andal
-
Goda Stuti: మార్మిక వధూగీతం గోదాస్తుతి
పదమూడవ శతాబ్దంలో, ఒకనాటి సాయంత్రం, శ్రీవైష్ణవ కవి, తాత్త్వికులు వేదాంత దేశికులు తమిళనాడులో అడవుల మధ్య ఉన్న శ్రీవిల్లిపుత్తూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. ఆనాడు త్రయోదశి, మహాప్రదోష సమయం. సంప్రదాయపరులైన శ్రీవైష్ణవులు నరసింహస్వామి ధ్యానంలో మౌనవ్రతాన్ని పాటించే రోజు. అందువల్ల దేశికులు నిశ్శబ్దంగా తమ విడిదిలోకి నిష్క్రమించారు. అప్పుడే ఆ వీధి నుండి పూర్వ శతాబ్దాలకు చెందిన కవయిత్రి, మార్మిక వధువు అయిన శ్రీ ఆండాళ్ ఉత్సవ విగ్రహపు ఊరేగింపు సాగింది. కనుల పండువగా, వైభవోపేతంగా పల్లకీలో సాగే ఆ ఊరేగింపు, ఆ ఊరి వేల్పు వటపత్ర శాయి ఆలయానికి సాగుతోంది. ఆ అద్భుత దృశ్యం దేశికుల మౌనవ్రతాన్ని హఠాత్తుగా భగ్నం చేసింది. వారి నోటి వెంట ఆశువుగా గోదాస్తుతి వెలువడింది. వారు రచించిన 28 స్తోత్రాలలోకి ఇది గొప్ప రచనగా పండితులు భావిస్తారు. నియమ బద్ధమైన మౌనాన్ని ఛేదిస్తూ ఆశుధారగా వెలువడిన ఆ స్తోత్రం శ్రీవైష్ణవ సాహిత్యం లోకెల్లా గంభీరమైన స్తోత్రంగా సంస్కృత పండితులే కాక వేదాంతులు కూడా భావిస్తారు. గోదాస్తుతికి గల గంభీర లక్షణాన్ని అర్థం చేసుకోవాలంటే, శ్రీ వైష్ణవ సిద్ధాంతాల పట్ల లోతైన అవగాహన, శ్రీ ఆండాళ్ కృతులలో, ఆమె పవిత్ర జీవిత గాథలో ప్రతీకాత్మకంగా చెప్పిన విషయాలను అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. 1. భగవంతుని వారసులుగా తప్ప జీవాత్మలకు ఏ విధమైన గుర్తింపూ లేదు. 2. ఇహలోక యాత్రలో తమ ప్రాణేశ్వరుడైన పరమాత్మను అన్వేషించటం కంటే, అతనితో తమ జీవనాన్ని పెనవేసుకోవటం కంటే మరో ముఖ్యమైన కార్యక్రమం జీవాత్మలకు లేదు. 3. విశ్వజనీన వరుడు పరమాత్మతో కలయికకు ఎదురుచూడని జీవాత్మల గాథలు వ్యర్థాలు. శ్రీవైష్ణవ మతానుసారం, భగవానుని సంయోగం కోసం ఎదురుచూడని జీవుని జన్మ వృథా! అందువల్ల జీవాత్మ ఎప్పుడూ పరమాత్మ కోసం అన్వేషించి, తపించి, కనుగొని అతనిలో విశ్రమించాలి. ‘వధూమార్మికత’ అనే దృక్కోణంపై గోదాదేవి జీవితగాథ, ఆమె కవిత్వ మహత్తర సౌధం నిర్మితమైంది. ఆండాళ్ ‘నాచ్చియార్ తిరుమొళి’లో తొణికిసలాడుతున్న వధూమార్మికత లేదా ప్రణయభక్తి, పరమాత్మ కొరకు జీవుని వేదన... అప్పటి శ్రీ వైష్ణవ ఆలోచనాధారను ప్రభావితం చేశాయి. శ్రీవైష్ణవ సిద్ధాంతాలకు ఆనందప్రదమైన నిరూపణగా నిలిచిపోయాయి. ఈ విషయాన్నే దేశికులు గోదాస్తుతిలోని ఎనిమిదవ చరణంలో చెప్పారు. ఆమె తండ్రి అయిన పెరియాళ్వారుతో సహా వైదిక విశ్వాసం గల పెద్దలు కూడా తమ సంప్రదాయాలను వదలి, తమ ఆధ్యాత్మిక అన్వేషణలో గోదాదేవి చూపిన ప్రణయ భక్తి మార్గాన్ని అనుసరించారు. గోదాదేవి దాల్చి ఇచ్చిన మాలను ధరించి సంతోషించిన రంగనాథుడు, ఆమె పాశురాలకు పరవశించిన స్వామి, ఆమె జీవులను రక్షించటానికి ఏమి చేయమంటే అది చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని శ్రీవైష్ణవుల విశ్వాసం. (క్లిక్ చేయండి: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం) – శ్రీదేవి మురళీధర్ -
కల్పవల్లి... ఆండాళ్ తల్లి
వైష్ణవసంప్రదాయంలో 108 దివ్య దేశాలున్నాయి. ఆ క్షేత్రాలలో విష్ణువు నెలకొని ఉంటాడు. వాటిలో ఒకటి శ్రీవిల్లిపుత్తూర్. ఇక్కడే విష్ణుచిత్తుడు అనే భక్తుడుండేవాడు. ఆయనకు తులసివనంలో ఒక బాలిక దొరుకుతుంది. ఆ బాలికకు పుష్పమాలిక అనే అర్థం వచ్చేట్టు కోదై అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ప్రతిరోజూ విష్ణువుకు సమర్పించే మాలలను సిద్ధం చేస్తుంటే తండ్రికి సహాయం చేసేది కోదై. విష్ణువుకు అలంకరించే మాలలు తాను ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోయేది. ఒకసారి స్వామి వారికి మాలసమర్పిస్తుంటే పొడవైన కేశం విష్ణుచిత్తుడి కంటపడింది. విషయం గ్రహించి కూతుర్ని మందలించి మరునాటి మాలలను సిద్ధం చేసి తానే తీసుకుని వెళ్తే అది స్వామి స్వీకరించడు. గోదా అలంకరించుకున్న మాలే సమర్పించమంటాడు. ఇన్నాళ్లు తాను పెంచింది సాక్షాత్తు లక్ష్మీదేవినే అని గ్రహించి ఆమెను ఆండాళ్ తల్లి అని సంబోధిస్తాడు. పవిత్రధనుర్మాసంలో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆమెను వివాహం చేసుకోవడానికి తిరుమల నుంచి వేంకటేశ్వర స్వామి, కంచి నుండి వరదరాజస్వామి వస్తుండగా రంగనాథస్వామి గరుడవాహనంపై విచ్చేసి ఆమె చేయందుకుంటాడు. ఇందుకు ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వర సన్నిధి ఉంది.గర్భాలయంలో గోదాదేవి, రంగనాథస్వామితోపాటు గరుత్మంతుడు కూడా ఉంటాడు. గోదాదేవి ఎడమచేతిలో చిలుకను ధరించి, చేతిని వంపుగా కిందికి వదిలి ఉంటే, రంగనాథస్వామి గోపాలకుడిగా చెర్నాకోలు, ముల్లుకర్ర ధరించి ఉంటాడు. గరుత్మంతుడు అంజలి బద్ధుడై వారిని సేవించుకుంటూ దర్శనమిస్తాడు. ఇటువంటి అపురూపమైన గోదాదేవి దర్శనాన్ని చేసుకుని భక్తులంతా తరిస్తారు. అయితే వటపత్రశాయి సన్నిధి దివ్యదేశం అనీ, ఇప్పటి గోదాదేవి ఆలయం పెరియాళ్వార్ గృహమనీ, అదే కాలక్రమంలో ఆలయంగా రూపుదిద్దుకుందని భక్తులు గ్రహించాలి. గోదాదేవి దర్శనం సకలశుభాలకు నెలవు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
జియ్యర్ రచ్చ..
ఇటీవల పలు మఠాలకు చెందిన జియ్యర్లు, అధిపతులు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో కంచి మఠంలో వివాదం, మొన్నటివరకు మదురై మఠం వ్యవహారంలో ఆధీనం అరుణగిరి నాథర్, నిత్యానంద మధ్య రగడ చర్చనీయాంశాలు ఉన్నాయి. తాజాగా రచయిత వైరముత్తు శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. ఆ ఆలయ మఠం జియ్యర్ శఠగోప రామానుజర్ వైరముత్తుకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టి తీవ్రంగానే స్పందించారు. తమిళ తాయ్ గీతానికి లేచి నిలబడకుండా అమర్యాద చేశారంటూ కంచి మఠం విజయేంద్ర సరస్వతికి వ్యతిరేకంగా కొద్ది రోజులు పోరు సాగింది. ఈ నేపథ్యంలో శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారి ఆలయ జియ్యర్ శఠగోప రామానుజర్ శనివారం నోరు జారారు. సోడా బాటిళ్లను విసిరేందుకు సిద్ధం అని, రాళ్ల దాడితో ఘర్షణలకు రెడీ అని సంచలన వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు. నిన్నటివరకు వైరముత్తుకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, తాజాగా జియ్యర్ వైపు మరలాయి. సాక్షి, చెన్నై : శ్రీ విళ్లిపుత్తూర్ ఆండాల్ అమ్మవారి ఆలయ మఠం జియ్యర్ శఠగోప రామానుజర్ రచ్చకెక్కారు. నిన్నటివరకు వైరముత్తు చుట్టూ సాగిన వివాదం, తాజాగా జియ్యర్ వైపు మరలింది. సోడా బాటిల్, రాళ్ల దాడి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించే వారి సంఖ్య పెరిగింది. జియ్యర్‌కు బెదిరింపులు ఓవైపు వస్తుంటే, మరోవైపు ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ అదే జియ్యర్‌కు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. విమర్శల వర్షం జియ్యర్ వ్యాఖ్యలపై ఆదివారం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మతత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పుతూ కొంతమంది లౌకికవాదులు విమర్శల స్వరాన్ని పెంచారు. మరికొందరు ఏకంగా సెటైర్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే, జియ్యర్ మీద పెద్ద సమరమే సాగించే విధంగా వ్యంగ్యాస్త్రాలు, విమర్శల పర్వం జోరందుకోవడం గమనార్హం. జియ్యర్‌కు బెదిరింపులు ఇచ్చే వాళ్లు సైతం పెరగడంతో తనకు భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించాల్సి న పరిస్థితి. జియ్యర్ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, ఇక మీదట జియ్యర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటే, సోడా బాటిళ్లు, రాళ్లు విసరడం నేర్చుకోవాల్సి ఉంటుందేమో అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ సోడా బాటిళ్లు, రాళ్లు విసిరిన పక్షంలో, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని, ఇకనైనా హద్దుల్లో ఉంటే మంచిదని హెచ్చరించారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు వ్యాఖ్యల్ని మాట్లాడడం శోచనీయమని, దీనిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వీసికే నాయకుడు రవికుమార్ పేర్కొంటూ, సోడా బాటిళ్లు, రాళ్లు విసరడం కాదు అని, ముందు నాలుగు వేల దివ్య ప్రభందాల్లో ఎన్ని పాసురాలు గుక్క తిప్పకుండా చెప్పగలరో ముందు సమాధానం చెప్పండంటూ ప్రశ్నించారు. జియ్యర్ వ్యాఖ్యలు మతత్త్వ శక్తుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ ద్రవిడ కళగం నేత వీరమణి మండిపడ్డారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ సైతం జియ్యర్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ విమర్శలు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు జియ్యర్‌కు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ద్రవిడ విడుదలైకు చెందిన ప్రతినిధులు చెన్నై పోలీసు కమిషనర్‌లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరిస్తున్న జియ్యర్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. అమ్మ వారికి క్షమాపణ ఈ విమర్శ దుమారం నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే, ఆ వ్యాఖ్యలకు చింతిస్తూ, ఆండాల్ అమ్మవారి సన్నిధిలో తాను క్షమాపణ చెప్పుకున్నట్టు ఓ మీడియాతో మాట్లాడుతూ జియ్యర్ వ్యాఖ్యానించారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తాను పూజించే అమ్మవారి ముందు క్షమాపణ చెప్పకున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ వివాదం ఇంతటితో సమసిపోవాలంటే, వైరముత్తు శ్రీవిళ్లిపుత్తూరుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటే చాలునని వ్యాఖ్యానించారు. -
స్వామిజీ వ్యాఖ్యల దుమారం
సాక్షి, చెన్నై : సోడా బాటిళ్లను చేతబట్టి.. రాళ్లను విసురుతూ ఘర్షణలకు దిగడానికి తాను సిద్ధమని శ్రీవిల్లిపుత్తూరు ఆలయ పీఠాధిపతి శఠగోపరామానుజ జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు చేజారితే తామూ రౌడీలుగా మారతామంటూ ఆయన ఓ సభలో ప్రసంగించటం కలకలం రేపింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ రాజకీయ వర్గాలు సహా హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఆండాళ్(గోదాదేవి) ఓ దేవదాసి అని... శ్రీరంగ ఆలయంలో ఆమె చనిపోయిందంటూ... తమిళ సినీగేయ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైరముత్తు క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హిందూ ధర్మ విజిపునర్వు ఇయక్కమ్ ఆధ్వర్యంలో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు. వందల మంది పండితులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. వేదిక మీద ఉన్న శఠగోపరామానుజ కింది వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూ మతాన్ని కించపరిచే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇతరుల అమ్మ గురించి, దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాకాదని ఎవరైనా కారు కూతలు కూస్తే.. మేం వేరే దారిలో వస్తాం. అండాళ్ దేవి మా అమ్మ. స్వామీజీలు పూజల్లో, ఆరాధానల్లోనే నిమగ్నమై మౌనంగా ఉంటారనుకుంటే పొరపాటే. గ్లాసులు విసరటం.. సోడా బాటిల్ రౌడీయిజం మాకూ తెలుసు. అవసరమైతే అందుకు నేను సిద్ధం’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన అలా ప్రసంగిస్తున్న వేళ.. అక్కడున్నవాంతా చప్పట్లు కొడుతుంటే పక్కనే ఉన్న మరో ఇద్దరు స్వామీజీలు చిరునవ్వులు చిందించారు. ఇక ఈ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తూ మెమెలు దర్శనమిచ్చాయి. మరోవైపు వైరముత్తు కంటే ముందు.. రామానుజం ప్రజల క్షమాపణలు చెప్పాలని డీఎంకే పార్టీ డిమాండ్ చేసింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో దీంతో దిగొచ్చిన ఆయన అండాళ్ దేవి సాక్షిగా ఆదివారం క్షమాపణలు తెలియజేశారు. నిత్యానంద శిష్యులపై కేసు నమోదు... నిత్యానందస్వామి శిష్యులపై కేసు నమోదు అయ్యింది. వైరముత్తును పచ్చిబూతులు తిడుతూ వీడియోలు పోస్ట్ చేయటమే అందుకు కారణం. అయితే ఈ వ్యవహారంలో మైనర్లు, ఆశ్రమ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయటం గమనార్హం. బిడదిలోని ఆశ్రమ విద్యార్థులు వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తున్నారు. వీటిపై పీయూష్ మానుష్ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలతో ఇలా లైంగిక సంబంధమైన మాటలు పలికించడం బాలలపై నేరాల నిరోధక చట్టం కింద శిక్షార్హమని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలు
నెల్లూరు(బందావనం) : నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం తిరుమంజనం, సాయంత్రం ప్రాకారోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 5వ తేదీ రాత్రి పేట ఉత్సవం జరుగుతుందని తెలియజేశారు. -
రంగనాథ రాజగోపురం
అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్వార్గా గణుతికెక్కిన గోదాదేవి కొలువుతీరిన పుణ్యక్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు. తమిళనాడులోని మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఆండాళ్, కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే. సుప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణం నిత్యం గోదా, వటపత్రశాయి నామస్మరణలతో మారుమోగుతుంటుంది. దాదాపు 192 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయాన్ని తమిళనాడు ప్రభుత్వం తమ అధికార చిహ్నంగా ఉపయోగిస్తోంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో వల్లభ దేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులుచేర్పులు జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని ఏమాత్రం కోల్పోని ఆలయమిది. గోదాదేవి దొరికిన తులసీవనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు. సువిశాలమైన ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్, ఆండాళ్ పూజామంటపం ఉన్నాయి. ప్రధానాలయ లోపలి ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. అమ్మవారి ఆలయానికి ముందు మహినగ్, సుముఖన్, సేనై ఇముదల్వర్ల చిన్ని చిన్న మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసీవనంలో ఉన్న బావిలోనే అమ్మవారు తన ముఖారవిందాన్ని చూసుకునేదంటారు. ఇదే ప్రాంగణంలో ఊంజల్ మంటపం ఉంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తరభాగంలో గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో ఆలయంలో శ్రీకృష్ణపరమాత్మ వటపత్రశాయిగా దర్శనమిస్తారు. అద్భుత శిల్పకళా విన్యాసంతో అలరారుతున్న ఈ ఆలయ రాజగోపురం అల్లంత దూరం నుంచి దృశ్యమానమవుతుంది. ఈ గోపురంపై ఉన్న దేవతల శిల్పాలు అత్యద్భుతంగా ఉండి, భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఆలయం మదిని పులకింపజేసే మనోహర శిల్పాలకు వేదిక. ఆలయ బయటి ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయస్వామి మందిరాలున్నాయి. ప్రాకారపు గోడలపై అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, రతీమన్మథులు, తదితర శిల్పాలు నాటి అద్వితీయ శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలిచి, చూపరుల దృష్టిని ఆకట్టుకుంటాయి. వటపత్రశాయి ఆలయంలో నల్లరాతి శిల్పంపై శేషశయనుడైన స్వామి దర్శనమిస్తాడు. భక్తిభావాన్ని పెంచే స్వామిని దర్శించుకుని భక్తులు కైమోడ్పులర్పిస్తారు. అమ్మవారి ఆలయానికి ముందుభాగంలో ఉన్న శిల్ప సహిత స్తంభాలతో కూడిన మండపంలో భక్తులు సేదదీరుతారు. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం కలుగుతుందంటారు. ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరి రోజున అత్యంత వైభవంగా నిర్వహించే గోదా కల్యాణ మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్ర సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. - దాసరి దుర్గాప్రసాద్