రంగనాథ రాజగోపురం
అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్వార్‌గా గణుతికెక్కిన గోదాదేవి కొలువుతీరిన పుణ్యక్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు. తమిళనాడులోని మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఆండాళ్, కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే.
సుప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణం నిత్యం గోదా, వటపత్రశాయి నామస్మరణలతో మారుమోగుతుంటుంది. దాదాపు 192 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయాన్ని తమిళనాడు ప్రభుత్వం తమ అధికార చిహ్నంగా ఉపయోగిస్తోంది.
ఈ ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో వల్లభ దేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులుచేర్పులు జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని ఏమాత్రం కోల్పోని ఆలయమిది. గోదాదేవి దొరికిన తులసీవనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు.
సువిశాలమైన ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్, ఆండాళ్ పూజామంటపం ఉన్నాయి. ప్రధానాలయ లోపలి ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. అమ్మవారి ఆలయానికి ముందు మహినగ్, సుముఖన్, సేనై ఇముదల్వర్‌ల చిన్ని చిన్న మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసీవనంలో ఉన్న బావిలోనే అమ్మవారు తన ముఖారవిందాన్ని చూసుకునేదంటారు.
ఇదే ప్రాంగణంలో ఊంజల్ మంటపం ఉంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తరభాగంలో గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో ఆలయంలో శ్రీకృష్ణపరమాత్మ వటపత్రశాయిగా దర్శనమిస్తారు. అద్భుత శిల్పకళా విన్యాసంతో అలరారుతున్న ఈ ఆలయ రాజగోపురం అల్లంత దూరం నుంచి దృశ్యమానమవుతుంది. ఈ గోపురంపై ఉన్న దేవతల శిల్పాలు అత్యద్భుతంగా ఉండి, భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఆలయం మదిని పులకింపజేసే మనోహర శిల్పాలకు వేదిక.
ఆలయ బయటి ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయస్వామి మందిరాలున్నాయి. ప్రాకారపు గోడలపై అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, రతీమన్మథులు, తదితర శిల్పాలు నాటి అద్వితీయ శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలిచి, చూపరుల దృష్టిని ఆకట్టుకుంటాయి.
వటపత్రశాయి ఆలయంలో నల్లరాతి శిల్పంపై శేషశయనుడైన స్వామి దర్శనమిస్తాడు. భక్తిభావాన్ని పెంచే స్వామిని దర్శించుకుని భక్తులు కైమోడ్పులర్పిస్తారు. అమ్మవారి ఆలయానికి ముందుభాగంలో ఉన్న శిల్ప సహిత స్తంభాలతో కూడిన మండపంలో భక్తులు సేదదీరుతారు. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం కలుగుతుందంటారు. ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరి రోజున అత్యంత వైభవంగా నిర్వహించే గోదా కల్యాణ మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్ర సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు.
- దాసరి దుర్గాప్రసాద్