సాక్షి, పాలమూరు: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుల లెక్క ఇకనుంచి పక్కాగా ఉంటోంది. పుట్టిన ప్రతీ బిడ్డ, తల్లిదండ్రుల వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలను కట్టడి చేయడానికి, బోగస్ పౌరసత్వం తీసుకునే అవకాశం లేకుండా తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జనవరి 1నుంచి జిల్లాలో ఈ–బర్త్ విధానం అమల్లోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు, జనన వివరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేసే విధానం పకడ్బందీగా చేస్తున్నారు. ప్రతీ ఆస్పత్రికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయించారు. ఏ రోజుకారోజు ప్రసవాల సంఖ్య, వివరాలను ఇందులోపూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు.
ఎన్నో ప్రయోజనాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–బర్త్ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానంలో తల్లీపిల్లల మరణాలను తగ్గించడంలో పాటు నూరుశాతం కాన్పులు ఆస్పత్రుల్లో జరుగుతాయి. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడంతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు సులువుగా పొందుతారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా భ్రూణ హత్యలు అరికట్టవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల వారు ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకున్నా శస్త్రచికిత్స కాన్పులు చేస్తున్నారా.. అనే అంశాన్ని పరిశీలించవచ్చు.
ప్రత్యేకంగా ఏదైనా ఒక ఆస్పత్రిలో కేవలం మగపిల్లలే జన్మిస్తుంటే అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయా.. అనే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డుకట్ట వేసి బోగస్ విదేశీయులు దేశంలో చొరబడి తప్పుడు పౌరసత్వం తీసుకొకుండా నిలువరించవచ్చు. జనవరి 1వ తేదీనుంచి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు ఆ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తోంది. సదరు కుటుంబీకులు సైతం ఈ విధానంలో రూపొందించిన పత్రంలోని వివరాల ప్రకారమే మున్సిపాలిటీ, పంచాయతీల్లో జనన ధ్రువపత్రం పొందవచ్చు.
ప్రసవాల సంఖ్య..
జిల్లాలో జనవరి 1 నుంచి అమలు చేస్తున్న ఈ–బర్త్ విధానంలో ఈనెల 25వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,251 కాన్పులు జరిగాయి. వాటిలో సాధారణ కాన్పులు 1,661, సిజేరియన్లు 583 జరిగినట్లు నమోదయ్యాయి. అలాగే జరిగిన కాన్పుల్లో ఆడ శిశువులు 1,128, మగ శిశువులు 1,129 ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు జరుగగా అందులో సాధారణం 307, సిజరీయన్ 640 జరిగాయి. వాటిలో ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది ఉన్నారు.
ఇలా నమోదు చేస్తారు..
వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ–బర్త్ నమోదు ప్రక్రియను పటిష్టంగా చేసేందుకు డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల జాబితా రూపొందించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. తల్లీబిడ్డకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన యూజర్ ఐడీలలో వివరాలు నమోదు చేసే విధంగా పోర్టల్‌ను రూపొందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రతి రోజు ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల వివరాలతో పాటు తల్లీబిడ్డల సమాచారాన్ని అందులో నమోదు చేస్తారు.
భ్రూణ హత్యల నివారణ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న భ్రూణ హత్యలను ఈ–బర్త్ పోర్టల్ ద్వారా ఆరోగ్య శాఖ ఇట్టే పసిగట్టనుంది. లింగనిర్ధారణ పరీక్షలు చేయించినా, గర్భస్రావం అయినా వెంటనే తెలిసిపోయేలా ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో ప్రతి గర్భిణి వివరాలను ఏఎన్‌సీ నమోదు చేస్తున్నారు. రెండో నెల నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణి ఆరోగ్యస్థితిపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొనసాగుతుంది. చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వివరాలతో పాటు ఆరోగ్యవివరాలను అందులో పొందుపరుస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారి ప్రతి ఒక్కరి వివరాలను గుర్తిస్తారు. గర్భిణుల వివరాలు పక్కాగా సేకరించి కాన్పులు జరిగే వరకు వారి పట్ల పర్యవేక్షణ చేస్తారు. గర్భిణీతో పాటు శిశువు ఆరోగ్యస్థితిని కూడా పరిశీలిస్తూ తగిన సూచనలు సలహాలు అందిస్తారు.
మరో ప్రయోజనం
ఈ విధానం వల్ల అకారణంగా శస్త్రచికిత్స కాన్పులను అడ్డుకట్ట వేయవచ్చు. ప్రతి కాన్పు ఇంటర్‌నెట్‌లో నమోదు చేసేప్పుడు శస్త్రచికిత్స ప్రసవం చేస్తే ఎందుకు చేశారు.? సర్జరీ చికిత్స చేయడానికి గల కారణాలను వివరంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా జిల్లా అధికారులతో విచారణ చేపడతారు.
అకారణంగా సర్జరీలు చేసినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవ వివరాలను ఏరోజుకారోజు ఈ–బర్త్ విధానంలో నమోదు చేయనట్లయితే ఆయా ఆస్పత్రులపై వైద్యశాఖ కేసులు నమోదు చేయించి మూడేళ్ల జైలు శిక్షపడేలా చర్యలు తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment