కొండంత ఫలాన్నిచ్చే ... కొల్హాపూర్ మహాలక్ష్మి | Kolhapur Mahalakshmi templa | Sakshi
Sakshi News home page

కొండంత ఫలాన్నిచ్చే ... కొల్హాపూర్ మహాలక్ష్మి

Published Sun, Aug 25 2013 11:04 PM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

కొండంత ఫలాన్నిచ్చే ... కొల్హాపూర్ మహాలక్ష్మి

కొండంత ఫలాన్నిచ్చే ... కొల్హాపూర్ మహాలక్ష్మి

సకల ఐశ్వర్య సంపదలతో, సర్వ సమ్మోహన ముగ్ధ మనోహర రూపంతో విలసిల్లుతున్న దేవతామూర్తి శ్రీ మహాలక్ష్మి. అందుకే ఆమెను ‘దాసీభూత సమస్త దేవవనితాం’ అన్నారు.
 
 మనకి శక్తిని, ఉత్సాహాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. ఆమె శక్తి అంశ. ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు. మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ మాసంలో ఆ దేవిని పూజిస్తే సకలైశ్వర్యాలతో పాటు కార్యజయం కూడా కలుగుతుందని దేవీపురాణం చెబుతోంది. అయితే శ్రీ మహాలక్ష్మికి మనదేశంలో ఆలయాలు అరుదుగా ఉన్నాయి. చాలావరకు ఆలయాలు శ్రీమన్నారాయణ స్వామితో కలిసి ఉంటాయి తప్ప ప్రత్యేకించి మహాలక్ష్మి ఆలయాలు తక్కువ.
 
 మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శ్రీమహాలక్ష్మి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ‘కొల్హాపూర్ మహాలక్ష్మి’ అని పిలుస్తారు. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. సతీదేవికి చెందిన నయనాలు ఈ క్షేత్రంలో పడి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విలసిల్లుతోందని ఐతిహ్యం. మనదేశంలో ఉన్న మహాలక్ష్మి ఆలయాలలో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం అగ్రగణ్యమైనది. అతి పురాతనమైన ఈ ఆలయం క్రీ.పూ. 4, 5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమై ఉండవచ్చని ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది.
 
 సూర్యగ్రహణం రోజున ఇక్కడ స్నానం చేస్తే...


 ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి.
 
 పూర్వకథ...


 అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.
 
 శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది.
 
 శంకరులు దర్శించిన క్షేత్రం...


 శంకరాచార్యులవారు సైతం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారట. అనంతరకాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రానికున్న ధార్మిక విశిష్టతను గుర్తించి 13వ శతాబ్దంలో ఓ మఠం నిర్మించారు. ఈ క్షేత్రానికి అన్ని దిక్కులా పుణ్యతీర్థాలు ఉండటం విశేషం.
 
 సర్వసౌభ్యాగ్యాల నిలయం...


 ఈ ఆలయంలో అమ్మవారి దర్శనమాత్రం చేతనే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణమాసంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజుకో అలంకారంతో భక్తుల పూజలందుకునే అమ్మవారి ఆలయానికి దత్తాత్రేయుడు ప్రతిరోజూ మధ్యాహ్నం పూట భిక్షాటనకై వస్తారని ఐతిహ్యం. కొల్హాపూర్‌లో చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంతటి ఫలాలనిస్తుందని పెద్దలు చెబుతారు. ఇక్కడ అమ్మవారి ఆలయగుండంలో జ్యోతి ప్రజ్వలనం చేస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ దగ్ధమై శాంతిసౌఖ్యాలు లభిస్తాయని స్థలపురాణం చెబుతోంది.
                   
 - దాసరి దుర్గాప్రసాద్
 
 కొల్హాపూర్ మహాలక్ష్మిని పుష్పాలతో పూజిస్తే పువ్వుల్లాంటి పిల్లలు పుడతారట. అలాగే పసిపిల్లలను అమ్మవారి సమక్షంలో ఉంచితే ఆయా పిల్లల భవిష్యత్తు అమోఘంగా ఉంటుందట. వ్యాధులు, రోగాల బారిన పడిన వారు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి పాయసాన్ని సమర్పిస్తే రోగాలన్నీ మటుమాయవుతాయట. అవివాహితులు ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రపూజలు జరిపిస్తే వివాహయోగం కలిగి వారి భావిజీవితం నందనవనంలా ఉంటుందని భక్తుల విశ్వాసం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement