సాక్షి, చెన్నై : సోడా బాటిళ్లను చేతబట్టి.. రాళ్లను విసురుతూ ఘర్షణలకు దిగడానికి తాను సిద్ధమని శ్రీవిల్లిపుత్తూరు ఆలయ పీఠాధిపతి శఠగోపరామానుజ జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు చేజారితే తామూ రౌడీలుగా మారతామంటూ ఆయన ఓ సభలో ప్రసంగించటం కలకలం రేపింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ రాజకీయ వర్గాలు సహా హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి.
ఆండాళ్(గోదాదేవి) ఓ దేవదాసి అని... శ్రీరంగ ఆలయంలో ఆమె చనిపోయిందంటూ... తమిళ సినీగేయ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైరముత్తు క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హిందూ ధర్మ విజిపునర్వు ఇయక్కమ్ ఆధ్వర్యంలో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు. వందల మంది పండితులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. వేదిక మీద ఉన్న శఠగోపరామానుజ కింది వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.
‘‘హిందూ మతాన్ని కించపరిచే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇతరుల అమ్మ గురించి, దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాకాదని ఎవరైనా కారు కూతలు కూస్తే.. మేం వేరే దారిలో వస్తాం. అండాళ్ దేవి మా అమ్మ. స్వామీజీలు పూజల్లో, ఆరాధానల్లోనే నిమగ్నమై మౌనంగా ఉంటారనుకుంటే పొరపాటే. గ్లాసులు విసరటం.. సోడా బాటిల్ రౌడీయిజం మాకూ తెలుసు. అవసరమైతే అందుకు నేను సిద్ధం’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన అలా ప్రసంగిస్తున్న వేళ.. అక్కడున్నవాంతా చప్పట్లు కొడుతుంటే పక్కనే ఉన్న మరో ఇద్దరు స్వామీజీలు చిరునవ్వులు చిందించారు.
ఇక ఈ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తూ మెమెలు దర్శనమిచ్చాయి. మరోవైపు వైరముత్తు కంటే ముందు.. రామానుజం ప్రజల క్షమాపణలు చెప్పాలని డీఎంకే పార్టీ డిమాండ్ చేసింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో దీంతో దిగొచ్చిన ఆయన అండాళ్ దేవి సాక్షిగా ఆదివారం క్షమాపణలు తెలియజేశారు.
నిత్యానంద శిష్యులపై కేసు నమోదు...
నిత్యానందస్వామి శిష్యులపై కేసు నమోదు అయ్యింది. వైరముత్తును పచ్చిబూతులు తిడుతూ వీడియోలు పోస్ట్ చేయటమే అందుకు కారణం. అయితే ఈ వ్యవహారంలో మైనర్లు, ఆశ్రమ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయటం గమనార్హం. బిడదిలోని ఆశ్రమ విద్యార్థులు వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తున్నారు. వీటిపై పీయూష్ మానుష్ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలతో ఇలా లైంగిక సంబంధమైన మాటలు పలికించడం బాలలపై నేరాల నిరోధక చట్టం కింద శిక్షార్హమని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment