పదమూడవ శతాబ్దంలో, ఒకనాటి సాయంత్రం, శ్రీవైష్ణవ కవి, తాత్త్వికులు వేదాంత దేశికులు తమిళనాడులో అడవుల మధ్య ఉన్న శ్రీవిల్లిపుత్తూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. ఆనాడు త్రయోదశి, మహాప్రదోష సమయం. సంప్రదాయపరులైన శ్రీవైష్ణవులు నరసింహస్వామి ధ్యానంలో మౌనవ్రతాన్ని పాటించే రోజు. అందువల్ల దేశికులు నిశ్శబ్దంగా తమ విడిదిలోకి నిష్క్రమించారు. అప్పుడే ఆ వీధి నుండి పూర్వ శతాబ్దాలకు చెందిన కవయిత్రి, మార్మిక వధువు అయిన శ్రీ ఆండాళ్ ఉత్సవ విగ్రహపు ఊరేగింపు సాగింది.
కనుల పండువగా, వైభవోపేతంగా పల్లకీలో సాగే ఆ ఊరేగింపు, ఆ ఊరి వేల్పు వటపత్ర శాయి ఆలయానికి సాగుతోంది. ఆ అద్భుత దృశ్యం దేశికుల మౌనవ్రతాన్ని హఠాత్తుగా భగ్నం చేసింది. వారి నోటి వెంట ఆశువుగా గోదాస్తుతి వెలువడింది. వారు రచించిన 28 స్తోత్రాలలోకి ఇది గొప్ప రచనగా పండితులు భావిస్తారు. నియమ బద్ధమైన మౌనాన్ని ఛేదిస్తూ ఆశుధారగా వెలువడిన ఆ స్తోత్రం శ్రీవైష్ణవ సాహిత్యం లోకెల్లా గంభీరమైన స్తోత్రంగా సంస్కృత పండితులే కాక వేదాంతులు కూడా భావిస్తారు.
గోదాస్తుతికి గల గంభీర లక్షణాన్ని అర్థం చేసుకోవాలంటే, శ్రీ వైష్ణవ సిద్ధాంతాల పట్ల లోతైన అవగాహన, శ్రీ ఆండాళ్ కృతులలో, ఆమె పవిత్ర జీవిత గాథలో ప్రతీకాత్మకంగా చెప్పిన విషయాలను అర్థం చేసుకొనే శక్తి ఉండాలి.
1. భగవంతుని వారసులుగా తప్ప జీవాత్మలకు ఏ విధమైన గుర్తింపూ లేదు.
2. ఇహలోక యాత్రలో తమ ప్రాణేశ్వరుడైన పరమాత్మను అన్వేషించటం కంటే, అతనితో తమ జీవనాన్ని పెనవేసుకోవటం కంటే మరో ముఖ్యమైన కార్యక్రమం జీవాత్మలకు లేదు.
3. విశ్వజనీన వరుడు పరమాత్మతో కలయికకు ఎదురుచూడని జీవాత్మల గాథలు వ్యర్థాలు. శ్రీవైష్ణవ మతానుసారం, భగవానుని సంయోగం కోసం ఎదురుచూడని జీవుని జన్మ వృథా! అందువల్ల జీవాత్మ ఎప్పుడూ పరమాత్మ కోసం అన్వేషించి, తపించి, కనుగొని అతనిలో విశ్రమించాలి.
‘వధూమార్మికత’ అనే దృక్కోణంపై గోదాదేవి జీవితగాథ, ఆమె కవిత్వ మహత్తర సౌధం నిర్మితమైంది. ఆండాళ్ ‘నాచ్చియార్ తిరుమొళి’లో తొణికిసలాడుతున్న వధూమార్మికత లేదా ప్రణయభక్తి, పరమాత్మ కొరకు జీవుని వేదన... అప్పటి శ్రీ వైష్ణవ ఆలోచనాధారను ప్రభావితం చేశాయి. శ్రీవైష్ణవ సిద్ధాంతాలకు ఆనందప్రదమైన నిరూపణగా నిలిచిపోయాయి. ఈ విషయాన్నే దేశికులు గోదాస్తుతిలోని ఎనిమిదవ చరణంలో చెప్పారు. ఆమె తండ్రి అయిన పెరియాళ్వారుతో సహా వైదిక విశ్వాసం గల పెద్దలు కూడా తమ సంప్రదాయాలను వదలి, తమ ఆధ్యాత్మిక అన్వేషణలో గోదాదేవి చూపిన ప్రణయ భక్తి మార్గాన్ని అనుసరించారు.
గోదాదేవి దాల్చి ఇచ్చిన మాలను ధరించి సంతోషించిన రంగనాథుడు, ఆమె పాశురాలకు పరవశించిన స్వామి, ఆమె జీవులను రక్షించటానికి ఏమి చేయమంటే అది చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని శ్రీవైష్ణవుల విశ్వాసం. (క్లిక్ చేయండి: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం)
– శ్రీదేవి మురళీధర్
Comments
Please login to add a commentAdd a comment