జియ్యర్‌ రచ్చ.. | Jeeyar apologises for soda bottles comment | Sakshi
Sakshi News home page

జియ్యర్‌ రచ్చ..

Published Mon, Jan 29 2018 1:40 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

Jeeyar apologises for soda bottles comment - Sakshi

ఇటీవల పలు మఠాలకు చెందిన జియ్యర్‌లు, అధిపతులు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో కంచి మఠంలో వివాదం, మొన్నటివరకు మదురై మఠం వ్యవహారంలో ఆధీనం అరుణగిరి నాథర్, నిత్యానంద మధ్య రగడ చర్చనీయాంశాలు ఉన్నాయి. తాజాగా రచయిత వైరముత్తు  శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్‌ అమ్మవారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. ఆ ఆలయ మఠం జియ్యర్‌ శఠగోప రామానుజర్‌  వైరముత్తుకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టి తీవ్రంగానే స్పందించారు. తమిళ తాయ్‌ గీతానికి లేచి నిలబడకుండా అమర్యాద చేశారంటూ కంచి మఠం విజయేంద్ర సరస్వతికి వ్యతిరేకంగా కొద్ది రోజులు పోరు సాగింది. ఈ నేపథ్యంలో శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్‌ అమ్మవారి ఆలయ జియ్యర్‌ శఠగోప రామానుజర్‌ శనివారం నోరు జారారు. సోడా బాటిళ్లను విసిరేందుకు సిద్ధం అని, రాళ్ల దాడితో ఘర్షణలకు రెడీ అని సంచలన వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు. నిన్నటివరకు వైరముత్తుకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, తాజాగా జియ్యర్‌ వైపు మరలాయి.

సాక్షి, చెన్నై : శ్రీ విళ్లిపుత్తూర్‌ ఆండాల్‌ అమ్మవారి ఆలయ మఠం జియ్యర్‌ శఠగోప రామానుజర్‌ రచ్చకెక్కారు. నిన్నటివరకు వైరముత్తు చుట్టూ సాగిన వివాదం, తాజాగా జియ్యర్‌ వైపు మరలింది. సోడా బాటిల్, రాళ్ల దాడి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించే వారి సంఖ్య పెరిగింది. జియ్యర్‌కు బెదిరింపులు ఓవైపు వస్తుంటే, మరోవైపు ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ అదే జియ్యర్‌కు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి.

విమర్శల వర్షం
జియ్యర్‌ వ్యాఖ్యలపై ఆదివారం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మతత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పుతూ కొంతమంది లౌకికవాదులు విమర్శల స్వరాన్ని పెంచారు. మరికొందరు ఏకంగా సెటైర్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే, జియ్యర్‌ మీద పెద్ద సమరమే సాగించే విధంగా వ్యంగ్యాస్త్రాలు, విమర్శల పర్వం జోరందుకోవడం గమనార్హం. జియ్యర్‌కు బెదిరింపులు ఇచ్చే వాళ్లు సైతం పెరగడంతో తనకు భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించాల్సి న పరిస్థితి. జియ్యర్‌ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, ఇక మీదట జియ్యర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటే, సోడా బాటిళ్లు, రాళ్లు విసరడం నేర్చుకోవాల్సి ఉంటుందేమో అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ సోడా బాటిళ్లు, రాళ్లు విసిరిన పక్షంలో, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని, ఇకనైనా హద్దుల్లో ఉంటే మంచిదని హెచ్చరించారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ మాట్లాడుతూ, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు వ్యాఖ్యల్ని మాట్లాడడం శోచనీయమని, దీనిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వీసికే నాయకుడు రవికుమార్‌ పేర్కొంటూ, సోడా బాటిళ్లు, రాళ్లు విసరడం కాదు అని, ముందు నాలుగు వేల దివ్య ప్రభందాల్లో ఎన్ని పాసురాలు గుక్క తిప్పకుండా చెప్పగలరో ముందు సమాధానం చెప్పండంటూ ప్రశ్నించారు. జియ్యర్‌ వ్యాఖ్యలు  మతత్త్వ శక్తుల్ని రెచ్చగొట్టే విధంగా  ఉన్నాయంటూ ద్రవిడ కళగం నేత వీరమణి మండిపడ్డారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్‌ సైతం జియ్యర్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఈ విమర్శలు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు జియ్యర్‌కు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ద్రవిడ విడుదలైకు చెందిన ప్రతినిధులు చెన్నై పోలీసు కమిషనర్‌లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరిస్తున్న జియ్యర్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

అమ్మ వారికి  క్షమాపణ
ఈ విమర్శ దుమారం నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే, ఆ వ్యాఖ్యలకు చింతిస్తూ, ఆండాల్‌ అమ్మవారి సన్నిధిలో తాను క్షమాపణ చెప్పుకున్నట్టు ఓ మీడియాతో మాట్లాడుతూ జియ్యర్‌ వ్యాఖ్యానించారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తాను పూజించే అమ్మవారి ముందు క్షమాపణ చెప్పకున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ వివాదం ఇంతటితో సమసిపోవాలంటే, వైరముత్తు శ్రీవిళ్లిపుత్తూరుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటే చాలునని వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement