సాక్షి, హైదరాబాద్: స్వయంభూ స్వామిగా ఖ్యాతి గాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి.. గుట్టమీది ప్రధాన గుడిలో కొలువుదీరేందుకు ‘ద్వితీయ సంవత్సరం’విఘ్నం అడ్డు వస్తోంది. ఉత్సవమూర్తులను ఏడాదిలోపే ప్రధానాలయంలో పునః ప్రతిష్టించాలని, లేదంటే మూడో ఏడాదే కదిలించాలన్న తాజా సమాచారంతో వచ్చే దసరా వరకు బాలాలయంలోనే మూర్తులకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. వచ్చే విలంబి నామ సంవత్సరం వైష్ణవారాధనలో కీలకం కావడంతో ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి తరలించేందుకు విలంబి దసరా ప్రశస్త్యమైనదిగా నిర్ణయించారు. దీంతో ఇదిగో అదిగో అంటూ ప్రధానాలయంలో స్వామి దివ్య దర్శనం ముహూర్తాన్ని వాయిదా వేస్తూ వస్తున్న యాదాద్రి అభివృద్ధి సంస్థ మరో గడువునూ జరిపింది.
విలంబి దసరా తర్వాత..
ప్రస్తుతం ప్రధానాలయం కప్పు నిర్మాణం వరకు వచ్చింది. మేలో ఆ పని చేయనున్నారు. శివాలయమూ కప్పు మినహా పూర్తయింది. ప్రసాద తయారీ ప్రాంగణం కూడా పూర్తి కావచ్చింది. గిరి ప్రదక్షిణ బాటలు వేగంగా సిద్ధమవుతున్నాయి. 12 ఆళ్వార్ విగ్రహాలను ప్రతిష్టించారు. కాకతీయ స్తంభాలు ఏర్పాటయ్యాయి. మాడ వీధులు, గాలి గోపురాల పనులూ కొలిక్కి వస్తున్నందున జూన్ రెండో వారం నాటికి కొండమీది పనులన్నీ పూర్తి కానున్నాయి. ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైనా చినజియర్ స్వామి తాజా ఆదేశంతో మరికొన్ని నెలలు బాలాలయంలోనే స్వామి దర్శనాలు కొనసాగనున్నాయి. శ్రీరామచంద్రస్వామి జననం విలంబినామ సంవత్సరమే కావడంతో ఆ సంవత్సరాన్ని వైష్ణవారాధకులు మరింత పవిత్రంగా భావిస్తారు. వెంకటేశ్వరుని కళ్యాణం కూడా ఆ సంవత్సరంలోనే జరిగిందని కొందరి వాదన. దీంతో ఆ సంవత్సర దసరా వేళ ఆలయం ప్రారంభిస్తే మంచిదని జీయర్ స్వామి అధికారుల దృష్టికి తెచ్చారు. విలంబి దసరా తర్వాత మంచి ముహూర్తాన్ని ఖరారు చేసి దివ్య క్షేత్రాన్ని ప్రాంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తప్పితే మూడో ఏడాదే..
ప్రధానాలయం నుంచి బాలాలయంలోకి స్వామి మూర్తులు తరలిస్తే ఒకే సంవత్సరంలోపు ప్రధానాలయంలోకి తరలించాలని ఆగమశాస్త్రం చెబుతోందని అధికారులకు అందిన సమాచారం. మొదటి ఏడాది తరలించని పక్షంలో మూడో సంవత్సరం ప్రవేశించిన తర్వాతే పునః ప్రతిష్టించాలని చినజియర్ స్వామి అధికారులకు సూచించారు. వచ్చే దసరాకు గానీ రెండో సంవత్సరం పూర్తి కానందున దసరాలోపు ప్రధానాలయంలోకి మార్చొద్దని ఆయన చెప్పారు. వాస్తవానికి జూన్ నాటికే పనులు పూర్తి చేసి ప్రధానాలయంలో స్వామి దర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించారు. గతేడాది నవంబర్‌లో యాదాద్రి పనులు సీఎం కేసీఆర్ పరిశీలించినపుడు పనుల వేగం పెంచాలని ఆదేశించగా జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment