకాల రుగ్మతలకు తన అనుభవాన్ని ఆసాంతం రంగరించి చికిత్స చేసిన మహా మనీషి, ఖమ్మం జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) అనుభవం నుంచి ప్రతి వైద్యుడూ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, ‘స్పెషలిస్టు’ డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. అధికశాతం జనరల్ ప్రాక్టీషనర్లే. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారే. ప్రముఖులతో సహా పలువురికి, ఆయన అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా ఖమ్మం పట్టణంలో మొదటి టాన్సిల్ ఆపరేషన్ చేసింది ఆయనేనేమో. అలాగే వేసెక్టమీ ఆపరేషన్లు ఖమ్మంలో ప్రారంభించిది కూడా ఆయనే. డాక్టర్ రాధాకృష్ణమూర్తి చేసిన ఆపరే షన్లలో, ఈ రోజుల్లో స్పెషలిస్ట్ వైద్యులు మాత్రమే చేస్తున్న హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఎవరూ చేపట్టని ధనుర్వాతం కేసులకూ ఆయన చికిత్స అందించేవారు. అప్పట్లో క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించారు రాధాకృష్ణమూర్తి. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే ‘ఆర్టిఫీషియల్ న్యూమో థొరాక్స్’ అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను ‘కొలాప్స్’ చేసే పద్ధతి పాటించే వారు. ఎముకలు విరిగినవారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. ఇంకా కొంచెం వెనక్కు పొతే, ఆర్ఎంపీల ప్రాక్టీసు చేసిన రోజులు జ్ఞప్తికి వస్తాయి. నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా ‘సుస్తీ‘ చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము–తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలికా వైద్యులు, ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. వారిలో కొందరికి ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లుయెంజా, మలేరియా–చలి జ్వరం) ఏపీసీ ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. గ్రామాలలో ‘గత్తర’ (కలరా), ‘స్పోటకం– పాటకం’ (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు ‘దద్దులు’, ‘వంచెలు’ కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, ‘టీకాలు’ వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. ఊళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని సమీపంలోని పట్టణానికి పోయే వాళ్లు. వారి వెంట (ఆర్ఎంపీ) డాక్టర్ కూడా వెళ్లేవాడు. (క్లిక్ చేయండి: ‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి) ఇప్పుడైతే ప్రతిచోటా వందలాది మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, మల్టీ సూపర్ స్పెషలిస్టులు, వందల–వేల నర్సింగ్ హోంలు, సూపర్ స్పెషాలిటీ– మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు; వాటికి ధీటుగా, మరింత మెరుగ్గా ప్రభుత్వ రంగంలో, వివిధ అంచెలలో అన్నిరకాల వైద్యసేవలు, అందరికీ ఉచి తంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. డయాగ్నాస్టిక్ పరీక్షలన్నీ ప్రభుత్వ పరంగా అన్ని స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా లభ్యమవు తున్నాయి. భవిష్యత్తులో, బహుశా క్వాలిఫైడ్ డాక్టర్ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదేమో! అయినా ఎక్కడో, ఎందుకో, ఏదో కానరాని వెలితి! (క్లిక్ చేయండి: కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!) - వనం జ్వాలా నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ -
Monkeypox Virus: కలవరపెడుతున్న మంకీ పాక్స్.. మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా..?
కరోనా తర్వాత కాస్తంత అదే స్థాయిలో హల్చల్ చేస్తున్న వైరస్ ‘మంకీపాక్స్’. ఇది అప్పుడెప్పుడో మూడు నాలుగు తరాల ముందు జనాన్ని భయభ్రాంతుల్ని చేసిన మశూచీ (స్మాల్‌పాక్స్) కుటుంబానికి చెందింది. కోవిడ్ తర్వాత ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని అదే స్థాయిలో గడగడలాడిస్తుందన్న వార్తల నేపథ్యంలో దీని గురించి అవగాహన కోసం ఈ కథనం. దీన్ని మొట్టమొదటిసారి 1958లో కనుగొన్నారు. కోతులు ఎక్కువగా ఉండే కాలనీల్లో బయటపడటం వల్ల దీనికి ‘మంకీ పాక్స్’ అని పేరొచ్చింది. అయితే మానవుల్లో మొదటి కేసును 1970వ పడిలో కనుగొన్నారు. అప్పట్లో మశూచీ నిర్మూలన కోసం పెద్దఎత్తున క్యాంపెయిన్ జరుగుతుండే కాలంలో దీన్ని ఆఫ్రికా ఖండంలోని ‘కాంగో’ (డెమక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో)లో కనుగొన్నారు. అప్పట్లో ఆఫ్రికా ఖండంలోనే లైబీరియా, నైజీరియా, సియారాలియోనీ లాంటి ప్రాంతాల్లోనూ కొన్ని కేసులు చూసినా అత్యధికంగా కనబడ్డది కాంగోలోనే. కానీ ఇప్పుడు తాజాగా ఒకేసారి 226కు పైగా కేసులిప్పుడు అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలోని అనేక దేశాల్లో కనబడుతుండటంతో ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. ఇది వైరస్‌తో వచ్చే జబ్బు కావడం... అందునా ఒకసారి యూఎస్, యూరప్‌లలో కనిపించిందంటే ఇక మిగతా దేశాలకు చేరడానికి పెద్ద సమయం పట్టకపోవడం లాంటి అంశాలు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే దీని విషయంలో అప్రమత్తత పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది. లక్షణాలు: జ్వరం , ఒళ్లునొప్పులు, వీపునొప్పి, తీవ్రమైన అలసట, రాత్రిళ్లు చలిజ్వరంతో వణుకు, లింఫ్ గ్లాండ్స్‌లో వాపు, ఒళ్లంతా దద్దుర్లు మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తికి తొలుత తీవ్రమైన జ్వరం వస్తుంది. కొందరిలో దగ్గు, తీవ్రమైన నిస్సత్తువ, జబ్బుగా ఉన్నప్పుడు అనిపించేలా ఏదో ఇబ్బందికరమైన భావన (మలేసీ) వంటి లక్షణాలూ ఉంటాయి. దాంతోపాటు ఒళ్లునొప్పులు, వీపునొప్పి, తీవ్రమైన అలసట, రాత్రిళ్లు చలిజ్వరంతో వణుకు, లింఫ్గ్లాండ్స్లో వాపు వంటి లక్షణాలూ ఉండవచ్చు. మనలోకి వైరస్ ప్రవేశించాక దాన్ని ఎదుర్కొనడానికి మన దేహం సమాయత్తమవుతుంది. ఇందుకు నిదర్శనమే ఇలా లింఫ్గ్లాండ్స్లో వాపు రావడం. జ్వరం వచ్చి తగ్గాక 2 – 4 రోజుల్లో ఒళ్లంతా దద్దుర్లలాంటి ర్యాష్ వస్తుంది. ఆ దద్దుర్లు పెరిగి పుండ్లలాగా మారవచ్చు. అవి ముఖం మీద, వీపు మీద... ఇలా శరీరంలోని ఏ భాగం మీదైనా... అంటే కొన్ని సందర్భాల్లో నోరు, ముక్కులోని మ్యూకస్ పొరల్లోనూ రావచ్చు. అలా అవి 14 రోజుల నుంచి 21 రోజుల పాటు పచ్చిగా ఉండి, క్రమంగా ఎండిపోతాయి. దాదాపు నాలుగు వారాల తర్వాత వ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. కానీ చర్మంపై మచ్చలు మాత్రం చాలా రోజుల పాటు అలాగే ఉండిపోతాయి. మొదట్లో బాగా డార్క్‌గా కనిపించే ఈ మచ్చలు కాలం గడిచే కొద్దీ చర్మం రంగులోకి కలిసిపోతున్నట్లుగా క్రమంగా పలచబడతాయి. వ్యాప్తి: ఇది కోతుల నుంచి కొన్ని పెంపుడు జంతువుల్లోకి... అక్కణ్ణుంచి తన జన్యుపటలాన్ని మనుషులకు వ్యాప్తించెందేలా మార్చుకుని మనుషులకు వ్యాపించినట్లుగా భావిస్తున్నారు. ఒకసారి మనుషుల్లోకి వచ్చాక... మాట్లాడుతున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు వెలువడే డ్రాప్‌లెట్స్‌తో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అలాగే బాధితులు వాడిన పడక లేదా ఇతర దుస్తులను తాకినప్పుడు... అంటే డ్రాప్లెట్స్ కారణంగా వ్యాపించవచ్చు. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు ∙ప్రధానంగా ఈ వైరస్ కోతుల నుంచి వచ్చిందని భావించినా... పెంచుకోడానికి అనువుగా ఉండే కొన్ని ఎలుకల (రొడెంట్స్) జాతుల నుంచి కూడా వ్యాపించవచ్చన్నది నిపుణుల భావన. అందుకే ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల నుంచి కొంతకాలం పాటు దూరంగా ఉండటం మంచిది. ∙వైరస్ సోకి బాధపడుతున్న రోగిని ఐసోలేట్ చేయాలి. ఇంట్లోని కుటుంబసభ్యులు బాధితుల నుంచి కొద్దిరోజుల పాటు దూరంగా మెలగాలి. ∙పెంపుడుజంతువును గానీ లేదా బాధితుడిని గాని తాకినట్లు అనుమానం వస్తే సబ్బుతోగానీ లేదా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్‌తోగానీ చేతులు శుభ్రం చేసుకోవాలి. ∙బాధితులకు దగ్గరగా వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు పీపీఈ కిట్లు ధరించాలి. అంటే మంకీపాక్స్ విషయంలోనూ ఇంచుమించు కరోనా వైరస్‌కు సంబంధించిన జాగ్రత్తలే తీసుకోవాలి. ఇక్కడ కూడా అవే బాగా పనికి వస్తాయి. చికిత్స: ఇది వైరస్ కారణంగా వచ్చే జబ్బు కావడంతో దీనికి నిర్దిష్టంగా మందులు ఉండవు. లక్షణాలను బట్టి మందులు (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) వాడాల్సి ఉంటుంది. అయితే కొన్ని యాంటీవైరల్ మందులను ఇందుకోసం వాడవచ్చనీ, మశూచీ (స్మాల్‌పాక్స్) కోసం వాడిన వ్యాక్సిన్ కూడా కొంతవరకు దీని తీవ్రతను తగ్గిస్తుందని ఇప్పటికి నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్ లాగే మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా? ఇప్పటికిప్పుడైతే అలా మారే అవకాశం లేదు. వ్యాధి సోకిన తర్వాత ఒంటిపై మచ్చలు చాలాకాలం ఉండిపోయినప్పటికీ చాలావరకు ఇది తనంతట తానే తగ్గిపోయే వ్యాధి (సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్) కావడంతో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల భావన. అందుకే దీని కారణంగా పెద్ద ఎత్తున లాక్డౌన్లూ, ఇతరత్రా ఆంక్షలు అవసరం లేనప్పటికీ... ఇది వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తూ... అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వైరాలజీ నిపుణులతో పాటు సంబంధిత ఇతర రంగాలకు చెందిన నిపుణులంతా దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. -డాక్టర్ కిరణ్మయి పగడాల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ – డయాబెటాలజిస్ట్ -
ఎడతెరపిలేని ఎక్కిళ్లా.. ఇలా చేయండి..!
ఆగకుండా వస్తున్న ఎక్కిళ్లు ఎంతో ఇబ్బంది పెడతాయి. నలుగురిలో ఉన్నప్పుడు ఇది మరీ పెద్ద సమస్య అవుతుంది. ఈ కింది చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే... కొద్దిసేపు ఊపిరి బిగబట్టాలి. ఇలా కాసేపు బిగబట్టాక మళ్లీ గాఢంగా శ్వాస తీసుకుని, వదిలి... మరోసారి బిగబట్టాలి. ఇలా శ్వాస తీసుకుంటూ... బిగబడుతూ... ఈ ప్రక్రియను కాసేపు కొనసాగిస్తే ఎక్కిళ్లు ఆగుతాయి. గబగబా ఊపిరి తీసుకుంటూ ఉండటం కూడా ఓ పద్ధతి. ఓ రెండు నిమిషాల పాటు ఇలా చేయాలి. ఎక్కిళ్లు ఆగాక మళ్లీ మామూలుగానే ఊపిరి తీసుకోవాలి. రిలాక్స్డ్గా కూర్చుని... ఆ తర్వాత మోకాలిని ఛాతీ వరకు తెచ్చి... అలా కాసేపు దాన్ని ఛాతీకి ఆనించి ఉంచాలి. ఆకస్మాత్తుగా భయపెట్టడం వంటి చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయంటారు గానీ అది అంత మంచిది కాదు. ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నవారు గ్లాసులోని నీళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగుతూ ఉంటే ఎక్కిళ్లు ఆగుతాయి. కొద్దిగా చక్కెర వేసిన నీళ్లతో మరింత ప్రభావం ఉంటుంది. వీలైనంత గా ఎక్కిళ్ల మీదినుంచి దృష్టి మళ్లించాలి. ఒక స్పూను చక్కెరను నోటిలో వేసుకుని చప్పరించడం, యాలుక్కాయను తినడం, ఖాళీ కవర్లోకి గాలిని ఊదడం వంటి వాటివల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయంటారు. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతోనూ ఎక్కిళ్లు ఆగకపోతే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. -
సత్తు షర్బత్.. వేసవిలో శరీరానికి వేడిచేయకుండా కాపాడుతుంది..!
కావలసినవి: వేయించిన శనగపప్పు – కప్పు, నిమ్మకాయలు – రెండు, పంచదార పొడి – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు – ఏడు, పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి), జీలకర్ర పొడి – అరటీస్పూను, బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను, సాధారణ సాల్ట్ – పావు టీస్పూను, ఐస్‌క్యూబ్స్ – పావు కప్పు. తయారీ: ∙శనగపప్పుని మిక్సీజార్‌లో వేసి మెత్తగా పొడిచేయాలి. ఈ పొడిని జల్లెడపట్టుకుని ఒకగిన్నెలోకి తీసుకోవాలి. ∙శనగపిండిలో కొద్దిగా నీళ్లుపోసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత కప్పు నీళ్లుపోసి మరోసారి కలుపుకోవాలి ∙ఇప్పుడు దీనిలో బ్లాక్‌సాల్ట్, సాధారణ సాల్ట్, పంచదార పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, పుదీనా ఆకులను సన్నగా తరిగి వేసి చక్కగా కలపాలి ∙చివరిగా ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్చేసుకుంటే సత్తు షర్బత్ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ షర్బత్లోని ఉప్పు, ఐరన్, పీచుపదార్థం జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేసి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధ్దకం వంటి సమస్యలను దరిచేరనివ్వవు. దీనిని పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది∙ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి మంచి డీటాక్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వేసవిలో రోజుకొక గ్లాస్ తాగితే.. దాహం తీరడంతోపాటు, శరీరానికి వేడిచేయకుండా ఉంటుంది. -
ఒక్క హూప్తో ఎన్నెన్నో ప్రయోజనాలు, మీరూ ట్రై చేస్తారా?
కాస్త సీరియస్‌గా ఎక్సర్సైజ్లు చేసే వాళ్లకు హూలాహూప్ గురించి తెలిసే ఉంటుంది. హూలాహూప్ అంటే రబ్బర్ లేదా స్టిఫ్ గ్రాస్ లేదా తేలికపాటి కొయ్యతో తయారైన ఒక పెద్ద రౌండ్ చక్రం. దీన్ని నడుము, పాదాలు లేదా మెడ చుట్టూ తిప్పుతూ బాలెన్స్ చేస్తారు. ఇది మనిషి మనుగడలో ఎప్పటినుంచో ఉంది. కానీ ఆధునిక హూలాను 1958లో ఆర్ధర్ కనుగొన్నాడు. పిల్లలు వాడే హూప్ వ్యాసం దాదాపు 28 అంగుళాలు, పెద్దలు వాడే దాని వ్యాసం 40 అంగుళాలు ఉంటుంది. హులా హూప్ అలవాటు కావటానికి కొంచెం సమయం పడుతుంది కానీ, ఒకసారి హులా హూప్ చేయటం ప్రారంభించాక మీ శరీర కండరాలు బలపడి, మంచి శరీర ఆకృతి మీ సొంతం అవుతుంది. హులా హూప్ ద్వారా చేతులు, కాళ్ళు, తొడలు, పిరుదులు, ఉదరభాగం, వెన్నుభాగం కూడా మంచి ఆకృతిని సంతరించుకుంటాయి. ప్రయోజనాలు... 1 కార్డియో కండరాలకు బలం: హూప్తో చేసే ఎక్సర్సైజ్లు కార్డియో విభాగం కిందకు వస్తాయి. ఇవి గుండె, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు, డయాబెటిక్స్, కొలెస్ట్రాల్ పెరుగుదల లాంటి రిస్కులు తగ్గుతాయి. బ్రెయిన్ సెల్స్ చురుగ్గా తయారవుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. హూప్తో ఒక క్రమబద్ధమైన రిధమ్ సాధించగలిగితే రక్తప్రసరణ మెరుగవుతుంది, కేలరీ లు కరిగిపోతాయి. 2 ఆబ్స్ కోసం: హులా వ్యాయామం శరీర ఉదరభాగంలోని కండరాలను ప్రభావితం చేస్తుంది. హూప్‌కు అనుగుణం గా మీ శరీరాన్ని తిప్పటం వలన కండరాలు స్ట్రెచ్ అవుతాయి. దీంతో బలమైన ఆబ్స్ వస్తాయి. నడుము షేప్ బాగా రావాలంటే రోజులో కనీసం 5 – 7 నిమిషాల పాటూ 3 సెట్లుగా హులా హూప్ వ్యాయామం చేయాలి. ఇందుకు కనీసం పావుగంట సమయం వెచ్చించాలి. 3 నిస్సత్తువను పారదోలడానికి: హులా హూప్ సులభంగా కనపిస్తుంది, కానీ అంత వీజీకాదు. అదే సమయంలో ఇది నేర్చుకోవడం మంచి వినోదాన్నిస్తుంది. దీనిని ఒక వ్యాయామంగా కాకుండా ఒక ఆటగా ఆస్వాదించే వారు ఎక్కువ సమయం పాటూ హులా హూప్ చేస్తుంటారు. దీనివల్ల మన ఒంట్లో సత్తువ (స్టామినా) పెరిగి, బద్దకం వదులుతుంది. 4 పెరిగే ఏకాగ్రత: హులా హూప్ చేయటానికి వివిధ కండరాల మధ్య సమన్వయం అవసరం. శరీర కండరాలను సరైన సమయంలో సరైన విధంగా కదపగలిగితేనే హులా హూప్ తిరుగుతుంది. ఇందుకు మంచి సాధన అవసరం. హులా హూప్ తిప్పడం మన ఏకాగ్రత స్థాయిలను పెంచుతుంది. 5 ఖర్చు తక్కువ: దీన్ని ఇంటివద్దే చేసుకోవచ్చు. ఫీజులు కట్టి జిమ్‌లో చేరక్కర్లేదు. క్లాసులకు వెళ్లక్కర్లేదు. జిమ్‌లో మిషన్లు వాడేందుకు వేచిచూడక్కర్లేదు. పైగా దీన్ని ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎలా? ఎలా? ముందుగా మీకు తగిన సైజు హూప్‌ను ఎంచుకోండి. ఈ వ్యాయామం విజయవంతం కావాలంటే హూప్ సైజ్ కరెక్ట్‌గా ఉండడం ముఖ్యం. కొత్తగా ఆరంభించేవాళ్లు కాస్త పెద్ద సైజు హూప్ తీసుకోవాలి. అలాగే హూప్ వెయిట్ మీకు అనుగుణంగా ఉండాలి. మరీ బరువైతే తిప్పలేరు. కొత్తవాళ్లు కనీసం ఒక కేజీ వెయిట్ ఉన్న హూప్ ఎంచుకోవాలి. హూప్ ఆరంభించేముందు నెట్లో బిగినర్స్ కోసం ఉన్న వీడియోలు శ్రద్ధగా చూడండి. లోకల్ జిమ్‌లో గైడ్ ఉంటే సాయం తీసుకోండి. బేసిక్స్ వచ్చాక తేలికపాటి వర్కవుట్స్ ఆరంభించాలి. అనుభవం పెరిగే కొద్దీ సమయం పెంచుకోవచ్చు. ప్రతిరోజూ రెండు మూడు సెట్లు ఒక్కోటి పదినిమిషాలుండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు అవసరం సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయడం హూప్కి అవసరం. హూపింగ్ చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలి, నడుం దగ్గర ఒంచడం చేయవద్దు. టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల హూప్ గమనానికి అడ్డం రాకుండా ఉంటాయి. వెన్నునొప్పి ఉన్నవాళ్లు తేలికపాటి హూపింగ్ చేయాలి. సరైన రీతిలో, సరైన విధంగా చేస్తే హూలా హూప్ మీకు మంచి షేప్ ఇవ్వడమే కాకుండా స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. హూప్ డాన్స్ నడుం చుట్టూ హూప్‌ను తిప్పుతూ మ్యూజిక్కు అనుగుణంగా డాన్స్ చేయడమే హూప్ డాన్స్. ఇది హూపింగ్ ఎక్సర్సైజ్కు తర్వాత స్థాయి. హూలా హూప్తో బాగా ప్రాక్టీస్ వస్తే హూప్డాన్స్ సాధ్యమవుతుంది. క్రీ.పూ.1000 సంవత్సరంలో ఈజిప్ట్‌లో ఈ తరహా డాన్స్లున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆధునిక ప్రపంచంలో హూప్ డాన్స్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో నిష్ణాతులు తమను తాము హూపర్స్’’ అని పిలుచుకుంటారు. సాధారణ హూప్ మాత్రమే కాకుండా నిప్పు అంటించిన హూప్స్‌తో కూడా కొందరు డాన్స్ ప్రదర్శనలు ఇస్తారు. ఇక వీధుల్లో హూప్ డాన్స్ ప్రదర్శన ఇచ్చేవాళ్లను ‘‘హూప్ బస్కర్స్’’ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా హూపర్స్, హూప్ బస్కర్స్ కలిసి ప్రపంచ హూప్ డాన్స్ ఫెస్టివల్, వరల్డ్ బస్కర్స్ ఫెస్టివల్ లాంటివి జరుపుకుంటారు. ఇందులో ప్రపంచ నలుమూలల నుంచి హూపర్స్ వచ్చి పాల్గొంటారు. ఇక వీరిలో వీరికి పోటీలు నిర్వహించుకొని టాప్ హూపర్స్ను గుర్తించేందుకు వరల్డ్ హూప్ డాన్స్ చాంపియన్ షిప్ పోటీలు సైతం నిర్వహిస్తారు. – డి. శాయి ప్రమోద్ -
Kim Jong-un: నార్త్ కొరియా కిమ్.. ఇలా అయ్యాడేంటి?
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి కిందటి ఏడాది రకరకాల పుకార్లు వినిపించాయి. ఒకానొక టైంలో కిమ్ చనిపోయాడనే వార్తలు.. ప్రపంచానికి ఎంతో ఆసక్తిని కలిగించాయి. అయితే వారం తిరగకముందే మీడియా ముందు ప్రత్యక్షమై తాను నిక్షేపంగా ఉన్నానని శత్రు దేశాల గట్టి సందేశం పంపాడు కిమ్. ఇక కిమ్ సన్నబడ్డాడనే తాజా వార్త.. అతని ఆరోగ్య స్థితిపై పలు సందేహాలకు తావిస్తోంది. చాలా కాలం తర్వాత సోమవారం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బయటకు వచ్చాడు. కీలకమైన ఆర్థిక సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతో హాజరయ్యాడు. ఆ భేటీ ఫొటోలు దక్షిణ కొరియా సీక్రెట్ ఏజెన్సీ ద్వారా బయటకు పొక్కాయి. అయితే అందులో కిమ్ రూపం చాలా మారిపోయి ఉంది. ముఖం, మెడ, చేతులు, ఛాతీ భాగం సన్నబడిపోయి.. కొంచెం మార్పు కనిపిస్తోంది. దీంతో ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకే కిమ్.. సర్జరీ చేయించుకున్నాడని, అందుకే ఇన్నాళ్లు బయటకు రాలేదని సియోల్ స్పై ఏజెన్సీలు ఒక నిర్ధారణకు వచ్చాయి. ఇక కిమ్ చేతికి ఉన్న 12 వేల డాలర్ల విలువ చేసే స్విస్ వాచ్ అందులో ఉంది కిమ్ అనే నిర్ధారిస్తున్నాయని సియోల్ మీడియా హౌజ్‌లు ప్రముఖంగా ప్రచురించాయి. పోయినేడాది జులైలో ఓ మీటింగ్‌కు అటెండ్ అయిన కిమ్ అదే వాచ్ ధరించాడు. ఇప్పుడు అదే వాచ్‌తో మరోసారి కనిపించాడు. అందుకే అది ముమ్మాటికీ కిమ్ అనేది సియోల్ పత్రికల కథనం. బాడీ డబుల్ అనుమానాలు! అయితే సియోల్ కే చెందిన కవూహపన్ అనే దినపత్రిక మాత్రం ఆసక్తికరంగా ఒక కథనం ప్రచురించింది. ఉత్తర కొరియాలో కిమ్ అధికారంలోకి వచ్చే నాటికి 90 కేజీల బరువు ఉన్నాడు. ఆ తర్వాత 2019 నాటికి మరో 50 కేజీల దాకా పెరిగాడు. కిమ్ ఫ్యామిలీలో స్థూలకాయం సమస్య వారసత్వంగా వస్తోంది. ఆ కుటుంబంలో చాలామంది గుండెపోటుతో చనిపోయారు. పైగా కిమ్ విలాసాలకు అలవాటుపడ్డ మనిషి. హెల్త్ కేర్ పట్టించుకోడు. చైన్ స్మోకింగ్, విపరీతంగా మాంసాన్ని తింటాడు. వీటికి తోడు కిందటి ఏడాది నుంచి కిమ్ లేకుండానే పవర్ఫుల్ పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్‌లు నిర్వహించుకుంటోంది. భార్య, ముగ్గురు పిల్లలకు(చిన్నవాళ్లే) దూరంగా 38 ఏళ్ల కిమ్ ఒంటరిగా ఉంటున్నాడనే కథనాలు వెలువడ్డాయి. ఈ అనుమానాల నడుమ కిమ్ సడన్‌గా ప్రత్యక్షం కావడం, సన్నబడ్డ లుక్‌తో దర్శనమివ్వడంలో బాడీ డబుల్(అలాంటి రూపురేఖలున్న మరో మనిషి)కి ఆస్కారం లేకపోలేదని కథనం ప్రచురించింది. కిందటి ఏడాది కిమ్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వచ్చాక.. మిలిటరీ సమావేశానికి హాజరైన కిమ్ రూపంపై అమెరికా నిఘా ఏజెన్సీకి బోలెడు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాడీ డబుల్ పెద్ద కష్టమేమీ కాదన్నది కవూహపన్ కథనంతో ఆసక్తి నెలకొంది. చదవండి: నార్త్ కొరియాలో ఆకలి కేకలు -
‘హెల్త్ అండ్ వెల్నెస్’ ప్రాజెక్టు అధికారి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్‌లో హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న సత్య తమను వేధిస్తున్నాడంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లో పనిచేస్తున్న మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్ హెచ్‌వో) హైదరాబాద్ కోఠీలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. ప్రాజెక్టు ఆఫీసర్ సత్యను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 5 గంటల సేపు ఆందోళన చేసిన వారు, ఒక దశలో కమిషనర్ యోగితా రాణా కారును అడ్డగించారు. అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో కార్యాలయ ప్రాంగణమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. కేంద్రం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో కూడా 500 కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా మార్చి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పారు. వీటిలో పనిచేసేందుకు గతేడాది వైద్య ఆరోగ్యశాఖ రాత పరీక్ష నిర్వహించి 76 మంది స్టాఫ్ నర్సులను ఎంఎల్హెచ్వోలుగా కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. ఈ కార్యక్రమమంతా జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా చేపట్టారు. నియమించే సమయంలో వీరి స్థానిక ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగ అవకాశమిస్తారని అధికారులు తెలిపారు. కానీ ఒక జిల్లాలో ఉన్న వారిని మరో జిల్లాలో ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో వేశారు. అలాగే ఈ ఏడాది జూన్ మొదటి నుంచి వారు ఎక్కడ పనిచేస్తున్నది, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లింది ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఆఫీసర్‌కు తెలిసేలా స్మార్ట్ ఫోన్లో లైవ్ లొకేషన్ షేర్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి అధికారి ఫోన్లు.. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రాజెక్టు ఆఫీసర్‌గా వ్యవహరిస్తోన్న సత్య అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తమకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని, అవసరం లేకపోయినా కూడా కార్యక్రమాల వివరాలను తెలపాలని కోరుతున్నారని ధర్నా చేసిన స్టాఫ్ నర్సులు ఆరోపించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే తమ డ్యూటీ అని, కానీ రాత్రి 10–11 గంటల సమయంలో కూడా ప్రాజెక్టు ఆఫీసర్ తమకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధా నంగా ఆయన వేధింపులు ఆపాలని, నిబంధనల ప్రకారం స్థానికంగా ఉన్న ప్రాంతాల్లోనే తమకు విధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ అధికారిపై స్థానిక పోలీసు స్టేషన్లో వారంతా ఫిర్యాదు చేశారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
కోతల కాన్పులకు ఇక చెల్లుచీటి..!
సాక్షి, పాలమూరు: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుల లెక్క ఇకనుంచి పక్కాగా ఉంటోంది. పుట్టిన ప్రతీ బిడ్డ, తల్లిదండ్రుల వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలను కట్టడి చేయడానికి, బోగస్ పౌరసత్వం తీసుకునే అవకాశం లేకుండా తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జనవరి 1నుంచి జిల్లాలో ఈ–బర్త్ విధానం అమల్లోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు, జనన వివరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేసే విధానం పకడ్బందీగా చేస్తున్నారు. ప్రతీ ఆస్పత్రికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయించారు. ఏ రోజుకారోజు ప్రసవాల సంఖ్య, వివరాలను ఇందులోపూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–బర్త్ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానంలో తల్లీపిల్లల మరణాలను తగ్గించడంలో పాటు నూరుశాతం కాన్పులు ఆస్పత్రుల్లో జరుగుతాయి. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడంతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు సులువుగా పొందుతారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా భ్రూణ హత్యలు అరికట్టవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల వారు ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకున్నా శస్త్రచికిత్స కాన్పులు చేస్తున్నారా.. అనే అంశాన్ని పరిశీలించవచ్చు. ప్రత్యేకంగా ఏదైనా ఒక ఆస్పత్రిలో కేవలం మగపిల్లలే జన్మిస్తుంటే అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయా.. అనే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డుకట్ట వేసి బోగస్ విదేశీయులు దేశంలో చొరబడి తప్పుడు పౌరసత్వం తీసుకొకుండా నిలువరించవచ్చు. జనవరి 1వ తేదీనుంచి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు ఆ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తోంది. సదరు కుటుంబీకులు సైతం ఈ విధానంలో రూపొందించిన పత్రంలోని వివరాల ప్రకారమే మున్సిపాలిటీ, పంచాయతీల్లో జనన ధ్రువపత్రం పొందవచ్చు. ప్రసవాల సంఖ్య.. జిల్లాలో జనవరి 1 నుంచి అమలు చేస్తున్న ఈ–బర్త్ విధానంలో ఈనెల 25వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,251 కాన్పులు జరిగాయి. వాటిలో సాధారణ కాన్పులు 1,661, సిజేరియన్లు 583 జరిగినట్లు నమోదయ్యాయి. అలాగే జరిగిన కాన్పుల్లో ఆడ శిశువులు 1,128, మగ శిశువులు 1,129 ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు జరుగగా అందులో సాధారణం 307, సిజరీయన్ 640 జరిగాయి. వాటిలో ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది ఉన్నారు. ఇలా నమోదు చేస్తారు.. వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ–బర్త్ నమోదు ప్రక్రియను పటిష్టంగా చేసేందుకు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల జాబితా రూపొందించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. తల్లీబిడ్డకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన యూజర్ ఐడీలలో వివరాలు నమోదు చేసే విధంగా పోర్టల్‌ను రూపొందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రతి రోజు ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల వివరాలతో పాటు తల్లీబిడ్డల సమాచారాన్ని అందులో నమోదు చేస్తారు. భ్రూణ హత్యల నివారణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న భ్రూణ హత్యలను ఈ–బర్త్ పోర్టల్ ద్వారా ఆరోగ్య శాఖ ఇట్టే పసిగట్టనుంది. లింగనిర్ధారణ పరీక్షలు చేయించినా, గర్భస్రావం అయినా వెంటనే తెలిసిపోయేలా ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో ప్రతి గర్భిణి వివరాలను ఏఎన్సీ నమోదు చేస్తున్నారు. రెండో నెల నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణి ఆరోగ్యస్థితిపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొనసాగుతుంది. చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వివరాలతో పాటు ఆరోగ్యవివరాలను అందులో పొందుపరుస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారి ప్రతి ఒక్కరి వివరాలను గుర్తిస్తారు. గర్భిణుల వివరాలు పక్కాగా సేకరించి కాన్పులు జరిగే వరకు వారి పట్ల పర్యవేక్షణ చేస్తారు. గర్భిణీతో పాటు శిశువు ఆరోగ్యస్థితిని కూడా పరిశీలిస్తూ తగిన సూచనలు సలహాలు అందిస్తారు. మరో ప్రయోజనం ఈ విధానం వల్ల అకారణంగా శస్త్రచికిత్స కాన్పులను అడ్డుకట్ట వేయవచ్చు. ప్రతి కాన్పు ఇంటర్నెట్లో నమోదు చేసేప్పుడు శస్త్రచికిత్స ప్రసవం చేస్తే ఎందుకు చేశారు.? సర్జరీ చికిత్స చేయడానికి గల కారణాలను వివరంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా జిల్లా అధికారులతో విచారణ చేపడతారు. అకారణంగా సర్జరీలు చేసినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవ వివరాలను ఏరోజుకారోజు ఈ–బర్త్ విధానంలో నమోదు చేయనట్లయితే ఆయా ఆస్పత్రులపై వైద్యశాఖ కేసులు నమోదు చేయించి మూడేళ్ల జైలు శిక్షపడేలా చర్యలు తీసుకోనుంది. -
అయస్కాంతాలతో అనారోగ్యం పాలయ్యాడు!
ఉటా : పిల్లలు బొమ్మలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టపడుతారు. అందులో వైవిధ్యమైన బొమ్మలంటే వారికి మరింత సంతోషం. వాటి కోసం కొట్లాడుతారు. మారం చేస్తారు. చివరకు కావాల్సిన బొమ్మలను కొనిపించుకుంటారు. అయితే కొన్నిసార్లు అవే బొమ్మలు వారి అనారోగ్యానికి కారణం అవుతాయి. ఈ బొమ్మల విషయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి ఏదో తీట పనిచేసి ఇబ్బందులు తెస్తుంటారు. ఇలానే అమెరికా, ఉటాలోని సాండీకి చెందిన మికా అర్విడ్సన్ అనే ఆరేళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన సోదరుడి బొమ్మను నోట్లో దాచుకునే ప్రయత్నం చేసి తెలియకుండానే మింగేశాడు. దీంతో అనారోగ్యానికి గురైన అతను వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్ర చికిత్స చేసిన వైద్యులు మికా కడుపులో బొమ్మకు సంబంధించిన 14 చిన్న అయస్కాంతాలను గుర్తించి బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంకా మికా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని అతని తల్లిదండ్రులు తెలిపారు. -
కొత్త విభాగాల్లోకి తత్వ హెల్త్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న తత్వ హెల్త్ అండ్ వెల్నెస్ కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలే కేసరి బ్రాండ్ పేరుతో కుంకుమ పువ్వు అమ్మకాలను ప్రారంభించిన ఈ సంస్థ త్వరలో డ్రై ఫ్రూట్స్ విపణిలోకి ప్రవేశిస్తోంది. వివిధ దేశాల నుంచి నాణ్యమైన రకాలను సేకరించి ఇక్కడ విక్రయిస్తామని తత్వ హెల్త్ ఎండీ సచిన్ జైన్ తెలిపారు. సాఫ్రాన్ టీ, మిల్క్‌ను సైతం ప్రవేశపెడతామని చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో కేసరి బ్రాండ్ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా నేషనల్ సేల్స్ మేనేజర్ కె.గురుప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కుంకుమ పువ్వు అత్యధికంగా పండే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాదిన కుంకుమ పువ్వును తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారని వివరించారు. భారత్‌లో సాఫ్రాన్ అమ్మకాల్లో 70-80 శాతం నకిలీదేనని అన్నారు. కశ్మీర్లో ఈ ఉత్పాదన సాగు పెంచేందుకు స్పైస్ బోర్డ్‌కు ప్రతిపాదన చేశామన్నారు.