jeeyar swamy
-
నాలుగు మండపాలుగా యాగశాల విభజన
లక్ష్మీనారాయణుడి మహా యాగశాలను నాలుగు మండపాలుగా విభజించారు. భోగమండపం, పుష్పమండపం, త్యాగ మండపం, జ్ఞానమండపంగా వీటికి పేరు పెట్టారు. నాలుగు దిక్కుల్లో ఉన్న ఈ మండపాల్లో 114 యాగశాలలున్నాయి. మధ్య శాలలో జీయర్ స్వాములతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడే భగవంతుని దర్శనం ఉంటుంది. రోజుకు మూడు పూటల పూజా కార్యక్రమాలు ఇక్కడ్నుంచే నిర్వహిస్తారు. మిగతా యాగశాలల్లో రుత్వికులతో యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక్కో యాగశాలలో 9 యజ్ఞకుండాలు ఉంటాయి. చతురస్ర కుండం (స్వకయర్), యోని కుండం (ఇన్వర్టెడ్ హార్ట్), అర్థచంద్ర/ధనుష్కుండం (హాఫ్ మూన్), సహదస్ర కుండం (హెక్సాగాన్), వృత్త కుండం (సర్కిల్), పంచస్ర కుండం (పెంటాగన్), త్రికోణ కుండం (ట్రాయాంగ్యులర్), అష్ట్రాశమ కుండం (ఆక్టాగాన్), పద్మకుండం (లోటస్)గా వీటిని పిలుస్తారు. మొత్తంగా 1,035 యజ్ఞ కుండాల్లో 5 వేల మంది రుత్వికులతో యాగం నిర్వహిస్తారు. -
యాదాద్రి స్వామికి ‘ద్వితీయ సంవత్సర’ విఘ్నం
సాక్షి, హైదరాబాద్: స్వయంభూ స్వామిగా ఖ్యాతి గాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి.. గుట్టమీది ప్రధాన గుడిలో కొలువుదీరేందుకు ‘ద్వితీయ సంవత్సరం’విఘ్నం అడ్డు వస్తోంది. ఉత్సవమూర్తులను ఏడాదిలోపే ప్రధానాలయంలో పునః ప్రతిష్టించాలని, లేదంటే మూడో ఏడాదే కదిలించాలన్న తాజా సమాచారంతో వచ్చే దసరా వరకు బాలాలయంలోనే మూర్తులకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. వచ్చే విలంబి నామ సంవత్సరం వైష్ణవారాధనలో కీలకం కావడంతో ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి తరలించేందుకు విలంబి దసరా ప్రశస్త్యమైనదిగా నిర్ణయించారు. దీంతో ఇదిగో అదిగో అంటూ ప్రధానాలయంలో స్వామి దివ్య దర్శనం ముహూర్తాన్ని వాయిదా వేస్తూ వస్తున్న యాదాద్రి అభివృద్ధి సంస్థ మరో గడువునూ జరిపింది. విలంబి దసరా తర్వాత.. ప్రస్తుతం ప్రధానాలయం కప్పు నిర్మాణం వరకు వచ్చింది. మేలో ఆ పని చేయనున్నారు. శివాలయమూ కప్పు మినహా పూర్తయింది. ప్రసాద తయారీ ప్రాంగణం కూడా పూర్తి కావచ్చింది. గిరి ప్రదక్షిణ బాటలు వేగంగా సిద్ధమవుతున్నాయి. 12 ఆళ్వార్ విగ్రహాలను ప్రతిష్టించారు. కాకతీయ స్తంభాలు ఏర్పాటయ్యాయి. మాడ వీధులు, గాలి గోపురాల పనులూ కొలిక్కి వస్తున్నందున జూన్ రెండో వారం నాటికి కొండమీది పనులన్నీ పూర్తి కానున్నాయి. ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైనా చినజియర్ స్వామి తాజా ఆదేశంతో మరికొన్ని నెలలు బాలాలయంలోనే స్వామి దర్శనాలు కొనసాగనున్నాయి. శ్రీరామచంద్రస్వామి జననం విలంబినామ సంవత్సరమే కావడంతో ఆ సంవత్సరాన్ని వైష్ణవారాధకులు మరింత పవిత్రంగా భావిస్తారు. వెంకటేశ్వరుని కళ్యాణం కూడా ఆ సంవత్సరంలోనే జరిగిందని కొందరి వాదన. దీంతో ఆ సంవత్సర దసరా వేళ ఆలయం ప్రారంభిస్తే మంచిదని జీయర్ స్వామి అధికారుల దృష్టికి తెచ్చారు. విలంబి దసరా తర్వాత మంచి ముహూర్తాన్ని ఖరారు చేసి దివ్య క్షేత్రాన్ని ప్రాంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పితే మూడో ఏడాదే.. ప్రధానాలయం నుంచి బాలాలయంలోకి స్వామి మూర్తులు తరలిస్తే ఒకే సంవత్సరంలోపు ప్రధానాలయంలోకి తరలించాలని ఆగమశాస్త్రం చెబుతోందని అధికారులకు అందిన సమాచారం. మొదటి ఏడాది తరలించని పక్షంలో మూడో సంవత్సరం ప్రవేశించిన తర్వాతే పునః ప్రతిష్టించాలని చినజియర్ స్వామి అధికారులకు సూచించారు. వచ్చే దసరాకు గానీ రెండో సంవత్సరం పూర్తి కానందున దసరాలోపు ప్రధానాలయంలోకి మార్చొద్దని ఆయన చెప్పారు. వాస్తవానికి జూన్ నాటికే పనులు పూర్తి చేసి ప్రధానాలయంలో స్వామి దర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించారు. గతేడాది నవంబర్‌లో యాదాద్రి పనులు సీఎం కేసీఆర్ పరిశీలించినపుడు పనుల వేగం పెంచాలని ఆదేశించగా జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. -
జియ్యర్ రచ్చ..
ఇటీవల పలు మఠాలకు చెందిన జియ్యర్లు, అధిపతులు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో కంచి మఠంలో వివాదం, మొన్నటివరకు మదురై మఠం వ్యవహారంలో ఆధీనం అరుణగిరి నాథర్, నిత్యానంద మధ్య రగడ చర్చనీయాంశాలు ఉన్నాయి. తాజాగా రచయిత వైరముత్తు శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. ఆ ఆలయ మఠం జియ్యర్ శఠగోప రామానుజర్ వైరముత్తుకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టి తీవ్రంగానే స్పందించారు. తమిళ తాయ్ గీతానికి లేచి నిలబడకుండా అమర్యాద చేశారంటూ కంచి మఠం విజయేంద్ర సరస్వతికి వ్యతిరేకంగా కొద్ది రోజులు పోరు సాగింది. ఈ నేపథ్యంలో శ్రీవిళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారి ఆలయ జియ్యర్ శఠగోప రామానుజర్ శనివారం నోరు జారారు. సోడా బాటిళ్లను విసిరేందుకు సిద్ధం అని, రాళ్ల దాడితో ఘర్షణలకు రెడీ అని సంచలన వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు. నిన్నటివరకు వైరముత్తుకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, తాజాగా జియ్యర్ వైపు మరలాయి. సాక్షి, చెన్నై : శ్రీ విళ్లిపుత్తూర్ ఆండాల్ అమ్మవారి ఆలయ మఠం జియ్యర్ శఠగోప రామానుజర్ రచ్చకెక్కారు. నిన్నటివరకు వైరముత్తు చుట్టూ సాగిన వివాదం, తాజాగా జియ్యర్ వైపు మరలింది. సోడా బాటిల్, రాళ్ల దాడి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించే వారి సంఖ్య పెరిగింది. జియ్యర్‌కు బెదిరింపులు ఓవైపు వస్తుంటే, మరోవైపు ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ అదే జియ్యర్‌కు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. విమర్శల వర్షం జియ్యర్ వ్యాఖ్యలపై ఆదివారం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మతత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పుతూ కొంతమంది లౌకికవాదులు విమర్శల స్వరాన్ని పెంచారు. మరికొందరు ఏకంగా సెటైర్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే, జియ్యర్ మీద పెద్ద సమరమే సాగించే విధంగా వ్యంగ్యాస్త్రాలు, విమర్శల పర్వం జోరందుకోవడం గమనార్హం. జియ్యర్‌కు బెదిరింపులు ఇచ్చే వాళ్లు సైతం పెరగడంతో తనకు భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించాల్సి న పరిస్థితి. జియ్యర్ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, ఇక మీదట జియ్యర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటే, సోడా బాటిళ్లు, రాళ్లు విసరడం నేర్చుకోవాల్సి ఉంటుందేమో అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ సోడా బాటిళ్లు, రాళ్లు విసిరిన పక్షంలో, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని, ఇకనైనా హద్దుల్లో ఉంటే మంచిదని హెచ్చరించారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు వ్యాఖ్యల్ని మాట్లాడడం శోచనీయమని, దీనిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వీసికే నాయకుడు రవికుమార్ పేర్కొంటూ, సోడా బాటిళ్లు, రాళ్లు విసరడం కాదు అని, ముందు నాలుగు వేల దివ్య ప్రభందాల్లో ఎన్ని పాసురాలు గుక్క తిప్పకుండా చెప్పగలరో ముందు సమాధానం చెప్పండంటూ ప్రశ్నించారు. జియ్యర్ వ్యాఖ్యలు మతత్త్వ శక్తుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ ద్రవిడ కళగం నేత వీరమణి మండిపడ్డారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ సైతం జియ్యర్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ విమర్శలు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు జియ్యర్‌కు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ద్రవిడ విడుదలైకు చెందిన ప్రతినిధులు చెన్నై పోలీసు కమిషనర్‌లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరిస్తున్న జియ్యర్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. అమ్మ వారికి క్షమాపణ ఈ విమర్శ దుమారం నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే, ఆ వ్యాఖ్యలకు చింతిస్తూ, ఆండాల్ అమ్మవారి సన్నిధిలో తాను క్షమాపణ చెప్పుకున్నట్టు ఓ మీడియాతో మాట్లాడుతూ జియ్యర్ వ్యాఖ్యానించారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తాను పూజించే అమ్మవారి ముందు క్షమాపణ చెప్పకున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ వివాదం ఇంతటితో సమసిపోవాలంటే, వైరముత్తు శ్రీవిళ్లిపుత్తూరుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటే చాలునని వ్యాఖ్యానించారు. -
జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు
-
స్వామిజీ వ్యాఖ్యల దుమారం
సాక్షి, చెన్నై : సోడా బాటిళ్లను చేతబట్టి.. రాళ్లను విసురుతూ ఘర్షణలకు దిగడానికి తాను సిద్ధమని శ్రీవిల్లిపుత్తూరు ఆలయ పీఠాధిపతి శఠగోపరామానుజ జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు చేజారితే తామూ రౌడీలుగా మారతామంటూ ఆయన ఓ సభలో ప్రసంగించటం కలకలం రేపింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ రాజకీయ వర్గాలు సహా హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఆండాళ్(గోదాదేవి) ఓ దేవదాసి అని... శ్రీరంగ ఆలయంలో ఆమె చనిపోయిందంటూ... తమిళ సినీగేయ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైరముత్తు క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హిందూ ధర్మ విజిపునర్వు ఇయక్కమ్ ఆధ్వర్యంలో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు. వందల మంది పండితులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. వేదిక మీద ఉన్న శఠగోపరామానుజ కింది వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూ మతాన్ని కించపరిచే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇతరుల అమ్మ గురించి, దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాకాదని ఎవరైనా కారు కూతలు కూస్తే.. మేం వేరే దారిలో వస్తాం. అండాళ్ దేవి మా అమ్మ. స్వామీజీలు పూజల్లో, ఆరాధానల్లోనే నిమగ్నమై మౌనంగా ఉంటారనుకుంటే పొరపాటే. గ్లాసులు విసరటం.. సోడా బాటిల్ రౌడీయిజం మాకూ తెలుసు. అవసరమైతే అందుకు నేను సిద్ధం’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన అలా ప్రసంగిస్తున్న వేళ.. అక్కడున్నవాంతా చప్పట్లు కొడుతుంటే పక్కనే ఉన్న మరో ఇద్దరు స్వామీజీలు చిరునవ్వులు చిందించారు. ఇక ఈ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తూ మెమెలు దర్శనమిచ్చాయి. మరోవైపు వైరముత్తు కంటే ముందు.. రామానుజం ప్రజల క్షమాపణలు చెప్పాలని డీఎంకే పార్టీ డిమాండ్ చేసింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో దీంతో దిగొచ్చిన ఆయన అండాళ్ దేవి సాక్షిగా ఆదివారం క్షమాపణలు తెలియజేశారు. నిత్యానంద శిష్యులపై కేసు నమోదు... నిత్యానందస్వామి శిష్యులపై కేసు నమోదు అయ్యింది. వైరముత్తును పచ్చిబూతులు తిడుతూ వీడియోలు పోస్ట్ చేయటమే అందుకు కారణం. అయితే ఈ వ్యవహారంలో మైనర్లు, ఆశ్రమ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయటం గమనార్హం. బిడదిలోని ఆశ్రమ విద్యార్థులు వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తున్నారు. వీటిపై పీయూష్ మానుష్ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలతో ఇలా లైంగిక సంబంధమైన మాటలు పలికించడం బాలలపై నేరాల నిరోధక చట్టం కింద శిక్షార్హమని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజనులు భక్తిభావంతో మెలగాలి
చిన జీయర్‌స్వామి రంపచోడవరం : ఏజెన్సీలోని గిరిజనులు భక్తి భావంతో మెలగాలని, వారి సంస్కృతి, సంప్రదాయాలను పాటించి రానున్న తరాలవారికి ఆదర్శంగా నిలవాలని త్రిదండి శ్రీమన్నారా యణ చిన జీయర్‌స్వామి అన్నారు. స్థానిక నారాయణగిరిపై శుక్రవారం జరిగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిమిత్తం రంపచోడవరం వచ్చిన ఆయన గురువారం స్థానిక వాల్మీకిపేటలోని వా ల్మీకి విగ్రహం వద్ద కొబ్బరికాయ కొ ట్టి పూలమాలలు వేశారు. రామాయణం రచించిన వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సర్పంచ్ వై.నిరంజనీదేవిని అభినందించారు. వాల్మీకి ప్రపంచానికే రాముని గురించి చాటి చెప్పిన మహర్షి అన్నారు. స్థానికులు చినజీయర్‌స్వామికి ఘన స్వాగతం పలికారు. న్యాయవాది ఎంవీఆర్ ప్రకాష్, సాదిక్ మాస్టారు, భవానీశంకర్, భూచక్రం ,ప్రియబాబు, దేవీ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.