మనం ఏ విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా ‘‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ...’’ శాస్త్రమే ప్రమాణం. మనకు బుద్ధికి తోచిన దానితో నిర్ణయం చేయడం సనాతన ధర్మంలో భక్తి అనిపించుకోదు. మనం ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం... అని కాదు ఎన్ని ఏ మేరకు పాటిస్తాం అన్నది ప్రధానం. ఈ విషయాన్నే రామాయణంలో సీత ‘ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తనే / తథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జితా..’ అంటూ రావణాసురుడికి బోధ చేస్తుంది.
అలా మనం ఏదయినా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు ప్రమాణం శాస్త్రం. పుట్టుకతో ప్రతివారికీ మూడు రుణాలుంటాయి.. అని శాస్త్రం అంటుంది. అవి రుషి రుణం, దేవరుణం, పితృరుణం. ‘నేనెప్పుడు చేశానండీ ఈ రుణాలు, నేనెలా రుణగ్రస్తుడనయ్యాను’ అన్న ప్రశ్న అన్వయం కాదు. శాస్త్రవాక్కు కనుక అందరికీ ఉంటుంది. వీటిలో ఒక రుణం విషయంలో మాత్రం దానిని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ అవసరం ఉండదు. అది రుషిరుణం. సనాతన ధర్మంలో మనందరం రుణపడి΄ోయింది రుషులకు. మంత్రానికి రుషి ద్రష్ట. వేదమంత్రాలను ధ్యానంతో దర్శించి, విని మనకు స్వరంతో అందించాడు. ఆయన కూడా మనలాగే జీవించినవాడే అయినా రుషి తర్పణం అని... రుషికి వేరు తర్పణం ఉంటుంది.
రుషి మన నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆశించలేదు, ఏ సత్కారాన్నీ, ఏ బిరుదునూ కోరుకోలేదు. కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమని, మనందరికీ కటికచీకటిలో కాంతిరేఖ కనపడాలని, మన జీవితాలు సుసంపన్నం కావాలని, మార్గం చూపించాలని వేదాల ద్వారా అందించి ధర్మానుష్ఠానికి ప్రమాణాన్ని కల్పించాడు. అలాగే ఒకవేళ మనం ఇవన్నీ చదవగలమో లేదో, స్వరంతో మంత్రం చెప్పగలమో లేదో, మంత్రభాష్యాన్ని అర్థం చేసుకోగలమో లేదో, అసలు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో రుషులు పురాణాలను ఇతిహాసాలుగా అందించారు.
వ్యాసభగవానుడు 18 పురాణాలను అందించాడు. ‘‘నమో’స్తు తే వ్యాస విశాల–బుద్ధే/ఫుల్లరవిందయత –పత్ర–నేత్ర/యేన త్వయా భారత–తైల–పూర్ణః/ప్రజ్వలితో జ్ఞాన–మయః ప్రదీపః’’ అంటారు. అంతటితో ఆగకుండా ఆయన పరమ దయాళువై వేదాల సారాన్ని అందరూ చదువుకుని అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. వేదం చదువుకుంటే ఏది తెలుస్తుందో మహాభారతం చదువుకున్నా అదే తెలుస్తుంది.
సూర్యవంశాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే /వేదః ప్రచేతసదాచిత్ సాక్షాత్ రామాయణాత్మనాః’’ వేదములు ప్రతి΄ాదించిన బ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే ఆ వేదమే రామాయణ కావ్యంగా వచ్చింది. వేదం ఏం చెప్పిందో తెలియనప్పుడు రామాయణం చదువుకుంటే చాలు. మనకు ఆ ప్రయోజనం నెరవేరుతుంది. రాముడు ఏ పరిస్థితుల్లో ఏం చేసాడో, మానవాళికి అదే వేదం విధించిన కర్తవ్యం కూడా. అందుకే ఎవరయినా అత్యంత విశ్వాసంతో ఒక విషయాన్ని తదేక దృష్టితో నమ్మి ఆచరించేవారయితే ‘రుషి సమానులు’ అంటారు. ఆయన ఒక ‘రుషి’ అంటారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment