ఆగకుండా వస్తున్న ఎక్కిళ్లు ఎంతో ఇబ్బంది పెడతాయి. నలుగురిలో ఉన్నప్పుడు ఇది మరీ పెద్ద సమస్య అవుతుంది. ఈ కింది చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే... కొద్దిసేపు ఊపిరి బిగబట్టాలి. ఇలా కాసేపు బిగబట్టాక మళ్లీ గాఢంగా శ్వాస తీసుకుని, వదిలి... మరోసారి బిగబట్టాలి. ఇలా శ్వాస తీసుకుంటూ... బిగబడుతూ... ఈ ప్రక్రియను కాసేపు కొనసాగిస్తే ఎక్కిళ్లు ఆగుతాయి. గబగబా ఊపిరి తీసుకుంటూ ఉండటం కూడా ఓ పద్ధతి. ఓ రెండు నిమిషాల పాటు ఇలా చేయాలి. ఎక్కిళ్లు ఆగాక మళ్లీ మామూలుగానే ఊపిరి తీసుకోవాలి.
- రిలాక్స్‌డ్‌గా కూర్చుని... ఆ తర్వాత మోకాలిని ఛాతీ వరకు తెచ్చి... అలా కాసేపు దాన్ని ఛాతీకి ఆనించి ఉంచాలి. ఆకస్మాత్తుగా భయపెట్టడం వంటి చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయంటారు గానీ అది అంత మంచిది కాదు.
- ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నవారు గ్లాసులోని నీళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగుతూ ఉంటే ఎక్కిళ్లు ఆగుతాయి. కొద్దిగా చక్కెర వేసిన నీళ్లతో మరింత ప్రభావం ఉంటుంది. వీలైనంత గా ఎక్కిళ్ల మీదినుంచి దృష్టి మళ్లించాలి.
- ఒక స్పూను చక్కెరను నోటిలో వేసుకుని చప్పరించడం, యాలుక్కాయను తినడం, ఖాళీ కవర్‌లోకి గాలిని ఊదడం వంటి వాటివల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయంటారు.
- ఈ కొద్దిపాటి జాగ్రత్తలతోనూ ఎక్కిళ్లు ఆగకపోతే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment