చెడును వదిలించాలి!
ఈనాడు సమాజాన్ని ఎంతో చెడు, అనేక రుగ్మతలు పీడిస్తున్నాయి. వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత సంఘ శ్రేయోభిలాషులందరిపైనా ఉంది. ముఖ్యంగా దైవవిశ్వాసులపై ఈ బాధ్యత మరింత అధికం. నైతిక, మానవీయ విలువలతో కూడిన సత్సమాజ నిర్మాణమే వీరి విధి.
ఈ విషయం పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఇలా ఉంది: ‘దైవ విశ్వాసులారా! ఇక నుంచి ప్రపంచ మాన వులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించ డానికి రంగంలోకి తీసుకువచ్చిన శ్రేష్ఠ సమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ప్రోత్సహి స్తారు, చెడు పనుల నుంచి వారిస్తారు’.(3-110)
అంటే, సమాజంలో చెడు ప్రబలకుండా చూడ టం, మంచిని పెంచడం దైవ విశ్వాసుల విధ్యుక్త ధర్మం. సమాజంలో దుర్మార్గాలు ప్రబలుతూ ఉంటే మిన్నకుండటం విశ్వాసుల లక్షణం కాదు. చెడులకు వ్యతిరేకంగా శక్తి మేర పోరాడాలి. దుర్మార్గాలు అంత మయ్యే వరకు పోరాటాన్ని ఆపకూడదు. అందరూ కలసి సంఘటిత ఉద్యమం ద్వారా వీటి నిర్మూలనకు కృషి చేయాలి. అదే సమయంలో మంచి పనుల వైపునకు ప్రజల్ని ప్రోత్సహించాలి. సత్కార్యాల వల్ల ఒనగూడే ప్రయోజనాలను, దుష్కా ర్యాల పర్యవసానాన్ని వివరించాలి. దైవం, పరలోకం, మరణానంతర జీవితం పట్ల విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంటే, అంతగా ఈ ప్రయ త్నం సఫలమవుతుంది. లోపభూయిష్టమైన విశ్వాసం సత్కార్యాల ఆచరణకు ఎంత మాత్రం ఉపకరించదు.
ఇహలోకంలో ఆచరించే ప్రతి కర్మకూ దైవం ఎదుట సమాధానం చెప్పుకోవలసి ఉందన్న విశ్వాసం మానవులను అన్నిరకాల చెడులు, దుర్మార్గాల నుంచి నిరోధిస్తుంది. ఎందుకంటే, ఇహలోక జీవితం శాశ్వ తం కాదు. ఏదో ఒకరోజు ఈ సృష్టి అంతమైపోతుంది. అందరూ ఇహలోకం వీడి వెళ్లిపోవలసిన వాళ్లే. ఇది శాశ్వత నివాసం ఎంతమాత్రం కాదు. చావు పుట్టుకల మధ్యనున్న ఈ జీవితం కేవలం ఒక పరీక్షాకాలం. ఈ కొద్దిపాటి జీవితాన్ని వినియోగించుకోవడం పైననే మానవుల సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి.
కనుక దైవం ఏ ఉద్దేశంతో మానవుడిని సృష్టిం చాడో, విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించి ఉత్తమ సముదాయంగా సమస్త మానవుల మార్గదర్శనం కోసం, వారి ఇహ, పర సాఫల్యాలకోసం ఉనికిలోకి తీసుకువచ్చాడో దాన్ని అర్థం చేసుకొని, స్వీయ సంస్క రణ, సమాజ సంస్కరణకు కృషిచేయాలి. అలా కాకుండా బాధ్యతారహితంగా, సమాజ శ్రేయస్సును గాలికొదిలేసి, ఇష్టానుసారం జీవితం గడిపితే ప్రపం చంలోనూ, పరలోకంలోనూ పరాభవం తప్పదు. కాబట్టి మంచిని పెంపొందిస్తూ, చెడులను నిర్మూలిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడపడమే అన్ని విధాలా శ్రేయస్కరం.
యండి.ఉస్మాన్ ఖాన్