పరంజ్యోతి రూపంలో దర్శనమిచ్చే.. | Dasari Durga Prasad Devotional Places Article | Sakshi
Sakshi News home page

సందర్శనీయం: తంటికొండ వేంకటేశ్వర స్వామి

Published Thu, Dec 10 2020 7:05 AM | Last Updated on Thu, Dec 10 2020 7:05 AM

Dasari Durga Prasad Devotional Places Article - Sakshi

శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఓ అపురూప క్షేత్రం తంటికొండ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందీ ఆలయం. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ క్షేత్రంలో స్వామి వారి ఆవిర్భావం వెనుక పురాణ గా«థ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ కొండ మీద అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలంలో ఆ పుణ్య పురుషులంతా తమ తపశ్శక్తిని ఈ కొండపై ధార పోశారట. అనంతరం వారు ఇక్కడ అపూర్వమైన జ్ఞానాన్ని అందుకున్నారట. తర్వాత నేతాజీ కళా సమితి అనే నాటక సమాజం వారు ఈ కొండపై ఏకాహాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఇక్కడ ఓ దివ్యమైన తేజస్సు సాకారమైందట. ఆ కాంతి పుంజాన్ని శ్రీనివాసుని స్వరూపంగా భక్తులు భావించి ఈ కొండపై ఆలయాన్ని నిర్మించారు. తంటికొండ గ్రామానికి దక్షిణ దిశలో సుమారు 200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం విలసిల్లుతోంది.1961 సంవత్సరంలో ఈ కొండపై స్వామివారి అర్చావతార మూర్తిని ప్రతిష్టించి అప్పటి నుంచి స్వామి వారిని సేవించుకుంటున్నారు.

గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి వారు దర్శనమిస్తారు. స్థానక భంగిమలో ఉన్న స్వామి వారిని మాఘ శుద్ధ పంచమి నాడు ప్రతిష్టించారు. బద్దిరేద్ది శేషామణి అనే భక్తురాలికి స్వామి కలలో కనిపించి తాను పరంజ్యోతి రూపంలో సాకారమవుతానని చెప్పారట. అనంతరం నేతాజీనాటక సమితి నిర్వహించిన ఏకాహం తరువాత స్వామి జ్యోతిగా సాకారమిచ్చారట. అనంతరం మరో భక్తురాలికి తన అర్చావతార మూర్తుల గురించి వివరాలు చెప్పినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఏటా మాఘ మాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఓ విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతులను ఇచ్చే మహత్తర క్షేత్రమిది.
ఎలా చేరుకోవాలి? ఈ ఆలయానికి చేరుకోవడానికి రాజ మహేన్ద్రవరం వరకు వచ్చి అక్కడ నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న గోకవరం చేరుకోవాలి. గోకవరం నుంచి ఏదైనా వాహనంలో ఆలయానికి చేరుకోవచ్చు .

– దాసరి దుర్గా ప్రసాద్,
పర్యాటక రంగ నిపుణులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement