గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి యువతీ యువకు లకు ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని రామాయణం నిర్దేశించింది. వాటిలో వ్యక్తిత్వం ఒకటి. భార్య ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి... ఆమె నీతో కలిసి పుట్టలేదు. నీతో కలిసి పెరగలేదు. వేరొకరి ఇంట పుట్టింది. ఎవరికో కూతురు. ఆమెకూ ఆశలు ఉంటాయి. కోరికలున్నాయి, సంతోషం కావాలి, ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె సంతోషం గా ఉండేటట్టు చూడవలసిన మొట్టమొదటి కర్తవ్యం మామగారిది. తరువాత భర్తది. రామాయణంలో మామగారి పేరు చెప్పగానే ఆయన ఆ΄్యాయతను తలచుకుని సీతమ్మ పరవశించిపోతుంది. ఇది మానవీయ సంబంధాలకు భారతదేశం చేసిన పట్టాభిషేకం.
అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశిష్టమైన విషయాన్ని చెప్పారు. సప్తపది అయితే తప్ప వివాహ తంతు పూర్తి అయినట్టు కాదు.. అంటారు. ఏడడుగులు నడిచిన తరువాత వరుడు – వధువుతో ఒక మాట అంటాడు. ‘నీవు నాతో కలిసి ఏడు అడుగులు నడిచావు కాబట్టి ఇకపైన ‘నీవు నాకు మంచి స్నేహితురాలివికా. నా మనసు ఎరిగి ప్రవర్తించు’ అంటాడు. అంటే – జన్మతః అనుబంధం కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. ఇక జీవితానికి నిర్ణయాత్మక శక్తి ఆమెయే.
స్నేహమంటే మనసు మనసుతో కలవాలి. ఒకరు మరొకరికి అర్థం కావాలి. వారి సంతోషం కోసం... ఇవతలివారి వైపునుంచి కొంత త్యాగం ఉంటుంది. అలాగే వీరి సంతోషం కోసం అవతలివారి వైపునుండి కొంత త్యాగం ఉంటుంది. ఇలా జరిగితేనే దాంపత్యం సంతోషంగా సాగుతుంది.
అలా కాక నీకిది సంతోషం కాకపోయినా నాకిది ఇష్టం, నేనిది చేస్తాను.. అన్నప్పడు గృహస్థాశ్రమం అర్థం ఏమిటి? దాంపత్య లక్ష్యం నీరుకారిపోతుంది. అది కాదు... ఒకరి సంతోషానికి మరొకరు కారణం కాగలగాలి. సుమనస్క... అంటారు. అంటే నీవు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తా. అలా మనిద్దరం అరమరికలు లేకుండా సఖ్యంగా సంతోషంగా మంచి స్నేహితులుగా ఉందాం. నాకున్న బలహీనతలేమిటో, బలమేమిటో నీవు తెలుసుకోవాలి.
అలాగే నీ బలాలు, బలహీనతలు నేను తెలుసుకోవాలి. వాటికి తగిన విధంగా మనం నడుచుకుంటూ, తప్పులు చేస్తే మన్నించుకుని సర్దుకుపోతూ ప్రేమగా ఉండాలి. అంతే తప్ప ఒకరి తప్పులు మరొకరు వెతకడమే ధ్యేయంగా సంసారం చేస్తూ, ఇద్దరి పరువును, కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్ఠను బజారుకీడ్చవద్దు. ఒకరిపట్ల మరొకరు అవగాహనతో, ఆప్యాయతతో, ప్రేమతో సంతోషంగా బతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం.
బయట ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా... ఇంటికొచ్చి ఒకరి ముఖం మరొకరం చూసుకోగానే ఉపశమనం పొందగలగాలి. సాహచర్యంలో పరస్పరం శాంతి పొందాలి. ఒకరం తప్పు చేస్తే మరొకరం ప్రేమ తో మందలించుకోగలగాలి. అరమరికలొద్దు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి వారం సంస్కరించుకుందాం.’’ అనుకోవాలి.
అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత అవగాహనతో ప్రారంభం కావాలో, సుఖమయమైన సంసార జీవితానికి ప్రేమ ఎంత అవసరమో పెద్దలు తెలియపరుస్తారు.
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment