story books
-
చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!
నెల నెలా వచ్చే చందమామ లేదు. బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు లేవు. ఇంట్లో కథలు వినిపించే వారు లేరు. స్కూళ్లలో బుక్ రీడింగ్ అవర్ కనిపించడం లేదు. పిల్లల ఊహను పెంచి ఆలోచనను పంచే బాలసాహిత్యం వారికి అందకపోతే బూస్టు, హార్లిక్సు, ఆర్గానిక్ ఆహారం ఇవి ఏమిచ్చినా ఉపయోగం లేదు. శరీరం ఎదిగే ఆహారంతోపాటు బుద్ధి వికసించే ఆహారం ఇవ్వాలి. అది కథల్లో దొరుకుతుంది. కనీసం డిజిటల్ మీడియాలోని కథలైనా వారికి చేరువ చేయాలి.ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వీటిని ‘ప్రశ్నాపంచకం’ అంటారు. ఏ మనిషి జిజ్ఞాస అయిన అడుగంటి΄ోకుండా ఉండాలంటే ఈ ఐదు ప్రశ్నల్ని సజీవంగా ఉంచుకోవాలి. పిల్లలు అనుక్షణం ఈ పంచ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. గతంలో ప్రశ్నలు అడిగే పిల్లలను తెలివైన వారుగా భావించి మెచ్చుకునేవారు. నేడు ప్రశ్నిస్తే విసుక్కుంటున్నారు. కథ చెప్పమంటే తీరిక లేదంటున్నారు. మారాం చేస్తే సెల్ చేతికిస్తున్నారు. మరీ గొడవ చేస్తే సినిమాకు పంపిస్తున్నారు. కాని వారి చేత కథ చదివించడం లేదు. దాని వల్ల పిల్లల్లో ప్రశ్నించే కుతూహలం చచ్చి΄ోతుంది. కుతూహలం లేని బాలబాలికలు బాధ్యతాయుతులైన పౌరులుగా వికసించలేరు. కనుక ఇది అంతిమంగా సమాజానికే నష్టం.అసలు మన సమాజంలో పిల్లలను గౌరవించడం ఉందా? వారి ఎదుగుదల గురించి చింత ఉందా?వారికి ఎలాంటి జ్ఞానం అందుతోందన్న ఆలోచన ఉందా? ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, ప్రశ్నించడం, జవాబులు వెదుక్కోవడం, సమాధానాలు సృష్టించుకోవడం ఇవన్నీ పిల్లలు నిరంతరం చేయాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం ఎంత చిన్నవయసులో అలవడితే అంత త్వరగా వాళ్ళు స్వతంత్రులవుతారు. అయితే మన దగ్గర బాలసాహిత్యంగా చలామణి అయ్యేది పూర్తిగా బాల సాహిత్యం కాదు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా శాస్త్రీయంగా ఫలానా వయసు వారు ఫలానా స్థాయి పుస్తకాలు చదవాలని వాటిని రాసి, ప్రచురించరు. ఉన్నవల్లా ఏవో కొన్ని కథలే. అయితే అవన్నా వారు చదవకుండా బాలల పత్రికలన్నీ మూతపడటం విషాదం. ఇళ్లల్లో పెద్దలు కథలు వినిపించే ఆనవాయితీ ΄ోవడం మరో విషాదం. అందుకే కనీసం పిల్లలు అలవాటు పడ్డ సెల్‌ఫోన్ ద్వారా అయినా వారికి కథలు అలవాటు చేయాలి. ఇంటర్నెట్లో పిల్లల కోసం సైట్లు, యాప్‌లు, యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా పిల్లల కోసం నిర్వహించేవి, పిల్లలకే ప్రధాన భూమికను పోషించేవిగా ఉన్నాయి. వాటిలో https://manchipustakam.inని చూడటం పిల్లలకు అలవాటు చేయాలి. ఇక్కడ మంచి బాలల పుస్తకాలు ఉంటాయి. అలాగే ttps://storyweaver.org.in/పిల్లల ఉచిత ఆన్లైన్ పుస్తకాలతోపాటు రాయడం, చదవడం, అనువదించడం పట్ల ఆసక్తి వున్న వారికి సహకరించే వేదిక. యూట్యూబ్‌లో పిల్లల కథల వీడియోలు చాలానే వున్నాయి. Geethanjali Kids&Telugu అనే యూట్యూబ్ చానల్లో 375 వీడియోలు వున్నాయి. MintuTelugu Rhymes అనే యూట్యూబ్ చానల్లో 178 కథల వీడియోలు దొరుకుతాయి. ‘పిల్లల కంటెంట్’ అనే ప్రత్యేకమైన ఆప్షన్ కూడా యూట్యూబ్ లో వుంది. పిల్లలు తమ తమ ఊహలకు కొంత సాంకేతికతను జోడిస్తే అద్భుతమైన కథల వీడియోలతో వారే ఒక చానెల్ నిర్వహించవచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా అందుబాటులోకి రావడంతో రకరకాల యానిమేషన్ థీమ్స్‌తో కథలను క్రియేట్ చేసేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి వీడియోలు యూట్యూబ్‌లో చాలానే వున్నాయి. వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో తెలిపే ట్యుటోరియల్స్ కూడా వున్నాయి. ఎవరు ఏ అంశంపై వీడియోలు చేయాలన్నా, వినాలన్నా, నేర్చుకోవాలన్నాం. యూట్యూబ్‌లోని సెర్చ్ ఆప్షన్ ద్వారా వాటిని పొందవచ్చు. పల్లెలకు చేరుతున్న కథలుసెల్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయ్యాక నేను బాలల కథల వ్యాప్తికి దానినే సాధనంగా మలచుకున్నాను. మొదట అడుగు పెట్టింది ఫేస్బుక్లో. ఆ తరువాత వాట్సప్, ప్రతి లిపి, కహానియా.కాం, టెలిగ్రాం, ఇన్స్టాగ్రాం, డైలీహంట్, షేర్ చాట్, కూ, బ్లూపాడ్, స్టోరీ మిర్రర్.. ఇలా ప్రతిదానిలో బాలసాహిత్యాన్ని వాటి నిబంధనల మేరకు పోస్ట్ చేస్తుంటాను. ఈ మధ్య కోరాలో కొత్తగా అడుగుపెట్టాను. అంతేగాక కథలు, గేయాలు, బొమ్మలతో సామెతలు, పొడుపు కథలు సింగల్ పేజీలుగా మార్చి అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా తయారు చేస్తుంటాను. వీటిని ఆర్కైవ్స్‌లో కూడా అప్లోడ్ చేశాను. కథలు రాయడం ఎంత ముఖ్యమో వాటిని పాఠకులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. అందుకే రోజూ కొంత సమయం వీటికోసం కేటాయిస్తా. మారుతున్న కాలానికి తగినట్లుగా మనమూ మారక తప్పదు. నిజానికి సామాజిక మాధ్యమాల వల్లనే కొత్త పాఠకులు విపరీతంగా పెరిగారు. నగరాలను దాటి పల్లెలకు కూడా సాహిత్యాన్ని చేర్చగలుగుతున్నా. పుస్తకాల అమ్మకాలు కూడా వీటివల్ల విపరీతంగా పెరిగాయి. అడిగి మరీ కొంటున్నారు. ‘హరి కథలు కర్నూల్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి కథలను అక్కడ స్వయంగా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవి కాకుండా ‘వంద రోజులు – వంద కథలు’ వాట్సాప్ గ్రూప్‌లో కథలు పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఇందులో 38 వేల మంది సభ్యులు ఉన్నారు. – డా. ఎం.హరికిషన్, బాలల రచయిత (చదవండి: బాలల దినోత్సవం స్పెషల్: నెహ్రూ హైదరాబాద్‌లో ఎక్కడ అల్పాహారం తినేవారో తెలుసా..!) -
పిల్లల్ని ప్రేమించేవారు.. కథలనూ ప్రేమిస్తారు
బాల్యంలో తమకు ఇష్టమైనవి తమ పిల్లలకు దక్కాలనుకుంటారు తల్లిదండ్రులు. నటి ఆలియా భట్ తన తాతగారి నుంచి చాలా కథలు వినేది. కుమార్తె పుట్టాక ఆ పాపకు కథలు చెప్పాలనిపించింది. తన పాపకే ఏమిటి అందరు పిల్లలకూ కథలు చెప్తానని ఏకంగా కథల పుస్తకం రాసింది. ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ దాని పేరు. సాహస బాలిక తన శునకంతో ఎన్ని అద్భుతాలు చేసిందనేదే కథ. పిల్లలకు అవసరమైన కథా ప్రపంచం గురించి ఆలియా మాటలు.....‘ఒకమ్మాయికి ప్రకృతితో మాట్లాడే శక్తి వస్తే? చెట్లతో పుట్లతో పిట్టలతో జంతువులతో మాట్లాడే శక్తీ వాటి మాటలను అర్థం చేసుకునే శక్తి వస్తే? వాటి సమస్యలు తెలుసుకొని భూమిని, పర్యావరణాన్ని కాపాడాలని అనుకుంటే ఎంత బాగుంటుంది. అదే నా తొలి పుస్తకం కథ’ అని చెప్పింది నటి ఆలియా భట్. ఆమె రాసిన మొదటి పుస్తకం ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’... పెంగ్విన్ సంస్థ ఉప విభాగం పఫిన్ ద్వారా మార్కెట్లో విడుదలైంది. బాలీవుడ్లో సూపర్‌స్టార్ అయిన ఆలియా భట్ తనకు కూతురు పుట్టాక ఈ పుస్తకాన్ని విడుదల చేయడం వల్ల పిల్లల పుస్తకాల అవసరం, వాటి ఉద్దేశ్యం గురించి నేడు మళ్లీ బాలల సాహిత్య ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.కరుణ, పర్యావరణ ప్రేమ‘పిల్లల పుస్తకాలు పిల్లల్లో కరుణని పెంచాలి. పర్యావరణ స్పృహను కలిగించాలి. పిల్లలకు తన ఇంటి బయట ఉండే ప్రకృతి పరిసరాలు, దూరాన కొండల్లో ఉండే పక్షులు, పులులు, ఏనుగులు... ఇవి ఎంతో ఇష్టం. వాటిని పాత్రలుగా చేసుకుని కథలు చెప్తే వారు వింటారు’ అంటుంది ఆలియా. వివేక్ కామత్, తన సోదరి షబ్నమ్ మిన్వాలాల సహాయంతో ఆలియా ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ పుస్తకం రాసింది. ఇందులో చిన్నారి అమ్మాయి పేరును ఆలియా అనే పెట్టింది. మరో ముఖ్యపాత్రైన కుక్కపిల్లకు ‘ఎడ్’ అనే పేరు పెట్టింది. ఇది ఆలియాకు ఉన్న మూడు పిల్లుల్లో ఒకదాని పేరు ఎడ్వర్డ్ నుంచి తీసుకుంది. ‘ఎవరూ పట్టించుకోకుండా వదిలేయడంతో దిక్కుతోచక తిరుగుతున్న కుక్కపిల్లను ఆలియా అనే చిన్నారి చేరదీస్తుంది. వీరితోపాటు ఒక మాట్లాడే కాకి, మాట్లాడే కొబ్బరి చెట్టు ఈ కథలో పాత్రలుగా ఉంటాయి. మొదటి భాగంలో వీరంతా పరిచయం అవుతారు. తర్వాతి భాగాల్లో భూమి కాపాడే సాహసాలు ఉంటాయి. ఆలియా, ఎడ్లను ప్రధాన పాత్రలుగా చేసుకుని వరుసగా కథల పుస్తకాలు తెస్తాను. వీటిని యానిమేషన్ సిరీస్‌గా కూడా వెలువరిస్తాను. నా మొదటి పుస్తకం కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పేపర్ మీదే అచ్చయ్యింది’ అని తెలియచేసింది ఆలియా.పిల్లలకు కథలు అవసరం‘నా చిన్నప్పుడు మా తాత (తల్లి సోనీ రాజ్దాన్ తండ్రి నరేంద్రనాథ్ రాజ్దాన్) నాకు చాలా కథలు చెప్పేవారు. ముఖ్యంగా చున్ను, మున్ను, గున్ను అనే మూడు పాత్రలతో ఆయన చెప్పే కథలు నాకు భలే నచ్చేవి. ఆ మూడు పాత్రలు మనుషులో చీమలో ఎలుకలో కూడా తెలియదు. ఇక మా అక్క షాహీన్ పుస్తకాల పురుగు. నాకు కథలు చదివి వినిపించేది. మా అమ్మాయి రాహా పుట్టాక పిల్లల కథల గురించి మళ్లీ ఆలోచన వచ్చింది. ఇప్పుడు దానికి 19 నెలలు. రోజూ నేను దానికి నిద్రపోయే ముందు కనీసం మూడు కథల పుస్తకాలు చదివి వినిపిస్తాను. రకరకాల గొంతులతో పాత్రలను చదువుతాను. చాలా ఆసక్తిగా వింటుంది. తర్వాత ఆ పుస్తకాలను కౌగిలించుకుని నిద్రపోతుంది. నా పుస్తకంలోని కథ కూడా వినిపించాను. అయితే కథ కంటే కూడా దానికి పుస్తకంలోని బొమ్మలు బాగా నచ్చాయి’ అని నవ్వింది ఆలియా.పుస్తకాలు, బొమ్మలు‘పిల్లల పుస్తకాలే కాదు పిల్లల బొమ్మలు కూడా బోధనాత్మకంగా ఉండాలి. బొమ్మలు విజ్ఞానం పంచేలా ఉండాలి. అలాగే పర్యావరణహితంగా తయారవ్వాలి. ఇలాంటి పనులన్నింటిలో నేను నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను. నేను రచయితను కాను. స్టోరీటెల్లర్ని. మనందరం కథలు రాయలేకపోయినా చెప్పగలం. పిల్లలకు కథలు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలను కథల ప్రపంచానికి దూరం చేయవద్దు. వారికి ఆ ప్రపంచం చాలా ముఖ్యం’ అంటోంది ఆలియా. -
కథలు.. విజ్ఞాన సోపానాలు
కడప ఎడ్యుకేషన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. నాడు– నేడు ద్వారా వాటి రూపురేఖలు మార్చారు. విద్యార్థుల అభ్యున్నతికి అనుక్షణం కృషి చేస్తున్నారు. విద్యతోపాటు విజ్ఞానం, మానవీయత, సృజనాత్మకతను వెలికి తీసేందుకు తాజాగా విద్యార్థులకు కథల పుస్తకాలను కూడా అందిçస్తున్నారు.అందులోని కథలు మానవీయ విలువలు తెలియజేసేవిధంగా ఉన్నాయని విద్యావేత్తలు తెలిపారు. సృజనాత్మకతను పెంచేందుకు దోహదం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విజ్ఞానం, నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కథల పుస్తకాల కాన్సెప్ట్‌ను అమలులోకి తెచ్చింది. జగనన్న విద్యాకానుక ద్వారా ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అదనంగా ఈ కథల పుస్తకాలను అందజేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని భారతీయభాషల కేంద్రీయ సంస్థ(సీఐఐఎల్)తో ఒప్పందం కుదుర్చుకుని కథలతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ఆకర్షణీయమైన రంగులు, నాణ్యమైన మెటీరియల్‌తో ముద్రించిన 10 రకాల కథల పుస్తకాలను ఉమ్మడి వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా 2,762 పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సమగ్రశిక్ష అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. 2,493 ప్రాథమిక, 269 ప్రాథమికోన్నత పాఠశాలల పరిధిలో ఒక్కో పాఠశాలకు 10 కథల పుస్తకాలతో కూడిన సెట్‌ను అందించనున్నారు. చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా వేసవి సెలవుల్లో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు వీటిని అందచేసి చదివించేందుకు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగు, ఆంగ్లభాషలో ఒక్కో పుస్తకంలో ఒక్కో కథను ముద్రించారు. విద్యార్థులు తాము చదివిన కథలో ముఖ్యమైన అంశాలను పుస్తకంలోని చివరి పేజీలో ఇచ్చిన ఖాళీల్లో పూరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పుస్తకం ధర రూ. 50 ఉండగా ప్రతి పాఠశాలకు రూ. 5 వందల విలువైన 10 రకాల పుస్తకాలను వైఎస్సార్ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం ద్వారా పంపిణీ చేస్తున్నారు. నీతి నిజాయితీ, విలువలు, క్రమశిక్షణ, సక్రమమైన జీవనం వంటి అంశాలతో కూడిన కథలు ఉన్నాయి. వీటిని చదవడం ద్వారా విద్యార్థుల్లో సత్ప్రవర్తన, నైతిక విలువలు పెంపొందుతాయని విద్యావేత్తల అభిప్రాయం. ఆసక్తి రేకెత్తించే కథలు... 10 రకాల పుస్తకాలతో కూడిన సెట్లో ఉన్న కథల్ని పరిశీలిస్తే పావురం వివేకం, తెలివైన చేప, తొందరపాటు పనికిరాదు, ఊసరవెల్లి అతి తెలివి, యుక్తితో పనులు సాధించవచ్చు. పిల్లిమెడలో గంట, చీమ– పావురం, తెలివైన జింక, పెద్దలమాట చద్దిమూట, మంచి స్నేహితులు వంటి కథలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 58 గ్రంథాలయాలకు కథల పుస్తకాలను అందజేశారు. ఈ వేసవి సెలవుల్లో లైబ్రరీల్లో నిర్వహించిన వేసవి శిబిరాల్లో పిల్లల చేత చదివించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 100 పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు. మిగతా వాటికి కూడా పంపిణీ చేరవస్తున్నారు. విద్యార్థులతో చదివించాలి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విధంగా విభిన్న అంశాలతో కూడిన కథలను పుస్తకాల్లో చేర్చాం. ప్రతి పాఠశాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న వీటిని విద్యార్థులతో ప్రతిరోజు చదివించాలి.అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.జిల్లా కేంద్రం నుంచి నేరుగా పాఠశాలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం పంపిణీ ప్రారంభించాం. – డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సమగ్రశిక్ష పథక అధికారి, వైఎస్సార్‌జిల్లా -
కరోనాపై పోరుకు పంచ సూత్రాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని జయించడానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, వ్యాయామం, ధ్యానం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత అనే పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనగలమన్నారు. శనివారం వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో ‘కొత్త (కరోనా) కథలు’పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాలు, నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితల కథలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. కరోనా కొత్త కథల్లో భాగస్వాములైన రచయితలందరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు. మిద్దెతోట.. ఓ చక్కని ఆలోచన మిద్దెతోట ఓ చక్కని ఆలోచనని, దీని వల్ల ఖర్చులు తగ్గుతాయని, మనకు మంచి సహజ పోషకాహారం లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచించిన మిద్దెతోట పుస్తకం ఆంగ్ల అనువాదం ‘టెర్రస్ గార్డెన్’ను శనివారం ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు బయట, మిద్దెల మీద కూరగాయలు పెంచే ఆలోచనపై దృష్టి పెట్టాలని సూచించారు. మన రోజువారీ కార్యక్రమాల్లో ఇదో భాగం కావాలని, దీనివల్ల మనకు నచ్చిన కూరగాయలు పండించుకుని తినే అవకాశం ఉంటుందన్నారు. ఈ పుస్తకాన్ని రాసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డిని, అంగ్లంలోకి అనువదించిన కోడూరు సీతారామ ప్రసాద్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. నేడు ‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన పల్లెకు పట్టాభిషేకం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించనున్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లోని అక్షర ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పుస్తకానికి మాజీ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ముందుమాట రాశారు. -
సైన్స్ ఒకటే వాస్తవం
‘‘వైజ్ఞానిక కల్పనాసాహిత్యం అనే కంటే సైన్స్ ఫిక్షన్ అంటే తేలికగా అర్థం అవుతుందేమో! ప్రస్తుతం వున్న సైన్స్ ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో వూహాకల్పనా చేసి సృష్టించేదే సైన్స్ ఫిక్షన్. ఈ సైన్స్ ఫిక్షన్లో అనేక విధమైన ఉపశాఖలున్నాయి. పూర్తిగా సైన్స్ సూత్రాల మీద ఆధారపడి భవిష్యత్తులో జరగడానికి అవకాశం వున్నట్లు రాసేది సైన్స్ ఫిక్షన్ అయితే, కొన్ని జరగడానికి అవకాశం లేనివి, కల్పనలోనే సాధ్యమయ్యేవి అయితే ‘సైన్స్ ఫాంటసీ’ అనీ చెప్పుకోవచ్చు. ఎక్కువ క్లిష్టమైన సాంకేతిక వివరాలతో వున్నవి ‘హార్డ్‌కోర్ సైన్స్ ఫిక్షన్’ అనీ, సరళమైన వివరాలైతే ‘సాఫ్ట్‌కోర్’ అనీ అనొచ్చు. ఇదికాక భవిష్యత్తులో జరిగే గ్రహాంతర యుద్ధాలు, రోబోట్లు, కంప్యూటర్లు, కాలప్రయాణం ఇలాంటివన్నీ కూడా సైన్స్ ఫిక్షన్ కిందికే వస్తున్నాయి. మిలిటరీ సైన్స్ ఫిక్షన్, సైబర్ పంక్, సూపర్ హీరో, మెడికల్ థ్రిల్లర్స్, హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్, ఆల్టర్నేట్ హిస్టరీ, సమాంతర విశ్వాలు, ఇలా కొన్ని వూహాజనితమైనవీ, సైన్స్‌లో కొత్తగా వచ్చే సిద్ధాంతాల ఆధారంగా కూడా కథలు సృష్టించారు. ఇవి ఇంగ్లిష్‌లో అనేకం వున్నాయి. తెలుగులో ఇలాంటి సాహిత్యం సృష్టించాలనే ఆశయం నాది. అయితే సైన్స్ ఫిక్షన్లో అన్నీ అలాగే జరుగుతాయా అనేదానికి ఆధారం ప్రస్తుతం లేకపోవచ్చు. భూమి అంతా నాశనమైపోవడం, గ్రహాంతర కాలనీలు, ఎలియన్స్, రోబోట్స్, కాలప్రయాణం, అంతరిక్షం నుంచి వచ్చే ఇతర జీవులు భూమిని ఆక్రమించడం...ఇవన్నీ ఫాంటసీ పరిధిలోకే వస్తాయి. ఆధారం లేకుండా వున్నాయి కాబట్టే ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ అనే మాట మార్చి ‘స్పెక్యులేటివ్ ఫిక్షన్’ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు వున్న సైన్స్ సిద్ధాంతాలే కాక, ఇంకా రుజువు కాని ఇతర సిద్ధాంతాలపైన ఆధారితం అయినవి కూడా కాబట్టి, ఈ పేరు ఎక్కువ సముచితంగా వుంటుంది. నేను మెడికల్ థ్రిల్లర్స్ ఐసీసీయూ, బైబై పొలోనియా, ఎపిడమిక్ లాంటి వైద్యశాస్త్ర ఆధారిత థ్రిల్లర్స్, కుజుడి కోసం, నీలి ఆకుపచ్చ, భూమి నుంచి ప్లూటోదాకా స్పేస్ ఒపెరా, స్పేస్ ఫిక్షన్ నవలలు రాశాను. ఇవికాక, సైన్స్ ఫిక్షన్‌లోని ఈ పై చెప్పిన జోనర్స్ అన్నిటిలోనూ కథలు రాయాలనే ఆసక్తితో ఈ కథలు రాయడం జరిగింది. నాకు లెఫ్టిస్ట్ లేక రైటిస్ట్ లేక మతవాదం ఏదీ ఇష్టం లేదు. మానవతావాదమే ఇష్టం. నా వుద్దేశంలో సైన్స్ ఒకటే వాస్తవం. ఆ సైన్స్ వెర్రితలలు వేస్తే మానవత్వం దెబ్బతినకూడదు, అన్యాయం గెలవకూడదు. ఈ కథలన్నిటినీ అదే వుద్దేశంతో రాశాను. జెడ్ సైన్స్ ఫిక్షన్– మరికొన్ని కథలు రచన: డాక్టర్ చిత్తర్వు మధు; పేజీలు: 264; వెల: 150; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు ఫోన్: 8096310140 -
చీకట్లో చిత్రం
కథను మనం నెరేటర్ గొంతులో వింటాం. సంభాషణ శైలిలో చెబుతూవుంటాడు. ఈ గుడ్డాయన కథకుడి ఇంటికి వస్తున్నట్టు తెలియడంతో కథ మొదలవుతుంది. వచ్చి ఒక రాత్రి ఉండి వెళ్లాలనేది ప్లాను. ఆ అంధుడు కథకుడి భార్యకు పాత స్నేహితుడు. ఆయన భార్య చనిపోయింది. భార్య బంధువుల ఇంటికి వెళ్తూ, అక్కడి నుంచి ఫోన్ చేశాడు. అతడు ట్రెయిన్లో రావాలి. కథకుడి భార్య పికప్ చేసుకోవాలి. ఐదు గంటల ప్రయాణం. పదేళ్ల క్రితం సియాటిల్‌లో ఒక వేసవి కాలం ఆమె అతడి కోసం పనిచేసింది. ఇన్నేళ్లలో వాళ్లు మళ్లీ కలుసుకోలేదు. కానీ ఇరువురూ తమ సంగతులు చేరవేసుకుంటూనే ఉన్నారు. అతడు వస్తున్నాడంటే కథకుడికేమీ ఉత్సాహంగా లేదు. ఆ గుడ్డితనం ఇబ్బంది పెడుతోంది. సినిమాల్లో గుడ్డివాళ్లు ఎలా ఉంటారు? నెమ్మదిగా నడుస్తారు, ఎప్పుడూ నవ్వరు. ఒక వేసవిలో వార్తా పత్రికలో ‘హెల్ప్ వాంటెడ్’ అన్న ప్రకటన ‘ఈమె’ చూసింది. ఇచ్చింది ఈ అంధుడే. అప్పుడామెకు అర్జెంటుగా ఏదో ఒక జాబ్ కావాలి. వెళ్లగానే పనిలోకి తీసుకున్నాడు. అతడికి ఏవి అవసరమో అవి చదివిపెట్టడం ఆ పని. కేస్ స్టడీలు, రిపోర్టుల లాంటివి. సోషల్ సర్వీస్ డిపార్ట్మెంటులో అతడి ఆఫీసు. అట్లా స్నేహితులయ్యారు. పని మానేసే చివరి రోజున ఆ అంధుడు ఆమెను ముఖం తాకవచ్చా అని అడిగాడు. ముఖం, ముక్కు అంతా వేళ్లతో తడిమి చూశాడనీ భార్య ఓసారి చెప్పినప్పుడు కథకుడు ఇబ్బంది పడతాడు. అట్లా వేళ్లు కదలాడిన అనుభవంతో ఆమె ఒక కవిత కూడా రాయడానికి ప్రయత్నిస్తుంది. అయితే నేనతణ్ని బౌలింగ్‌కు తీసుకెళ్తాను, అంటాడు కథకుడు. ఆ వ్యంగ్యం భార్యకు అర్థమవుతుంది. ఇద్దరూ వంటింట్లో ఉంటారప్పుడు. ఆమె ఆలుగడ్డలను గుండ్రంగా తరుగుతోంది. నీకే ఒక స్నేహితుడుండి, అతడు ఇంటికి వస్తే నేను అతణ్ని సౌకర్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తానంటుంది. కానీ నాకు గుడ్డి స్నేహితులు ఎవరూ లేరంటాడతను. ఆయన భార్య చనిపోయింది, నీకు అర్థం కావట్లేదా? పాపం ఆయన భార్యను పోగొట్టుకున్నాడని ఆమె జాలి పడుతుంది. గుడ్డాయన భార్య పేరు బ్యూలా. నీగ్రోలా ధ్వనించే పేరు. ఈమె ఉద్యోగం మానేశాక బ్యూలా అక్కడ చేరింది. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లపాటు విడదీయలేనంత బాగా బతికారు. కానీ ఆమె క్యాన్సర్‌తో పోయింది. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆమె చేయిని ఇతడు పట్టుకుని వీడ్కోలు ఇవ్వడం కథకుడు ఊహించుకున్నాడు. ఎనిమిదేళ్లు ఒక ఇంట్లో ఉండి, కలిసి బతికి, ఆమె ముఖం ఎలావుంటుందో కూడా ఇతడికి తెలియకపోవడం అనేది కథకుడి అవగాహనలో లేని విషయం. ముందు అంధుడి పట్ల జాలిపడతాడు. కానీ ఆమెది కదా అసలైన బాధ! ప్రేమిస్తున్నవాడి కళ్లు ఎలా చూస్తాయో ఆమె ఎప్పుడూ అనుభవించలేదు. ఆమె ముఖంలో మార్పులు అతడు గమనించలేడు. ఈ రోజు ఇలా ఉన్నావని ప్రశంసించలేడు. తయారైనా, కాకపోయినా తేడా ఉండదు. సాయంత్రం కథకుడి భార్య రాబర్ట్‌ను, ఆ అంధుడి పేరు రాబర్ట్, స్వాగతించడానికి స్టేషన్‌కు వెళ్తుంది. వాళ్లు తిరిగి వచ్చేసరికి కథకుడు ఒక డ్రింకు కలుపుకొని, టీవీ చూస్తూవుంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తారు. అంటే కారు ఆగాక, ఈమె దిగి అతడి డోర్ తెరుస్తుంది. పెద్ద సూట్‌కేస్‌తో కిందికి దిగుతాడు రాబర్ట్. అతడికి పెద్ద గడ్డం ఉంది. ‘గుడ్డి మనిషికి గడ్డం’! ఇతడు టీవీ ఆపేసి తలుపు దగ్గరికి వెళ్తాడు. భార్య పరస్పరం ఇద్దరికీ పరిచయం చేస్తుంది. వెల్కమ్ అని మర్యాదకు అంటాడు. తర్వాత ఏం మాట్లాడాలో తోచదు. రాబర్ట్ మాత్రం మీ గురించి చాలా విన్నానంటాడు. కథకుడి భార్య ‘రాబర్ట్ ఇక్కడ కుర్చీ ఉంది, రాబర్ట్ నీ కుడి పక్కన’ అంటూ సూచనలు ఇస్తూ ఇంట్లోకి తోలుకొస్తుంది. ప్రయాణంలో హడ్సన్ నది అందం చూడాలంటే, న్యూయార్క్ వైపు వెళ్తున్నట్టయితే కుడివైపు కూర్చోవాలి; న్యూయార్క్ నుంచి వస్తుంటే ఎడమవైపు కూర్చోవాలి. ‘రైలు ప్రయాణం బాగా జరిగిందా, అవునూ వచ్చేప్పుడు కుడివైపు కూర్చున్నారా, ఎడమవైపా?’ అని ఇతడు అడుగుతాడు. అదేం ప్రశ్న అని అతడి భార్య అంటుంది. కుడివైపు కూర్చున్నానని రాబర్ట్ చెబుతాడు. నలబై ఏళ్లుగా తను రైలే ఎక్కలేదనీ, పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కలేదనీ చెబుతాడు. రాబర్ట్ నలబైల చివర్లో ఉన్నాడు. బరువు మోసి వంగిపోయినట్టుగా ఉన్న భుజాలు. లేత గోధుమరంగు చొక్కా, గోధుమరంగు బూట్లు. నల్ల కళ్లద్దాలు మాత్రం పెట్టుకోలేదు. చూడ్డానికి మామూలు కళ్లలాగే ఉన్నాయి. కానీ దగ్గరగా చూస్తే తేడా ఉంది. కనుగుడ్డులో తెలుపు ఎక్కువ. కంటిపాపలు నియంత్రణ లేకుండా కదులుతున్నాయి. ఒక డ్రింకు తీసుకొస్తానని ఇతడు చెప్పగానే, ‘సరే బాబు, నేను స్కాచ్ మనిషిని’ అన్నాడు రాబర్ట్. బాబు! రాబర్ట్ తన వేళ్లతో సూట్‌కేసును తడుముకున్నాడు. దాన్ని నేను పైన నీ గదిలో పెట్టనా? అంది కథకుడి భార్య. ఏం పర్లేదు, నేను పైకి వెళ్లినప్పుడు అదీ వస్తుంది అన్నాడు రాబర్ట్. స్కాచ్‌లో చాలా తక్కువ నీళ్లు పోయమన్నాడు రాబర్ట్. దానికి ఐరిష్ నటుడు బారీ ఫిట్జ్‌గెరాల్డ్ కొటేషన్ ఒకటి చెప్పాడు. నీళ్లు తాగాలనుకున్నప్పుడు నీళ్లు తాగుతా, విస్కీ తాగాలనుకున్నప్పుడు విస్కీ తాగుతా. కథకుడి భార్య నవ్వింది. రాబర్ట్ తన గడ్డాన్ని చేత్తో లేపుకుని మళ్లీ వదిలేశాడు. డ్రింక్సు తీసుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రాబర్ట్ తన ప్రయాణం గురించి చెప్పాడు. వదులుతున్న పొగను చూడలేరు కాబట్టి, గుడ్డివాళ్లు స్మోక్ చేయరని కథకుడు ఎక్కడో విన్నాడు. కానీ రాబర్ట్ హాయిగా సిగరెట్లు ఊదాడు. తర్వాత డిన్నర్ కోసం టేబుల్ దగ్గర చేరారు. టేబుల్ మీద ఉన్న ప్రతి పదార్థాన్నీ ఇద్దరూ ఆవురావురుమని ఆరగించారు. మాంసం, బీన్సు, బటర్ బ్రెడ్, ఆలుగడ్డలు. తన పళ్లెంలో ఏది ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకున్నాడు రాబర్ట్. కత్తి ఫోర్కులు అవసరమైనప్పుడు సరిగ్గా వాడాడు. ఇంక మళ్లీ రేపు లేదన్నట్టుగా తిని తేన్చి ఇద్దరూ టేబుల్ వదిలేసి, మళ్లీ లివింగ్ రూములోకి వచ్చారు. రాబర్ట్, కథకుడి భార్య సోఫాలో కూర్చున్నారు. కుర్చీలో కథకుడు ఉన్నాడు. పదేళ్లలో జరిగిన విశేషాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిద్ర ముంచుకొస్తుండగా, అన్ని జాగ్రత్తలూ చెప్పి కథకుడి భార్య పైన గదిలో పడుకోవడానికి వెళ్తుంది. వీళ్లిద్దరూ మాట్లాడుతూ టీవీ ఆన్ చేస్తారు. వాతావరణం, స్పోర్ట్స్ రౌండప్ లాంటి కార్యక్రమాలు ఏవో మారుతూ కెథెడ్రల్(పెద్ద చర్చి; బిషప్ నడిపేది) గురించి వస్తోంది. పోర్చుగల్‌లో ఉన్న కెథెడ్రల్స్కూ, ఇటలీ, ఫ్రాన్సుల్లో ఉన్నవాటికీ తేడా చెబుతూ, పోర్చుగల్‌లో ఉన్నవి నిర్మాణపరంగా అంత ఉన్నతమైనవి కావని దాని సారాంశం. ఈ సమయంలో కథకుడికి ఉన్నట్టుండి అనుమానం వస్తుంది. అసలు కెథెడ్రల్ అన్నప్పుడు, ఆ మాట అనగానే రాబర్ట్‌కు ఏం ఊహ కదలాడుతుంది? అదేంటో తెలుసా అసలు? ఎవరో చెబుతుంటే విన్నాను, వందల మంది దానికోసం శ్రమిస్తారు, కొన్ని తరాలు పనిచేస్తాయి, విషాదం ఏమిటంటే పూర్తయిన నిర్మాణం చూసుకునేదాకా ఎవరూ బతకరు, మనకూ వాళ్లకూ తేడా ఏం లేదు కదా? అని బదులిస్తాడు రాబర్ట్. టీవీలో ఇప్పుడు జర్మనీలోని కెథెడ్రల్ గురించి చెబుతున్నారు. బాబూ, నాకు ఇంతే తెలుసు, నువ్వు చెబితే వినాలనుందని అంటాడు రాబర్ట్. కానీ ఎలా వర్ణించడం? చాలా పొడుగ్గా ఉంటాయి, పొడుగ్గా పొడుగ్గా, ఆకాశం తాకేట్టుగా, కొన్నిసార్లు రాయితో, కొన్నిసార్లు పాలరాయితో కడతారు, దాన్ని ఎలా బొమ్మ కట్టించాలో అర్థం కాక, సిగ్గుపడతాడు కథకుడు. అయితే, ఇద్దరం కలిసి బొమ్మ గీద్దామని సూచిస్తాడు రాబర్ట్. పరుగెత్తికెళ్లి పెన్నుకోసం వెతుకుతాడు. భార్య గదిలో పెన్నులు దొరుకుతాయి. తర్వాత దళసరి కాగితం కావాలి. ఎలా? కిచెన్‌లో అడుగున ఉల్లిగడ్డ పొట్టు ఉన్న ఒక బ్యాగు కనబడుతుంది. దాన్ని సరిచేసి టేబుల్ మీద పెడతాడు. ఈ లోపు పై గది నుంచి వచ్చిన భార్యకు ఏమీ అర్థం కాక, ఏం చేస్తున్నారని అడుగుతుంది. కెథెడ్రల్ గీస్తున్నామని చెబుతాడు రాబర్ట్. రాబర్ట్ చేతులను పట్టుకుని కథకుడు బొమ్మ గీయించడానికి ప్రయత్నిస్తాడు. ఆర్చులు, తలుపులు, అక్కడక్కడా జనం... సరిగ్గా ఈ సమయంలో రాబర్ట్ ఒకసారి కళ్లు మూసుకొమ్మని కథకుడిని అడుగుతాడు. మూయాలి, తెరవొద్దు. కథకుడు మూసుకుంటాడు. ఇప్పుడు బొమ్మ గీద్దామంటాడు. రాబర్ట్ చేతులు కదిలిస్తూవుండగా కథకుడు చేతులు కదుపుతూవుం టాడు. గీయడం ఆగుతుంది. కథకుడు ఇంకా కళ్లు మూసుకునే ఉంటాడు. చూస్తున్నావా? అంటాడు రాబర్ట్. కథకుడు ఇంకా కళ్లు తెరవడు. ఇంట్లోనే ఉన్నప్పటికీ, ఎందులోనూ లేనట్టుగా అనిపిస్తుంది. అంధుల పట్ల ఒక సహానుభూతిని కలిగించే కథ ఇది. అలాగని నాటకీయ పరిణామాలు ఏమీవుండవు. కళ్లు లేకుండా బతకడం అంటే ఏమిటో నెరేటర్ సున్నితంగా అనుభవంలోకి తెచ్చుకోవడమే ఇందులోని విశేషం. కథ పేరు ‘కెథెడ్రల్’. 1981లో రాసింది. రచయిత రేమండ్ కార్వర్ (1938 – 1988). అమెరికన్. ప్రధానంగా కవి. ఊపిరితిత్తుల కేన్సర్‌తో యాభై ఏళ్లకే మరణించారు. కెథెడ్రల్ పేరుతో ఆయన కథాసంకలనం వచ్చింది. మరో కథా సంకలనం పేరు ‘వాట్ వి టాక్ ఎబౌట్ వెన్ వి టాక్ ఎబౌట్ లవ్’. ఈ కథాసారం: సాక్షి సాహిత్యం డెస్క్. -
అబద్ధం నిజం
కథాసారం పదిహేనేళ్ల క్రితం తాను ఇచ్చిన ఒక విందు గురించి ఆలోచిస్తున్నాడు ముసలి బ్యాంకర్. ఆ విందులో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. అంశం మరణశిక్ష మీదకు మళ్లింది. అతిథుల్లోని చాలామంది పండితులు, పాత్రికేయులు మరణశిక్షను నీతిబాహ్యమైనదిగా నిరసించారు. దానికి బదులుగా యావజ్జీవ కారాగారశిక్షను అమలు చేయాలన్నారు. ‘నేను మీతో ఏకీభవించను,’ అన్నాడు బ్యాంకర్. ‘నేను మరణశిక్షనుగానీ యావజ్జీవాన్నిగానీ అనుభవించనప్పటికీ, నా ఉద్దేశంలో మరణదండనే నీతివంతమైనదీ మానవీయమైనదీ కూడా. అది ఒకేసారి చంపేస్తుంది, యావజ్జీవం దశలవారీగా ప్రాణం తీస్తుంది. ఏది మానవీయం?’ ‘రెండూ సమానంగా నీతిబాహ్యమైనవే’ అన్నాడు ఒక అతిథి. ‘వాటి లక్ష్యం ఒకటే, ప్రాణాన్ని తీయడం. ప్రభుత్వమేమీ దేవుడు కాదు, అది ఇవ్వలేని జీవితాన్ని తీసుకునే హక్కు దానికి లేదు’. అతిథుల్లో ఒక పాతికేళ్ల న్యాయవాది కూడా ఉన్నాడు. అతడి స్పందన ఏమిటా అని అడిగినప్పుడు, ‘రెండూ కూడా సమానంగా అధర్మమైనవే. కానీ అవకాశం ఉంటే గనుక నేను యావజ్జీవాన్నే ఎంచుకుంటాను. చనిపోవడం కన్నా ఏదో విధంగా బతికివుండటం నయం కదా’ అన్నాడు. బ్యాంకర్‌కు అసహనం పెరిగింది. టేబుల్ మీద గుద్దుతూ, ‘అది అబద్ధం. ఐదేళ్లు కూడా నువ్వు జైల్లో ఉండలేవని ఇరవై లక్షల పందెం’ అన్నాడు. ‘మీరు సీరియస్‌గానే అంటున్నారంటే, ఐదు కాదు పదిహేనేళ్లుంటాను’ బదులిచ్చాడు లాయర్. ‘పదిహేనా! సరే!’ అరిచాడు బ్యాంకర్. ‘నా పందెం ఇరవై లక్షలు’. ‘ఒప్పుకుంటున్నా. మీ పందెం ఇరవై లక్షలు, నా పందెం నా స్వతంత్రం’. అట్లా ఈ అర్థం లేని పందెం అమలులోకొచ్చింది. భోజనం సమయంలో న్యాయవాదితో, ‘ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నాకు ఇరవై లక్షలతో పోయిందేమీ లేదు, నువ్వు అనవసరంగా నీ జీవితంలోని విలువైన నాలుగైదేళ్లను కోల్పోతావు’ అని హెచ్చరించాడు. ‘మూడు నాలుగు అని ఎందుకంటున్నానంటే నువ్వు అంతకంటే ఎక్కువకాలం ఉండలేవు. తప్పనిసరైతే సరే, కానీ ఐచ్ఛిక శిక్షను భరించలేవు. ఎప్పుడంటే అప్పుడే స్వేచ్ఛను పొందగలనన్న స్పృహ నీ ఖైదుకాలాన్ని విషతుల్యం చేస్తుంది’. అప్పటి పందెం గురించి బ్యాంకర్ తలపోస్తూ ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ‘ఆ పందెం నేను ఎందుకు కాసినట్టు? దానివల్ల జరిగే మేలేమిటి? ఆ లాయర్ తన జీవితంలో పదిహేనేళ్లు కోల్పోతాడు, నేను నా ఇరవై లక్షలు తగలేస్తాను. దీనివల్ల యావజ్జీవం మరణదండనకన్నా మెరుగనో, హీనమనో ఏమైనా తేలుతుందా? డబ్బు కొవ్వున్నవాడి చపలచిత్తం నాదైతే, డబ్బు మీది దురాశ ఆ లాయర్‌ది’. ఆ విందు తర్వాత న్యాయవాదిని బ్యాంకర్ పెరటింటిలో ఖైదు చేయాలని నిశ్చయించారు. అతడు తన ఖైదుకాలంలో గడప దాటి బయటకు రాకూడదు, మనుషులను చూడకూడదు, వారి గొంతు వినకూడదు, ఉత్తరాలు స్వీకరించకూడదు, వార్తాపత్రికలు తెప్పించుకోకూడదు. సంగీత వాద్యం ఉంచుకోవచ్చు, పుస్తకాలు చదవొచ్చు, లేఖలు రాయొచ్చు, మద్యం, పొగ తాగొచ్చు. వీటిల్లో ఏది కావాలన్నా ప్రత్యేకంగా నిర్మించిన గది కిటికీ గుండా చిన్న నోట్ పంపొచ్చు. అన్ని సూక్ష్మ వివరాలతో సహా ఒప్పందం రాయబడింది. నవంబర్ 14, 1870 పన్నెండు గంటల నుంచి నవంబర్ 14, 1885 పన్నెండింటిదాకా సరిగ్గా పదిహేనేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లోవుంటుంది. దీన్ని కనీసం రెండు నిమిషాల ముందు ఉల్లంఘించినా బ్యాంకర్ ఇరవై లక్షలు చెల్లించనక్కర్లేదు. అతడు పంపిన చిన్న నోట్సుల ఆధారంగా తెలిసింది ఏమంటే, మొదటి సంవత్సరపు ఖైదులో లాయర్ తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాడు. ఆ గదిలోంచి రాత్రీ పగలని లేకుండా పియానో శబ్దాలు వినబడేవి. అతడు మద్యాన్నీ పొగనూ నిరాకరించాడు. ‘మద్యం కోరికలను రగిలిస్తుంది. ఖైదీకి ముఖ్య శత్రువులు కోరికలు’ అని రాశాడు. గదిలోని వాతావరణాన్ని పాడు చేస్తుందని పొగ కూడా తాగలేదు. మలుపులున్న ప్రేమ, క్రైమ్, ఫాంటసీ, కామెడీ వంటి చౌకబారు పుస్తకాలను తెప్పించుకున్నాడు. రెండో ఏడాదిలో పియానో శబ్దాలు అసలు వినబడలేదు. క్లాసిక్ రచనలు మాత్రమే కోరుకున్నాడు. మళ్లీ ఐదో ఏడాదిలో ఆ గదిలోంచి సంగీతం వినబడింది. మద్యం కూడా కావాలని కోరాడు. ఆ సంవత్సరమంతా అతడు తినడం, తాగడం, తన మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. తరచూ ఆవలించేవాడు. తనలో తాను కోపంగా మాట్లాడుకునేవాడు. చాలాసేపు ఏదో రాసుకునేవాడు, దాన్ని మళ్లీ తెల్లారి మొత్తం చించేసేవాడు. చాలాసార్లు ఏడ్చేవాడు. ఆరో సంవత్సర ద్వితీయార్థంలో భాషాశాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర ఉత్సాహంగా చదివాడు. ఎంత ఆబగా చదివాడంటే అతడు కావాల్సిన పుస్తకాలను తెప్పించడానికి బ్యాంకర్‌కు సమయం చాలేది కాదు. నాలుగేళ్ల కాలంలో ఆరువందల ఉద్గ్రంథాలను కొనాల్సివచ్చింది. ఆ తీవ్రోత్సాహంలో ఉన్నప్పుడే లాయర్ నుంచి బ్యాంకర్‌కు ఓ లేఖ వచ్చింది. ‘నా ప్రియమైన జైలర్, నేను ఈ వాక్యాలను ఆరు భాషల్లో రాస్తున్నాను. వాటిని నిపుణులకు చూపించండి. అందులో గనక ఒక్క తప్పూ లేకపోతే దయచేసి పెరట్లో ఒకసారి తుపాకీని కాల్పించండి. ఆ శబ్దం వల్ల నా ప్రయత్నం విఫలం కాలేదని తెలుస్తుంది. భిన్న దేశాల్లోని భిన్న తరాల మేధావులు భిన్న భాషల్లో మాట్లాడినప్పటికీ వాళ్లందరిలోనూ వెలిగే జ్యోతి ఒక్కటే. వాళ్లందరినీ అర్థం చేసుకోగలిన నా పరమానందాన్ని ఏమని వర్ణించను!’ అతడి కోరిక నెరవేరింది. బ్యాంకర్ ఆదేశం మీద రెండుసార్లు పెరట్లో తుపాకీ పేలింది. పదో ఏడాది తర్వాత లాయర్ తన టేబుల్ మీద నిశ్చలంగా కూర్చుని న్యూ టెస్టమెంట్ చదివాడు. నాలుగేళ్లలో ఆరు వందల పాండిత్య గ్రంథాల్ని చదివినవాడు ఈ సన్నటి, తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని సుమారు ఏడాదికాలం చదవడం బ్యాంకర్‌ను ఆశ్చర్యగొలిపింది. తర్వాత లాయర్ మత చరిత్రలు, వేదాంతం కోరుకున్నాడు. చివరి రెండేళ్లు లెక్కాపత్రం లేకుండా చదివాడు. ప్రకృతి శాస్త్రాలు, బైరన్, షేక్స్పియర్, ఒకసారి రసాయన శాస్త్రం కోరేవాడు, మరోసారి వైద్యశాస్త్రం, నవల, తత్వశాస్త్రం మీద సిద్ధాంత గ్రంథం... సముద్ర ప్రయాణంలో ప్రమాదానికి గురైన నౌకలోనివాడు దొరికిన చెక్కనల్లా పట్టుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఒక్కో పుస్తకం చదివాడు. .... ఇక రేపు పన్నెండు గంటలైతే పందెం పూర్తవుతుంది. ‘నేను అతడికి ఇరవై లక్షలు చెల్లించాల్సి వుంటుంది’ అని గుర్తుచేసుకున్నాడు బ్యాంకర్. ‘చెల్లిస్తే గనక నేను దివాళా తీసినట్టే’. పదిహేనేళ్ల క్రితం బ్యాంకర్ దగ్గర లక్షలు మూలిగాయి. కానీ ఇప్పుడు ఆస్తులకంటే అప్పులు అధికం. స్టాకు మార్కెట్లతో ఆడిన జూదం, జాగ్రత్తపడలేనితనం అతన్ని నిండా ముంచాయి. అతడి పూర్వపు ఆత్మవిశ్వాసం పోయింది. ‘శాపం లాంటి పందెం’ అనుకున్నాడు. ‘అతడెందుకు చావలేదు? మహా అయితే అతడికి నలబై ఏళ్లు. నా చివరి రూపాయి కూడా తీసుకుని వెళ్లిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, జూదం ఆడతాడు. నేనేమో బిచ్చగాడిలా దీనంగా నిలబడితే అతడు ‘నేనేమైనా మీకు సాయం చేయగలనా’ అని అడుగుతాడు. ఇది నేను భరించలేను. దీన్ని తప్పించుకోవాలంటే అతడు చావడం ఒకటే మార్గం’. గడియారం మూడు కొట్టింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. నిశ్శబ్దంగా అతడు ఇనప్పెట్టెలోంచి ఆ పదిహేనేళ్ల పాటు తెరవని గది తాళంచెవి తీసుకున్నాడు. పెరడంతా చీకటిగావుంది. వర్షం కురుస్తోంది. వాచ్‌మన్ వానకు ఎక్కడో పడుకున్నట్టున్నాడు. పిలిస్తే బదులు రాలేదు. ‘నేను అనుకున్న పని ధైర్యంగా చేయగలిగితే అనుమానం వాచ్‌మన్ మీదికి పోతుంది’ అనుకున్నాడు. బందీ ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూశాడు. క్యాండిల్ వెలుగుతోంది. బందీ టేబుల్ ముందు కూర్చున్నాడు. కిటికీ మీద చిన్నగా తట్టాడు. బందీ కదలలేదు. బ్యాంకర్ జాగ్రత్తగా తాళం మీది సీల్ చించి, చెవితో తాళం తీశాడు. తుప్పు పట్టిన తాళం చప్పుడు చేస్తూ తెరుచుకుంది. లోపలినుంచి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఊహించాడు. కానీ పదిహేనేళ్ల బందీఖానా లాయర్‌ను కదలకుండా కూర్చోవడం నేర్పింది. బ్యాంకర్ లోపలికి పోదామని నిశ్చయించుకున్నాడు. ఒక అస్థిపంజరంలాంటి శరీరం కూర్చునివుంది. పొడవైన వెంట్రుకలు. అవీ తెల్లబడుతున్నాయి. పసుపు పచ్చటి ముఖం. నలబై ఏళ్లవాడంటే ఎవరూ నమ్మరు. టేబుల్ మీద ఏదో రాసిన కాగితం ఉంది. ‘లక్షలు వస్తాయని కలగంటున్నట్టున్నాడు, మంచం మీదకు తోసి దిండుతో అదిమానంటే ఈ సగంప్రాణి పూర్తిగా చస్తుంది’ అనుకున్నాడు బ్యాంకర్. ‘ముందైతే ఏం రాశాడో చదువుదాం’. ‘రేపు అర్ధరాత్రి పన్నెండుకు నా స్వతంత్రం నాకు వెనక్కి వస్తుంది. కానీ ఈ గదిని వదిలి, సూర్యుణ్ని చూడటానికి ముందు కొన్ని మాటలు పంచుకోవాలి. నా స్వతంత్రాన్నీ, నా జీవితాన్నీ, నా ఆరోగ్యాన్నీ, మీ పుస్తకాలు ప్రపంచ భాగ్యాలని వర్ణించేవన్నింటినీ నా ఆత్మసాక్షిగా అసహ్యించుకుంటున్నాను. ఎండమావి లాగా ప్రతిదీ శూన్యంగా, మి«థ్యగా కనబడుతోంది. అందం, తెలివితేటలు ఎన్నివున్నా మృత్యువు తప్పదు. మేధావుల అమరత్వం కూడా నశించిపోయేదే. మీరు తప్పుదోవలో పయనిస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా, వికారాన్ని అందంగా భావిస్తున్నారు. మీరు దేనికోసమైతే జీవిస్తున్నారో దాని పట్ల నాకున్న తిరస్కారాన్ని తెలియజేసేందుకు నేను ఒకప్పుడు స్వర్గసమానంగా భావించిన ఇరవై లక్షలను వదులుకుంటాను. సరిగ్గా రేపు ఐదు నిమిషాల ముందు గదిలోంచి వెళ్లిపోయి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాను’. చదవగానే బ్యాంకర్ అతడి తలను ముద్దాడి, ఏడుస్తూ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. జీవితంలో ఏనాడూ తన పట్ల తనకు ఇంత అసహ్యం కలగలేదు. తెల్లారి, ఆ మనిషి గది కిటికీ ఎక్కి వచ్చి, గేట్లోంచి అదృశ్యమయ్యాడని పరుగెత్తుతూ వచ్చి చెప్పాడు వాచ్‌మన్. బ్యాంకర్ ఆ విషయాన్ని ధృవపరుచుకుని, అనవసరమైన పుకార్లు రాకుండా, ఇరవై లక్షలపై తన హక్కును వదులుకుంటున్నట్టుగా లాయర్ రాసిన కాగితాన్ని ఇనప్పెట్టెలో భద్రపరిచాడు. (ఆంటన్ చెహోవ్ (1860–1904) రష్యన్ కథ ‘ద బెట్’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో చెహోవ్ ఒకరు.) -
సాదత్ హసన్ మంటో విభజన కథకుడు
కాలానికి తగినవాడు: మంటోకు అప్పుడు ఏడేళ్లు. ఒకరోజు ఊళ్లో అందరూ ఓ అంటూ ఏడుస్తున్నారు. చిన్నా పెద్దా ముసలీ ముతకా... అందరూ... ప్రతి ఒక్కరూ. ఇదేమిటి? పిల్లలు కదా ఏడుస్తారు. పెద్దలు కూడా ఏడుస్తారా? ఎందుకేడుస్తున్నారో మంటోకు అర్థం కాలేదు. తనూ ఏడవడం మొదలుపెట్టాడు. తల్లో తండ్రో మంటోను ఎత్తుకొని ఊళ్లో జరిగిన విషాదాన్ని చూడ్డానికి పరిగెత్తారు. ఎవరో చనిపోయారట. ఒకరు. ఇద్దరు. ముగ్గురు. నలుగురు. వెయ్యి మంది. కాదు ఎంత మందో తెలీదు. చనిపోయారు. కాదు బ్రిటిష్ వాళ్లు చంపేశారు. ఆ ఊరు అమృత్సర్. అది జలియన్ వాలాబాగ్ సంఘటన. మనిషి అసలు రూపాన్ని చూసినవాడు మంటో. ఆ వయసులో చూసి లోలోపల ఏమనుకున్నాడో ఏమో ఏదైనా చేయాలనుకున్నాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నాడు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌లో చేరాడు. ఆ వెంటనే కలం కూడా పట్టుకున్నాడు. ‘తమాషా’ అతడి మొదటి కథ. అందులో వేరేది ఏదీ రాయలేదు. చిన్నప్పుడు తాను చూసిన జలియన్ వాలాబాగ్ సంఘటనే ఆ కథ. ఆ తర్వాత అదే ఊపులో పుస్తకాల వెంట పడ్డాడు. ఫ్రెంచ్, రష్యన్ రచయితలు పరిచయమయ్యారు. వాళ్ల రచనలు చదివి, ఊగిపోయి, అరె... ఇవి జనానికి తెలియకపోతే ఎలా అని ఉర్దూలో స్వయంగా అనువాదం చేశాడు. విక్టర్ హ్యూగో, ఆస్కార్ వైల్డ్... మంటో ఇప్పుడు నలుగురికీ తెలుస్తున్నాడు. ఇరవై నాలుగేళ్లు వచ్చాయి. ఆ వెంటనే అతడి తొలి కథా సంపుటి - అతిష్ పరే (కయ్యానికి కాలు దువ్వే వాళ్లు). మంటో స్వభావం కూడా అలాగే ఉండేది. ఎవరి మీదైనా సరే తెగించి జోకులు పేల్చేవాడు. వాళ్లెంత... వీళ్లెంత. మజిలీ బొంబాయికి మారింది. సినిమాల్లో ఇలాంటి వాళ్లకు పని దొరకదా? హీరో అశోక్ కుమార్ క్లోజ్ అయ్యాడు. ఇంకా ఎంతో మంది యాక్టర్లు. సాహిత్యంలో సినిమాల్లో మంటో ఒక స్టార్. రోజులు గడుస్తున్నాయి. కథలూ కాకరకాయలూ.... అప్పుడు మరి స్వాతంత్య్రం వచ్చింది. దేశం విడిపోయింది. ఎటు వాళ్లు అటు వెళ్లిపోవాలి. భారతీయులు కాస్తా హిందూ- ముస్లింలు అయ్యారు. అన్నదమ్ములు కాస్తా పాకీస్తానీలు- ఇండియన్లు అయ్యారు. కొందరు బంధువులు అటు మిగిలారు. చావనీ. కొందరు అయినవాళ్లు ఇటు మిగిలారు. చావనీ. మంటో ఇదంతా చూసి- వెర్రెత్తినట్టు రోడ్ల వెంట నడిచాడు. అదే కథగా కూడా రాశాడు. దాని పేరు ‘దేఖ్ కబీరా రోయా’ (కవి కబీర్ ఏడ్చాడు). ఇరుమతాల ఉమ్మడి ప్రతీక అయిన కబీర్ ఈ విభజనను తట్టుకోలేక ఏడ్చాడని రాస్తాడు మంటో ఆ కథలో. కాని వాస్తవాన్ని అరాయించుకోక తప్పదు కదా. కాని రోజులు అంత స్మూత్‌గా కూడా లేవు. మనుషుల భావోద్వేగాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికి తెలుసు? బాంబే ఇండస్ట్రీలో కూడా హిందువులూ ముస్లింలూ అని విభజన. ఒకరి మీద మరొకరికి అనుమానం సందేహం కోపం ద్వేషం. మంటోకు పని దొరకడం కష్టమయ్యింది. పో... పాకిస్తాన్‌కు పో. నీ దేశం పో. లాహోర్‌కు చేరుకున్నాడు. అప్పుడప్పుడే కూడుకుంటున్న నగరం అది. మంటోలాంటి వాడికి ఏం పని చూపిస్తుంది? కాని ఊరికే ఉండే రకమా మంటో. ఇరువైపులా జరిగిన రక్తపాతం, హింసాకాండ, ముక్కలైన మనసులు, శిథిలమైన అనుబంధాలు, దివాలా తీసిన విలువలు, పెరిగిపోయిన కక్ష.... చూసింది చూసినట్టు వెరవకుండా రాశాడు. ‘థండా గోష్’ (చల్లబడ్డ మాంసం), ‘ఖోల్ దో’ (తెరు). మంటో కథలు పాఠకలోకంలో కలకలం రేపాయి. ఒక వర్గానికి చెందిన అమ్మాయి మరో వర్గం వారి చేత కొన్ని రోజుల పాటు అత్యాచారానికి గురవుతుంది. కొనప్రాణంలో ఆస్పత్రిలో చేరుస్తారు. డాక్టరు అడావిడిగా వచ్చి చూస్తాడు. లోపలంతా ఉక్కపోతగా ఉంటుంది. డాక్టర్ పేషెంట్‌ను చూస్తూ అటెండర్‌కు కిటికీ చూపిస్తూ ‘ఖోల్ దో’ (తెరు) అంటాడు. అప్పటి వరకూ స్పృహలో లేని ఆ అమ్మాయి అప్రయత్నంగా కదులుతుంది. డాక్టర్ దిగ్భ్రమగా చూస్తుంటాడు. ఆ అమ్మాయి అప్రయత్నంగా తన పైజామా బొందు తెరవడం మొదలుపెడుతుంది. అదీ కథ. ఈ కథలన్నీ పాఠకులని ఊపేశాయి. చాందసవాదులు కత్తి కట్టారు. ఈ కోర్టు ఆ కోర్టు అని చూడకుండా అన్ని కోర్టులూ తిప్పారు. ఈ తిరగడాలతో విసిగిపోయిన మంటో కోర్టు బోనులో నిలబడి ‘నా కథలు వికృతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. అవి వికృతంగా ఉన్నాయంటే సమాజం వికృతంగా ఉన్నట్టే. సమాజం నుంచే పుట్టినవి అవి’ అన్నాడు. అంతటితో మంటోని వదల్లేదు. పత్రికల్లో రాసుకొని బతుకుదామంటే ఎక్కడా ఏమీ రాయనీకుండా మేనేజ్మెంట్లే నిరుత్సాహ పరిచాయి. సత్యం పలికేవాడు సమాజ విరోధి. నీ దగ్గర నీ మాటా వాడి దగ్గర వాడి మాటా మాట్లాడి బతికేవాడు రచయిత అవుతాడా? సమాజం ఏది మెచ్చుతుందో అది రాసేవాడు రచయిత అవుతాడా? మంటో సంతోషంగా ఉండలేకపోయాడు.అతడి హృదయం బాంబేలో ఉంది. అతడికి లాహోర్‌లో పని లేకుండా ఉంది. క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. ఏ మాత్రం వీలు చిక్కినా ఒక కథ రాసి మెరిపిస్తూ ఉన్నాడు. అతడు రాసిన ‘తోబా టేక్ సింగ్’ కథ ఉర్దూ సాహిత్యంలో సర్వోన్నతమైన కథగా నిలిచింది. విభజన తర్వాత ఇరు దేశాల్లో ఉన్న ఖైదీలను ఇరు ప్రాంతాల వారు అటూ ఇటూ మార్చుకుందామనుకుంటారు. లాహోర్ జైలులో ఒక ఇండియన్ సిక్కు ఉంటాడు. అతణ్ణి మరి ఇండియాకు అప్పజెప్పాలి. కాని అతడు వెళ్లనంటాడే. ఎందుకంటే అతడి స్వగ్రామం ‘తోబా టేక్ సింగ్’ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఎంత బలవంతం చేసినా వినకుండా అతడు ఇరు ప్రాంతాల సరిహద్దు రేఖ వద్ద ప్రాణం విడుస్తాడు. ఈ కథలన్నీ ఇప్పుడు క్లాసిక్స్ అయ్యాయిగాని రాసిన కాలంలో అవి రాసి మంటో చెప్పలేనన్ని బాధలు పడ్డాడు. భార్యాబిడ్డలకు అన్నం పెట్టడానికి డబ్బుల్లేవు. మురికి బట్టలు. చివరకు ప్రమాణాల మీద ప్రమాణాలు చేసి కూడా బాత్రూమ్లో చాటుగా తాగే అగత్యం. ఒక గొప్ప రచయితను ఒక ఉపఖండం కాపాడుకోలేకపోయింది. ఒక మనిషిగా ఉండవలసినవాడు ఒక మతానికి ప్రతినిధి కావడం వల్ల ఒక ప్రాంతానికే పరిమితమయ్యి ముగిసిపోవాల్సి వచ్చింది. మంటో తన 42 ఏళ్ల వయసులో 1955లో మరణించాడు. ఇప్పుడతడు చిరంజీవి. ఎక్కడ ఏ విభజన ప్రస్తావన వచ్చినా ఇరుదేశాల సాహిత్యంలో మొదటగా వినిపించే పేరు మంటోనే. కాని ఏం లాభం? బతికి ఉండగా పొందలేనిది చనిపోయాక ఎంత వచ్చి ఏం లాభం? - సాక్షి సాహిత్యం (మంటో కథలు విస్తారంగా తెలుగులో అనువాదమయ్యాయి. విశాలాంధ్ర/ ప్రజాశక్తిలో ఆయన కథల పుస్తకాలు దొరుకుతాయి)