శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కొందరు రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తే, పొట్టను మాడ్చుకుంటారు కొందరు. వాకింగ్, జాగింగ్ వంటి వాటితో ప్రారంభించి, చిన్న చిన్న బరువులు మోయడం... ఆ తర్వాత వాటన్నింటినీ అనుసరించలేక నీరస పడిపోతుంటారు ఇంకొందరు. అయితే అలా కాకుండా తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్‌సైజ్ ఒకటుంది. అదేమంటే మెట్లెక్కడం... నిజమే! మెట్లెక్కడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మెట్లెకెక్కినట్లే! అయితే దానికీ ఓ పద్ధతుంటుంది మరి.
నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈదటం లాంటి మిగతా వ్యాయామాలే కాదు, రోజూ మెట్లెక్కటం, దిగటం వల్ల కూడా శరీరం ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాధారణంగా నేలమీద నడుస్తున్నప్పటి కంటే మెట్లెక్కుతూ పైకి వెళ్ళటం, కిందకు దిగటం మూలంగా కండరాలు బలపడతాయి. తొడలు, కాలి పిక్కలు పటిష్టంగా తయారవుతాయి. కండరాలు బలంగా ఉంటే నిటారుగా, మంచి ఫిటెనెస్ తో ఉన్నట్లుగా కనిపిస్తారు.
శరీరాకృతి పట్ల శ్రద్ధ ఉండి రోజూ ఎక్సర్ సైజులు చేసేవాళ్ళు, వాటితో΄ాటు మెట్లెక్కటాన్ని కూడా అలవాటు చేసుకుంటే రోజు రోజుకూ శరీరాకృతిలో వచ్చే మార్పులను చూసి మనకే ఆశ్చర్యం వేస్తుంది.
ఇలా అలవాటు చేసుకోవాలి!
కింద నుంచి 8 మెట్ల దాకాఎన్నుకుని ఆ 8 మెట్లనూ పైకి ఎక్కటం, కిందికి దిగటం, మళ్ళీ ఎక్కటం, దిగటం అలా అలిసిపోయేదాకా చేయాలి. లేదా ఒక అంతస్తు పైదాకా ఎక్కుతూ దిగుతూ ఉండాలి. మెట్లను పైకి ఎక్కుతున్నప్పుడు చేతుల్ని రిలాక్స్‌గా పక్కలకు వదిలేయాలి. మోచేతుల్ని మాత్రం కొద్దిగా వంచాలి. బాగాప్రాక్టీస్ అయాక మోచేతుల్ని ఇంకా వంచవచ్చు. ఇలా చేయటం వల్ల మోకాళ్ళను ఎత్తి ఎత్తి వేయటానికి అనువుగా ఉంటుంది. అయితే ఎన్ని మెట్లెక్కినా, మరునాటికి కాళ్ళపిక్కల్లో పోట్లు, నొప్పులు వంటివి ఉండకూడదు. అలా ఉన్నాయంటే మీరు శక్తికి మించి మెట్లెక్కుతూ దిగుతున్నారన్న మాట.
మెట్లు ఎక్కుతూ దిగుతూ వున్నప్పుడు ΄ాదాలు జారకుండా ఉండటానికి సౌకర్యంగా ఉండే షూస్ వాడాలి.
మిగతా ఎక్సర్ సైజులతో ΄ాటు రెండు మూడు అంతస్తుల మెట్లను ఇలా ఎక్కుతూ దిగితే మీ శరీరం వెచ్చదనానికి చేరుకుంటుంది.
తర్వాత శరీరం మామూలు స్థితికి వచ్చి కూల్ డౌన్ కావటానికి అనువుగా రిలాక్స్ అవుతూ కొద్దిసేపు నడవాలి. ఇందుకు సుమారు మూడు నుంచి 10 నిముషాల సమయం పడుతుంది.
మిగతా ఏ ఎక్సర్ సైజులూ చేయనివారు ఈ మెట్లెక్కే ఎక్సర్ సైజును వారానికి కనీసం రెండుసార్లన్నా చేయాలి. తడవకు 20 నిముషాలకు తగ్గకుండా. ఆ తర్వాత పైన చెప్పిన నడక ఎక్సరసైజును తిరిగి చేయాలి.
దీనిని ఒక సాధనగా చేసుకోవాలంటే మొదటి రెండువారాలలో 2 అంతస్తుల దాకా మెల్లగా ఎక్కుతూ దిగాలి. మూడోవారం వచ్చేసరికి 3 అంతస్తులు... ఇలా అయిదు అంతస్తుల దాకా అలుపు లేకుండా ఎక్కి, దిగగలిగేలా సాధన చేయాలి.
ఇవి చదవండి: వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి..
Comments
Please login to add a commentAdd a comment