'సర్వసాధారణంగా మనం ఏదయినా ఒక విషయాన్ని పరిశీలించాలనుకుంటే అనేక గ్రంథాలు చూడాల్సి ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా అటువంటి అనుబంధం కలిగిన ఒక మహాపురుషుని నోటివెంట వచ్చిన కీర్తన అదే పెద్ద గంగ. శాబ్దిక గంగ. గంగలాగే ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తన .. శాబ్దిక గంగ కూడా ప్రవహించింది. అది పెద్ద పల్లవి, పెద్ద పెద్ద చరణాలతో ఉండదు. సులభంగా ఉంటుంది.
గంగే మాం పాహి.. అంటారు ఆయన. ‘ఓ గంగమ్మా! నన్ను రక్షించు’ అని. నిజానికి రక్షించేది ఎవరు? దేవతలు. ఎప్పుడయినా ఏదయినా దుష్కర్మ అనుభవించాల్సి వస్తే, కష్టం తరుముకొస్తుంటే.. దానిని తొలగించగలిగిన వాడు భగవంతుడు. కానీ గంగమ్మ కూడా అలాగే రక్షించగలదు – అన్న నమ్మకంతో దీక్షితార్ వారు ‘అమ్మా గంగమ్మా! నన్ను రక్షించు’ అన్నారు. నిజానికి ఆమె శక్తి ఏపాటిది అంటే..'
భాగవతంలో పరీక్షిత్తు ఏడు రోజుల్లో మరణిస్తానని గంగానదీతీరంలో ప్రాయోపవేశం చేసాడు. దాన్ని ఆంధ్రీకరించిన పోతన ఎంత గొప్పగా చెప్పారంటే..
‘‘అమ్మా! నిను? జూచిన నరు?
బొమ్మా యని ముక్తి కడకు? బుత్తు వ?ట కృపన్
లెమ్మా నీ రూపముతో
రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!"
అర్థం.. అమ్మా! అని తన వంక చూస్తే చాలట. పామ్మా.. అని మోక్షానికి పంపించివేస్తుందట. అంతే.. పూజలు మరేమీ అఖ్కర్లేదు.‘ నీ రూపంతో ఒక్కసారి నాకు ఎదురుగా రామ్మా... గంగమ్మా... నిన్ను చూడాలని ఉందమ్మా.. అంటారు. ఆమె శక్తి అంత గొప్పది.
శ్రీనాథుడు కాశీఖండంలో ఓ మాటంటారు.. ‘‘గంగానది, గంగానది, గంగానది..’’ అని ఉచ్చరిస్తే చాలు.. అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయనక్కరలేదు. రాత్రి పడుకోబోయేముందో.. పాద్దున లేస్తున్నప్పుడో.. ఆ గంగానది వైభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ.. ‘గంగానది గంగానది గంగానది’ అని ఎవరు తలచుకుంటారో వారి పాపాలన్నీ ఆమె తీసేస్తుంది.. అంటారు. అదీ ఆమె ఘనత.
గంగానదిలో ఉన్నది నీరు కాదు.. ఆ నదికి ఒక అధిష్ఠాన దేవత ఉంది. ఆమె అనుగ్రహిస్తుందన్న నమ్మకం సనాతన ధర్మానిది. దీక్షితార్ వారు‘గంగే మాం పాహి’ అన్నారంటే... ఆయనకు అంత నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని కలిగించినది ఎవరు.. ఆయన ఏ కావ్యాలూ పఠించలేదు.. ఎక్కడా చేరి చదువుకోలేదు. గురువుగారయిన చిదంబర యోగి శుశ్రూషలో తెలుసుకున్న విషయాలు అవి.
గురువు గారి మీద నమ్మకం అంత గట్టిగా ఉండబట్టే... ఆయన నీవు గంగానదిలో మునిగి చెయ్యిపెట్టి తడుము.. అనగానే మారుమాట మాట్టాడ కుండా వెళ్ళి వెతికితే.. ఆయనకు వీణ లభించింది.. అది ఆయనను వాగ్గేయకారుణ్ణి చేసింది. ఆ నమ్మకంతోనే ఆయన గంగమ్మను కొనియాడుతూ కీర్తన చేస్తూ.. గంగేమాం పాహి! అన్నారు. అది ఆయన నోటివెంట గంగా ప్రవాహంలా.. శాబ్దికగంగగా ప్రవహించింది. ఆయన ఎక్కడా శాస్త్రాలు చదువుకోక పోయినా ఈ కీర్తనలో ఆయన ఎన్నో పౌరాణిక విషయాలను.. అవి కూడా గాఢతతో ఉన్న విషయాలను సులభమైన భాషలో ప్రస్తావించారు.
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment