Dasari durgaprasad
-
పరంజ్యోతి రూపంలో దర్శనమిచ్చే..
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఓ అపురూప క్షేత్రం తంటికొండ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందీ ఆలయం. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ క్షేత్రంలో స్వామి వారి ఆవిర్భావం వెనుక పురాణ గా«థ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ కొండ మీద అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలంలో ఆ పుణ్య పురుషులంతా తమ తపశ్శక్తిని ఈ కొండపై ధార పోశారట. అనంతరం వారు ఇక్కడ అపూర్వమైన జ్ఞానాన్ని అందుకున్నారట. తర్వాత నేతాజీ కళా సమితి అనే నాటక సమాజం వారు ఈ కొండపై ఏకాహాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఇక్కడ ఓ దివ్యమైన తేజస్సు సాకారమైందట. ఆ కాంతి పుంజాన్ని శ్రీనివాసుని స్వరూపంగా భక్తులు భావించి ఈ కొండపై ఆలయాన్ని నిర్మించారు. తంటికొండ గ్రామానికి దక్షిణ దిశలో సుమారు 200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం విలసిల్లుతోంది.1961 సంవత్సరంలో ఈ కొండపై స్వామివారి అర్చావతార మూర్తిని ప్రతిష్టించి అప్పటి నుంచి స్వామి వారిని సేవించుకుంటున్నారు. గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి వారు దర్శనమిస్తారు. స్థానక భంగిమలో ఉన్న స్వామి వారిని మాఘ శుద్ధ పంచమి నాడు ప్రతిష్టించారు. బద్దిరేద్ది శేషామణి అనే భక్తురాలికి స్వామి కలలో కనిపించి తాను పరంజ్యోతి రూపంలో సాకారమవుతానని చెప్పారట. అనంతరం నేతాజీనాటక సమితి నిర్వహించిన ఏకాహం తరువాత స్వామి జ్యోతిగా సాకారమిచ్చారట. అనంతరం మరో భక్తురాలికి తన అర్చావతార మూర్తుల గురించి వివరాలు చెప్పినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఏటా మాఘ మాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఓ విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతులను ఇచ్చే మహత్తర క్షేత్రమిది. ఎలా చేరుకోవాలి? ఈ ఆలయానికి చేరుకోవడానికి రాజ మహేన్ద్రవరం వరకు వచ్చి అక్కడ నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న గోకవరం చేరుకోవాలి. గోకవరం నుంచి ఏదైనా వాహనంలో ఆలయానికి చేరుకోవచ్చు . – దాసరి దుర్గా ప్రసాద్, పర్యాటక రంగ నిపుణులు -
రంగనాథ రాజగోపురం
అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్వార్గా గణుతికెక్కిన గోదాదేవి కొలువుతీరిన పుణ్యక్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు. తమిళనాడులోని మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఆండాళ్, కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే. సుప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణం నిత్యం గోదా, వటపత్రశాయి నామస్మరణలతో మారుమోగుతుంటుంది. దాదాపు 192 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయాన్ని తమిళనాడు ప్రభుత్వం తమ అధికార చిహ్నంగా ఉపయోగిస్తోంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో వల్లభ దేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులుచేర్పులు జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని ఏమాత్రం కోల్పోని ఆలయమిది. గోదాదేవి దొరికిన తులసీవనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు. సువిశాలమైన ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్, ఆండాళ్ పూజామంటపం ఉన్నాయి. ప్రధానాలయ లోపలి ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. అమ్మవారి ఆలయానికి ముందు మహినగ్, సుముఖన్, సేనై ఇముదల్వర్ల చిన్ని చిన్న మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసీవనంలో ఉన్న బావిలోనే అమ్మవారు తన ముఖారవిందాన్ని చూసుకునేదంటారు. ఇదే ప్రాంగణంలో ఊంజల్ మంటపం ఉంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తరభాగంలో గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో ఆలయంలో శ్రీకృష్ణపరమాత్మ వటపత్రశాయిగా దర్శనమిస్తారు. అద్భుత శిల్పకళా విన్యాసంతో అలరారుతున్న ఈ ఆలయ రాజగోపురం అల్లంత దూరం నుంచి దృశ్యమానమవుతుంది. ఈ గోపురంపై ఉన్న దేవతల శిల్పాలు అత్యద్భుతంగా ఉండి, భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఆలయం మదిని పులకింపజేసే మనోహర శిల్పాలకు వేదిక. ఆలయ బయటి ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయస్వామి మందిరాలున్నాయి. ప్రాకారపు గోడలపై అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, రతీమన్మథులు, తదితర శిల్పాలు నాటి అద్వితీయ శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలిచి, చూపరుల దృష్టిని ఆకట్టుకుంటాయి. వటపత్రశాయి ఆలయంలో నల్లరాతి శిల్పంపై శేషశయనుడైన స్వామి దర్శనమిస్తాడు. భక్తిభావాన్ని పెంచే స్వామిని దర్శించుకుని భక్తులు కైమోడ్పులర్పిస్తారు. అమ్మవారి ఆలయానికి ముందుభాగంలో ఉన్న శిల్ప సహిత స్తంభాలతో కూడిన మండపంలో భక్తులు సేదదీరుతారు. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం కలుగుతుందంటారు. ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరి రోజున అత్యంత వైభవంగా నిర్వహించే గోదా కల్యాణ మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్ర సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. - దాసరి దుర్గాప్రసాద్ -
కొండంత ఫలాన్నిచ్చే ... కొల్హాపూర్ మహాలక్ష్మి
సకల ఐశ్వర్య సంపదలతో, సర్వ సమ్మోహన ముగ్ధ మనోహర రూపంతో విలసిల్లుతున్న దేవతామూర్తి శ్రీ మహాలక్ష్మి. అందుకే ఆమెను ‘దాసీభూత సమస్త దేవవనితాం’ అన్నారు. మనకి శక్తిని, ఉత్సాహాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. ఆమె శక్తి అంశ. ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు. మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ మాసంలో ఆ దేవిని పూజిస్తే సకలైశ్వర్యాలతో పాటు కార్యజయం కూడా కలుగుతుందని దేవీపురాణం చెబుతోంది. అయితే శ్రీ మహాలక్ష్మికి మనదేశంలో ఆలయాలు అరుదుగా ఉన్నాయి. చాలావరకు ఆలయాలు శ్రీమన్నారాయణ స్వామితో కలిసి ఉంటాయి తప్ప ప్రత్యేకించి మహాలక్ష్మి ఆలయాలు తక్కువ. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో శ్రీమహాలక్ష్మి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ‘కొల్హాపూర్ మహాలక్ష్మి’ అని పిలుస్తారు. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. సతీదేవికి చెందిన నయనాలు ఈ క్షేత్రంలో పడి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విలసిల్లుతోందని ఐతిహ్యం. మనదేశంలో ఉన్న మహాలక్ష్మి ఆలయాలలో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం అగ్రగణ్యమైనది. అతి పురాతనమైన ఈ ఆలయం క్రీ.పూ. 4, 5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమై ఉండవచ్చని ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది. సూర్యగ్రహణం రోజున ఇక్కడ స్నానం చేస్తే... ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి. పూర్వకథ... అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట. శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్పూర్ అని కోల్గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది. శంకరులు దర్శించిన క్షేత్రం... శంకరాచార్యులవారు సైతం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారట. అనంతరకాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రానికున్న ధార్మిక విశిష్టతను గుర్తించి 13వ శతాబ్దంలో ఓ మఠం నిర్మించారు. ఈ క్షేత్రానికి అన్ని దిక్కులా పుణ్యతీర్థాలు ఉండటం విశేషం. సర్వసౌభ్యాగ్యాల నిలయం... ఈ ఆలయంలో అమ్మవారి దర్శనమాత్రం చేతనే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణమాసంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజుకో అలంకారంతో భక్తుల పూజలందుకునే అమ్మవారి ఆలయానికి దత్తాత్రేయుడు ప్రతిరోజూ మధ్యాహ్నం పూట భిక్షాటనకై వస్తారని ఐతిహ్యం. కొల్హాపూర్లో చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంతటి ఫలాలనిస్తుందని పెద్దలు చెబుతారు. ఇక్కడ అమ్మవారి ఆలయగుండంలో జ్యోతి ప్రజ్వలనం చేస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ దగ్ధమై శాంతిసౌఖ్యాలు లభిస్తాయని స్థలపురాణం చెబుతోంది. - దాసరి దుర్గాప్రసాద్ కొల్హాపూర్ మహాలక్ష్మిని పుష్పాలతో పూజిస్తే పువ్వుల్లాంటి పిల్లలు పుడతారట. అలాగే పసిపిల్లలను అమ్మవారి సమక్షంలో ఉంచితే ఆయా పిల్లల భవిష్యత్తు అమోఘంగా ఉంటుందట. వ్యాధులు, రోగాల బారిన పడిన వారు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి పాయసాన్ని సమర్పిస్తే రోగాలన్నీ మటుమాయవుతాయట. అవివాహితులు ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రపూజలు జరిపిస్తే వివాహయోగం కలిగి వారి భావిజీవితం నందనవనంలా ఉంటుందని భక్తుల విశ్వాసం.