సాదత్ హసన్ మంటో విభజన కథకుడు
కాలానికి తగినవాడు: మంటోకు అప్పుడు ఏడేళ్లు. ఒకరోజు ఊళ్లో అందరూ ఓ అంటూ ఏడుస్తున్నారు. చిన్నా పెద్దా ముసలీ ముతకా... అందరూ... ప్రతి ఒక్కరూ. ఇదేమిటి? పిల్లలు కదా ఏడుస్తారు. పెద్దలు కూడా ఏడుస్తారా? ఎందుకేడుస్తున్నారో మంటోకు అర్థం కాలేదు. తనూ ఏడవడం మొదలుపెట్టాడు. తల్లో తండ్రో మంటోను ఎత్తుకొని ఊళ్లో జరిగిన విషాదాన్ని చూడ్డానికి పరిగెత్తారు. ఎవరో చనిపోయారట. ఒకరు. ఇద్దరు. ముగ్గురు. నలుగురు. వెయ్యి మంది. కాదు ఎంత మందో తెలీదు. చనిపోయారు. కాదు బ్రిటిష్ వాళ్లు చంపేశారు.
ఆ ఊరు అమృత్‌సర్. అది జలియన్ వాలాబాగ్ సంఘటన. మనిషి అసలు రూపాన్ని చూసినవాడు మంటో. ఆ వయసులో చూసి లోలోపల ఏమనుకున్నాడో ఏమో ఏదైనా చేయాలనుకున్నాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నాడు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌లో చేరాడు. ఆ వెంటనే కలం కూడా పట్టుకున్నాడు. ‘తమాషా’ అతడి మొదటి కథ. అందులో వేరేది ఏదీ రాయలేదు. చిన్నప్పుడు తాను చూసిన జలియన్ వాలాబాగ్ సంఘటనే ఆ కథ. ఆ తర్వాత అదే ఊపులో పుస్తకాల వెంట పడ్డాడు. ఫ్రెంచ్, రష్యన్ రచయితలు పరిచయమయ్యారు. వాళ్ల రచనలు చదివి, ఊగిపోయి, అరె... ఇవి జనానికి తెలియకపోతే ఎలా అని ఉర్దూలో స్వయంగా అనువాదం చేశాడు. విక్టర్ హ్యూగో, ఆస్కార్ వైల్డ్... మంటో ఇప్పుడు నలుగురికీ తెలుస్తున్నాడు. ఇరవై నాలుగేళ్లు వచ్చాయి. ఆ వెంటనే అతడి తొలి కథా సంపుటి - అతిష్ పరే (కయ్యానికి కాలు దువ్వే వాళ్లు).
మంటో స్వభావం కూడా అలాగే ఉండేది. ఎవరి మీదైనా సరే తెగించి జోకులు పేల్చేవాడు. వాళ్లెంత... వీళ్లెంత. మజిలీ బొంబాయికి మారింది. సినిమాల్లో ఇలాంటి వాళ్లకు పని దొరకదా? హీరో అశోక్ కుమార్ క్లోజ్ అయ్యాడు. ఇంకా ఎంతో మంది యాక్టర్లు. సాహిత్యంలో సినిమాల్లో మంటో ఒక స్టార్. రోజులు గడుస్తున్నాయి. కథలూ కాకరకాయలూ.... అప్పుడు మరి స్వాతంత్య్రం వచ్చింది. దేశం విడిపోయింది. ఎటు వాళ్లు అటు వెళ్లిపోవాలి. భారతీయులు కాస్తా హిందూ- ముస్లింలు అయ్యారు. అన్నదమ్ములు కాస్తా పాకీస్తానీలు- ఇండియన్‌లు అయ్యారు. కొందరు బంధువులు అటు మిగిలారు. చావనీ. కొందరు అయినవాళ్లు ఇటు మిగిలారు. చావనీ. మంటో ఇదంతా చూసి- వెర్రెత్తినట్టు రోడ్ల వెంట నడిచాడు. అదే కథగా కూడా రాశాడు. దాని పేరు ‘దేఖ్ కబీరా రోయా’ (కవి కబీర్ ఏడ్చాడు). ఇరుమతాల ఉమ్మడి ప్రతీక అయిన కబీర్ ఈ విభజనను తట్టుకోలేక ఏడ్చాడని రాస్తాడు మంటో ఆ కథలో. కాని వాస్తవాన్ని అరాయించుకోక తప్పదు కదా.
కాని రోజులు అంత స్మూత్‌గా కూడా లేవు.
మనుషుల భావోద్వేగాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికి తెలుసు? బాంబే ఇండస్ట్రీలో కూడా హిందువులూ ముస్లింలూ అని విభజన. ఒకరి మీద మరొకరికి అనుమానం సందేహం కోపం ద్వేషం. మంటోకు పని దొరకడం కష్టమయ్యింది. పో... పాకిస్తాన్‌కు పో. నీ దేశం పో. లాహోర్‌కు చేరుకున్నాడు. అప్పుడప్పుడే కూడుకుంటున్న నగరం అది. మంటోలాంటి వాడికి ఏం పని చూపిస్తుంది? కాని ఊరికే ఉండే రకమా మంటో. ఇరువైపులా జరిగిన రక్తపాతం, హింసాకాండ, ముక్కలైన మనసులు, శిథిలమైన అనుబంధాలు, దివాలా తీసిన విలువలు, పెరిగిపోయిన కక్ష.... చూసింది చూసినట్టు వెరవకుండా రాశాడు. ‘థండా గోష్’ (చల్లబడ్డ మాంసం), ‘ఖోల్ దో’ (తెరు). మంటో కథలు పాఠకలోకంలో కలకలం రేపాయి. ఒక వర్గానికి చెందిన అమ్మాయి మరో వర్గం వారి చేత కొన్ని రోజుల పాటు అత్యాచారానికి గురవుతుంది. కొనప్రాణంలో ఆస్పత్రిలో చేరుస్తారు. డాక్టరు అడావిడిగా వచ్చి చూస్తాడు. లోపలంతా ఉక్కపోతగా ఉంటుంది. డాక్టర్ పేషెంట్‌ను చూస్తూ అటెండర్‌కు కిటికీ చూపిస్తూ ‘ఖోల్ దో’ (తెరు) అంటాడు.
అప్పటి వరకూ స్పృహలో లేని ఆ అమ్మాయి అప్రయత్నంగా కదులుతుంది. డాక్టర్ దిగ్భ్రమగా చూస్తుంటాడు. ఆ అమ్మాయి అప్రయత్నంగా తన పైజామా బొందు తెరవడం మొదలుపెడుతుంది. అదీ కథ. ఈ కథలన్నీ పాఠకులని ఊపేశాయి. చాందసవాదులు కత్తి కట్టారు. ఈ కోర్టు ఆ కోర్టు అని చూడకుండా అన్ని కోర్టులూ తిప్పారు. ఈ తిరగడాలతో విసిగిపోయిన మంటో కోర్టు బోనులో నిలబడి ‘నా కథలు వికృతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. అవి వికృతంగా ఉన్నాయంటే సమాజం వికృతంగా ఉన్నట్టే. సమాజం నుంచే పుట్టినవి అవి’ అన్నాడు. అంతటితో మంటోని వదల్లేదు. పత్రికల్లో రాసుకొని బతుకుదామంటే ఎక్కడా ఏమీ రాయనీకుండా మేనేజ్‌మెంట్లే నిరుత్సాహ పరిచాయి. సత్యం పలికేవాడు సమాజ విరోధి. నీ దగ్గర నీ మాటా వాడి దగ్గర వాడి మాటా మాట్లాడి బతికేవాడు రచయిత అవుతాడా? సమాజం ఏది మెచ్చుతుందో అది రాసేవాడు రచయిత అవుతాడా?
మంటో సంతోషంగా ఉండలేకపోయాడు.అతడి హృదయం బాంబేలో ఉంది. అతడికి లాహోర్‌లో పని లేకుండా ఉంది. క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. ఏ మాత్రం వీలు చిక్కినా ఒక కథ రాసి మెరిపిస్తూ ఉన్నాడు. అతడు రాసిన ‘తోబా టేక్ సింగ్’ కథ ఉర్దూ సాహిత్యంలో సర్వోన్నతమైన కథగా నిలిచింది. విభజన తర్వాత ఇరు దేశాల్లో ఉన్న ఖైదీలను ఇరు ప్రాంతాల వారు అటూ ఇటూ మార్చుకుందామనుకుంటారు. లాహోర్ జైలులో ఒక ఇండియన్ సిక్కు ఉంటాడు. అతణ్ణి మరి ఇండియాకు అప్పజెప్పాలి. కాని అతడు వెళ్లనంటాడే. ఎందుకంటే అతడి స్వగ్రామం ‘తోబా టేక్ సింగ్’ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. ఎంత బలవంతం చేసినా వినకుండా అతడు ఇరు ప్రాంతాల సరిహద్దు రేఖ వద్ద ప్రాణం విడుస్తాడు. ఈ కథలన్నీ ఇప్పుడు క్లాసిక్స్ అయ్యాయిగాని రాసిన కాలంలో అవి రాసి మంటో చెప్పలేనన్ని బాధలు పడ్డాడు. భార్యాబిడ్డలకు అన్నం పెట్టడానికి డబ్బుల్లేవు. మురికి బట్టలు. చివరకు ప్రమాణాల మీద ప్రమాణాలు చేసి కూడా బాత్‌రూమ్‌లో చాటుగా తాగే అగత్యం. ఒక గొప్ప రచయితను ఒక ఉపఖండం కాపాడుకోలేకపోయింది.
ఒక మనిషిగా ఉండవలసినవాడు ఒక మతానికి ప్రతినిధి కావడం వల్ల ఒక ప్రాంతానికే పరిమితమయ్యి ముగిసిపోవాల్సి వచ్చింది.
మంటో తన 42 ఏళ్ల వయసులో 1955లో మరణించాడు. ఇప్పుడతడు చిరంజీవి. ఎక్కడ ఏ విభజన ప్రస్తావన వచ్చినా ఇరుదేశాల సాహిత్యంలో మొదటగా వినిపించే పేరు మంటోనే. కాని ఏం లాభం? బతికి ఉండగా పొందలేనిది చనిపోయాక ఎంత వచ్చి ఏం లాభం?
- సాక్షి సాహిత్యం
(మంటో కథలు విస్తారంగా తెలుగులో అనువాదమయ్యాయి.
విశాలాంధ్ర/ ప్రజాశక్తిలో ఆయన కథల పుస్తకాలు దొరుకుతాయి)