బ్రహ్మచారులు, సాధువుల కన్నా సంసార జీవితాన్ని గడిపే వారికే కొన్ని దాన ధర్మాలు నిర్వర్తించే అవకాశ ముంది. వాళ్లను సాయం అడిగే వారుంటారు. అలాంటి వారికి సాయం చేసి పుణ్యం గడించే వీలు వీరికే ఎక్కువ. సంసారి తన దగ్గర ఉన్నవాటిని ఎవరెవరికి ఏది అవసరమో వాటిని నిండు మనసుతో ఇవ్వాలి. ఏ మేరకు ఇవ్వగలరో ఆ మేరకు ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వాటిలో ముఖ్యమైనది.
కడుపునిండా అన్నం పెట్టిన మనిషి ముఖాన్ని చూడండి. అతని ముఖంలో ఓ తృప్తీ, ఓ ఆనందం కనిపిస్తాయి. కానీ మిగిలిన దానాల విషయంలో ఈ తృప్తి అంతగా కనిపించదు. ఎవరైనా తినడానికి వస్తున్నారేమోనని చూసిన తర్వాత తినాలనేది భారతీయ సంప్రదాయం. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పెట్టక తానే తినడం, ఇతరు లకు తెలీకుండా దాచిపెట్టి తినడాన్ని పాపమనే భావనా ఉంది.
అందుకే అంటారు, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా దానం చేయడం ముఖ్యం. అందులోనూ ‘అన్నదానా’న్ని మించింది మరొకటి లేదు. ఓ ధనవంతుడు ఎన్నో పూజలు చేసి, భగవంతుడిని ఆరాధించి ఇక తానెవరికీ ఏదీ చెయ్యవలసిన అవసరం లేదని నిర్ణయించుకుని తన దగ్గరున్నది ఎవరికీ ఇవ్వక, ఎవరికీ పిడికెడు అన్నం కూడా పెట్టక ‘తానూ, తన కుటుంబం’ అనుకొని బతికాడు.
తీరా ఆయన మరణిం చాక రాక్షసుడిగా మారి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే శవాలను పీక్కుతింటూ తన తప్పు తాను తెలుసుకుని తనను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు. దీంతో రాక్షస రూపం పోయి సద్గతి పొందినట్లు ఓ కథ ఉంది. ఇటువంటి కథల నుంచి గ్రహించాల్సిన నీతి ఒక్కటే: తాను తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment