సాక్షి, యాదాద్రి : ‘‘అణువణువునా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణం అద్భుతంగా రూపుదిద్దు కోవాలి. అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుం డా, తొట్రుపాటు పడకుండా సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ నిర్మాణం జరగాలి. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు, భక్తులకు సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండాలి’’అని సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులు, స్తపతులు, ఆర్కిటెక్ట్‌లను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి క్షేత్రంలో సీఎం కేసీఆర్ ఆదివారం 6 గంటల పాటు పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రికి 12.12 గంటలకు సీఎం చేరుకున్నారు. ముందుగా బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శిం చుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం ఇచ్చారు. అనం తరం సుమారు ఆరు గంటలపాటు కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో పురోగతిని సమీక్షించారు. ప్రధాన ఆలయంలోకి భక్తులు ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణ అనంతరం గర్భాలయంలోగల శ్రీస్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని బయటకు వెళ్లే క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలోకి భక్తులు వచ్చి పోయే మార్గాలు, పూజారుల మార్గాలపై అధికా రులను అడిగి తెలుసుకున్నారు. గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన సీఎం అనంతరం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్నారు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉప ఆలయాలను పరిశీలించారు.
బంగారు వర్ణంలో విద్యుత్ దీపాలు
ఆలయ నిర్మాణంపై ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కేసీఆర్ తిలకించారు. తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి వచ్చే క్యూలైన్, దర్శనం అనంతరం పడమటి రాజగోపురం నుంచి బయటకు భక్తులు వెళ్లేందుకు ఉద్దేశించిన క్యూలైన్ అంశాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. క్యూలైన్లకు సంబంధించిన పలు మార్పులు, చేర్పులను ఆనంద్‌సాయికి సీఎం సూచించారు. బ్రహ్మోత్సవ మండపం వెనుకభాగం నుంచి అష్టభుజి ప్రాకార మండపం, తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే విద్యుత్ దీపాలకు సంబంధించిన ప్రజెంటేషన్ చూశారు. బంగారు వర్ణంలో విద్యుత్ దీపాలు చూడముచ్చటగా ఉన్నాయని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇన్నర్ ప్రాకార మండపంలో నిర్మాణం జరుగుతున్న అద్దాల మండపం ప్రజెంటేషన్‌ను చూశారు. ఊయలలో ఊగుతూ శ్రీస్వామి అద్భుతంగా కనిపిస్తున్నారని, వీడియోలో ఉన్న మాదిరిగానే ఆలయం క్యూలైన్లు, విద్యుత్ దీపాలు, అద్దాల మండపం కనిపించే విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
ఆంజనేయస్వామి ఆలయం వద్ద తంజావూర్ చిత్రం, గర్భాలయ ముఖ మండపంపై ఏర్పాటు చేసిన ప్రహ్లాద చరిత్రలు బాగున్నాయన్నారు. ఆలయంలో రెండు హుండీలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన ఆలయంలో ఒకటి, మండపాల్లో మరొక హుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టోన్ ఫ్లోరింగ్ పనులు నాణ్యతతో చేయాలన్నారు. అనంతరం శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆలయం విశాలంగా ఉందన్నారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, గణపతి దేవుడిని దర్శించుకున్న అనంతరం శివుడిని దర్శించుకునే విధంగా క్యూలైన్లు ఉండాలన్నారు. అంతే కాకుండా మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన మహా నందీశ్వరుడి విగ్రహాన్ని ఆలయానికి తూర్పు ప్రాకారంలో పెట్టాలని సూచించారు.
మండపాల్లో తంజావూర్ పెయింటింగ్స్ పెట్టాలి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం ఆలయ ఇన్నర్ ప్రాకార మండపంలో చెక్కుతున్న ఎంబోజింగ్ చిత్రాలస్థానంలో తంజావూర్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయాలని స్తపతులకు, వైటీడీఏ అధికారులకు సూచించారు. మండపాల్లో తంజావూర్ పెయింటింగ్స్‌తో రూపుదిద్దుకున్న సుమారు 50 లక్ష్మీనరసింహస్వామి చిత్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులు ప్రతి కట్టడాన్ని తిలకించాలి
యాదాద్రి ఆలయానికి వచ్చిన భక్తులు ప్రతి రాతి కట్టడాన్ని తిలకించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందు కోసం తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులు పడమటి రాజగోపురం నుంచి బయటకు నేరుగా వెళ్లకుండా కట్టడాలను తిలకించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాలను ప్రతి భక్తుడు చూసి తరించి పోయేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
మణిహారంలా రింగ్‌రోడ్డు...
యాదాద్రి ఆలయానికి రింగ్‌రోడ్డును మణిహారంలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో రింగ్‌రోడ్డును అత్యంత సుందరంగా తయారు చేయాలని ఆదేశించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిచెరువును పుష్కరిణిగా తీర్చిదిద్దుతున్నందున ప్రతి రెండునెలలకోసారి కాళేశ్వరం గోదావరి జలాలతో నింపాలన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణపనుల కోసం మూడువారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావును సీఎం ఫోన్‌లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అని, ఒకేసారి 4,000 మంది వ్రతం చేసుకునేలా వ్రత మంటప ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా వీఐపీ సూట్‌లు, గిరిప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్, గండిచెరువు, టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగారు. సీఎం వెంట మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్‌ఆండ్‌బీ ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, స్థపతి ఆనందాచారి వేలు, అర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
అద్భుతంగా స్వర్ణ ద్వారం
యాదాద్రి గర్భాలయానికి చేతివృత్తుల కళాకారుల నైపుణ్యంతో అద్భుతమైన స్వర్ణ ద్వారాన్ని రూపొందిస్తున్నారు. అత్యంత నాణ్యమైన టేకు చెక్కపై రాగి, ఇత్తడి, షీట్‌మెటల్‌పైన బంగారు పూతతో తయారు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు కళాకారులు తయారు చేస్తున్న స్వర్ణ ద్వారం గురించి సీఎం వాకబు చేశారు.
కోతుల ఆకలి తీర్చిన కేసీఆర్
యాదాద్రి పర్యటనలో కోతులను గమనించిన కేసీఆర్ కారు ఆపి మరీ వాటి ఆకలిని తీర్చారు. పున్నమి గెస్ట్ హౌజ్‌లో భోజనం అనంతరం గిరిప్రదర్శన రోడ్డు పరిశీలనకు వాహనంలో వెళ్లారు. రోడ్డుపక్కన వానర సమూహాన్ని గుర్తించిన కేసీఆర్ తన కాన్వాయ్‌ను ఆపి కారులోంచి దిగారు. తన వెంట కారులో ఉన్న అరటిపండ్లను తీసుకుని కోతులకు స్వయంగా అందించారు. అరటి పండ్ల పంపిణీతో పెద్ద ఎత్తున కోతులు సీఎం వద్దకు చేరుకున్నాయి. కోతులతో ప్రమాదం అని సెక్యూరిటీ వారించినప్పటికీ ఏమీ కాదంటూ సీఎం స్వయంగా పండ్లను వాటికి అందజేశారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment