ఒకరోజు శివపార్వతులిద్దరూ కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉన్నారు. పార్వతీదేవి ఉన్నట్టుండి ‘‘ప్రకృతి– పురుషులలో ఎవరు అధికులు?’’ అని శివుణ్ణి అడిగింది. శుద్ధసత్త్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు సమాధానమిచ్చాడు. దాంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చూస్తుండగానే వాదన కాస్తా ముదురు పాకాన పడింది. అమ్మవారు ప్రకృతి గొప్పదనం ఏమిటో తెలియజేయాలనుకుని తన శక్తిని ఉపసంహరించి అంతర్ధానం అయింది. దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి.
సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుండటం చూసి తట్టుకోలేకపోయింది అమ్మ. దాంతో కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోటానుకోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని ఆనందస్వరూపుడు శివుడు భిక్షాపాత్ర తీసుకుని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతి నుండి అన్నం స్వీకరించాడు. సాక్షాత్తూ తన పతిదేవుడే తన వద్దకు భిక్షాపాత్ర పట్టుకుని రావడం చూసిన అమ్మవారు తనదే పై చేయి అని ముందు సంతోషించినప్పటికీ, తర్వాత భర్తనే భిక్షకుడిగా చూసినందుకు బాధపడుతుంది.
దాంతో పరమేశ్వరుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి, పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి పార్వతి చేయి పట్టుకుని మరల కైలాసానికి వెళ్ళిపోయాడు. శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తి హీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు, శివహీనుడు అని అనరు. శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం. కాబట్టి రెండూ సమపాళ్లలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం ఇది.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment