Visalandhra
-
సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
-
సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన భౌతికకాయాన్ని మఖ్ధుమ్ భవన్‌కు తరలించారు. రాఘవాచారి పార్థివ దేహానికి సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. అలాగే ఆయన మృతిపట్ల సీపీఐ నేత రామకృష్ణ, విశాలాంధ్ర గౌరవ చైర్మన్ ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. అనంతరం విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10వ తేదీన ఆయన జన్మించారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారి పేరుగాంచారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు. 33 ఏళ్లుపాటు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. రాఘవాచారి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం పాత్రికేయులు రాఘవాచారి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. జర్నలిజం వృత్తిలో విలువల కోసం ఆయన కృషి చేశారని, రాబోయే తరాలకు రాఘవాచారి రచనలు స్ఫుర్తిదాయకమన్నారు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి చేసిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. రాఘవాచారి ఎందరికో ఆదర్శంగా నిల్చారని పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రాఘవాచారి మృతికి సంతాపం తెలిపారు. ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని...రాఘవాచారి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాఘవాచారి మృతికి సంతపం వ్యక్తం చేశారు. -
కొత్త పుస్తకాలు
హృదయరశ్మి (కవిత్వం) రచన: డా. ఎన్.గోపి పేజీలు: 154; వెల: 150 ప్రతులకు: ‘విశాలాంధ్ర’తోపాటు, ఎన్.అరుణ, 13-1/5బి, శ్రీనివాసపురం, రామంతాపూర్, హైదరాబాద్-13. ఫోన్: 040 27037585 కట్టెపల్క (కవిత్వం) రచన: కందుకూరి అంజయ్య పేజీలు: 98; వెల: 60 ప్రతులకు: కవి, 10-4-311, సుభాష్‌నగర్, కరీంనగర్, 505001. ఫోన్: 9490222201 యాల్లైంది (కవిత్వం) రచన: డా. ఉదారి నారాయణ పేజీలు: 104; వెల: 50 ప్రతులకు: కవి, 4-9-34, సంజయ్‌నగర్, ఆదిలాబాద్-504001. ఫోన్: 08732-230489 చరిత్ర మరచిన రోజు (తెలంగాణ విమోచన దినం) రచన: కపిలవాయి రవీందర్ పేజీలు: 90; వెల: 60 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, శ్రీవిజయ ఎంటర్ప్రైజెస్, 2-12-395, విద్యారణ్యపురి, హన్మకొండ, వరంగల్-506009. ఫోన్: 7386775678 మైనపు బొమ్మలు (కవిత్వం) రచన: లోసారి సుధాకర్ పేజీలు: 116; వెల: 60 ప్రతులకు: కవి, 1/72-1, చెమ్ముమియాపేట, రవీంద్రనగర్ పోస్ట్, కడప-516003. ఫోన్: 9949946991 చింతయామి (కవిత్వం) రచన: డా. ధేనువకొండ శ్రీరామమూర్తి పేజీలు: 72; వెల: 50 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 9885297983 సముద్రమంత... చెమట చుక్క (కవిత్వం) రచన: మొయిద శ్రీనివాసరావు పేజీలు: 96; వెల: 50;ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9908256267 ఆవరణం (డా.దేవరాజు మహారాజు సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రముఖుల వ్యాసాలు) సంపాదకత్వం: డి.కృష్ణకుమారి పేజీలు: 310; వెల: 200 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు; ఫోన్: 8106819844 అంబేద్కర్ ది ట్రూ పేట్రియాట్- అంబేద్కరిజం ది ట్రూ పేట్రియాటిజం రచన: శేఖర్-యాదగిరి పేజీలు: 140; వెల: 80 ప్రతులకు: నవోదయా బుక్ స్టాల్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్. ఫోన్: 9000324260 నవీన సుమతి శతకము రచన: డా. కాసల నాగభూషణం పేజీలు: 32; వెల: 30 ప్రతులకు: రచయిత, 23/13, కెనరా బ్యాంక్ కాలనీ, గాంధీనగర్, సాలిగ్రామం, చెన్నై-600093. ఫోన్: 044 23620572 అనుపల్లవి (కవిత్వం) రచన: అభిలాష పేజీలు: 184; వెల: 120; ప్రతులకు: రచయిత్రి, వేమూరు, గుంటూరు-522261. ఫోన్: 9666222737 -
నా పదవి జనగామకేఅంకితం
గుమాస్తా కొడుకును ఈ స్థారుుకి చేరుకున్నా.. నా బలం..ఊపిరి జనగామ జనమే టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జనగామకు రాక విలేకరుల సమావేశంలో భావోద్వేగం జనగామ, న్యూస్‌లైన్ : ‘నాకు దక్కిన పీసీసీ పదవిని జనగామ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్నా.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకైనట్టుగా.. తాను పీసీసీ అధ్యక్షుడినైనా జనగామ జనానికి బిడ్డలాంటోడిని’ అని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీపీపీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గమైన జనగామకు శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పొన్నాల మాటలను మొదలు పెట్టగానే ఆయన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. గద్గద స్వరంతో మాట్లాడారు. జనగామ జనం ఆదరాభిమానాలే తన బలం.. ఆయుష్సు.. ఊపిరి అని అన్నా రు. 30 ఏళ్లు తనను బిడ్డగా ఆదరించారని, వారి దయ వల్లే గుమాస్తా కొడుకునైన తాను.. నేడు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. చిన్న నాటి నుంచి ఎన్నో కష్టాలకోర్చి చదువుకున్నానన్నారు. కరీంనగర్ జిల్లా దండేపల్లిలో ఓ భూస్వామి వద్ద తన తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడని, తన తండ్రి 1945లోనే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడని, ఇందుకు సంబంధించిన రశీదును 1991 వరకు భద్రంగా దాచినట్లు పొన్నాల తెలిపారు. అయితే ఖిలాషాపూర్‌లో నక్సలైట్లు జరిపిన పేళుల్లలో ఆస్తి, దాచుకున్న పత్రాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. నిరుపేద కుటుంబంలో ఉన్న తాను ఉన్నత చదువులు చదివి అమెరికాలో అంతరిక్ష పరిశోధనలో తన సాంకేతికతను అందిచానని వివరించారు. స్వదేశానికి తిరిగివచ్చి 1978లో జనగామలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా చేరానని, 1985 వరకు కూడా కార్యకర్తగానే కొనసాగానని, మొదట జిల్లా కాంగ్రెస్ కోశాధికారిగా, ఆ తదుపరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశానని అన్నారు. అంచె లంచెలుగా ఎదుగుతూ సుధీర్ఘ కాలం మంత్రిగా కొనసాగానని ఆయన తన రాజకీయ జీవితాన్ని వివరించారు. గత పన్నెండేళ్లుగా పీసీసీ పదవి వచ్చినట్టే వస్తూ చేజారిందని, చివరకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన చారిత్రాక సమయంలో తొలి పీసీసీ పదవి వరించడం తనకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. 1955లోనే.. 1955లోనే నైజాంను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో చదివే విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారని పొన్నాల చెప్పారు. విశాలాంధ్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆనాడే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ నినదించిన రోజులు మరిచిపోలేనివన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయన్నారు. 2001లో 42 మంది ఎమ్మెల్యేలము మొదటి సారిగా తెలంగాణను ఏర్పాటు చేయాలని సంతకాలు చేశామని, 1991లో తెలంగాణ అభివృద్ధికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లగా ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపిన మంత్రిని తానేనని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధికి పాటుపడుతూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన జనగామ ప్రజలకు జన్మంతా రుణపడి ఉంటానన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పొన్నా ల వైశాలి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నాయిని రాజేందర్, ఈ వీ శ్రీనివాస, రాజనాల శ్రీహరి, ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు, హరిరమాదేవి, జంగా రాఘవరెడ్డి, బండా ప్రకాష్, జనగామ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, నాయకులు రంగరాజు ప్రవీణ్, బుచ్చిరెడి,్డ ఎం.రవీందర్, జక్కుల వేణుమాధవ్, మున్సిపల్ వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలి : రోడ్ షోలో పొన్నాల జనగామ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి దోహదపడాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మధ్యాహ్నం జనగామలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. టీ పీసీసీ పదవి వచ్చిన తర్వాత తొలిసారిగా జనగామకు రావడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం పెంబర్తి నుంచి మొదలైన రోడ్ షో జనగా మ ఆర్టీసీ చౌరస్తా, అక్కడి నుంచి నెహ్రూ పార్కు, రైల్వేస్టేషన్, గుండ్లగడ్డ మీదుగా అంబేద్కర్ నగర్ చమన్ వరకు సాగింది. ఈ సందర్భంగా పొన్నాల పట్టణ ప్రజలకు అడుగడుగునా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక దేవి థియోటర్ వద్దకు చేరుకునేసరికి ప్రచార సమయం అయిపోవడం తో పోలీసులు ఆయన వాహనాన్ని ఆపివేశా రు. దీంతో సొంత వాహనంలో పట్టణ కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందు రోడ్ షోలో పొన్నాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో ఇప్పటికే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన జనగామ పట్టణాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్థాని క సంస్థల ఎన్నికల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. 80 శాతం కేంద్ర ప్రభుత్వ, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధుల తో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకా రం ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, సుధాకర్, రవీందర్, బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రవీన్, ధర్మపురి శ్రీనివాస్, జెక్కుల వేణు మాధవ్‌తోపాటు పట్టణంలోని 28 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. పొన్నాలతో నారాయణ భేటీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో జనగామలోని ఆయన నివాసంలో భేటీ అయ్యూరు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత నారాయ ణ వెళ్లిపోయూరు. అరుుతే నారాయణ బయటకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తాను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పరిచయం చేసుకోగా స్పందించిన నారాయణ ‘అరె.. ఆ సీటును మేము అడుగుతున్నం కదా’ అని అన్నారు. అక్కడే ఉన్న పొన్నాల వెంటనే స్పందించి ‘ఆ సీటు అడగొద్దు’ అనితన దైన శైలిలో అన్నారు. దీంతో నారాయణ కూడా సరేలే అని అక్కడి నుంచి వెళ్లిపోయూరు. -
విశాలాంధ్రకు కాబోయే సీఎం జగన్
సంగం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగంలో చేస్తున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తధ్యమని తెలిసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయన ప్రభావం తగ్గిందనే దుష్ర్పచారానికి దిగారని విమర్శించారు. ఈ దుష్ర్పచారానికి ఎల్లో మీడియా తన వంతు సాయం చేస్తోందన్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు గాలి మాటలుగా కొట్టిపారవేస్తున్నారని తెలిపారు. తమ కుట్రలు, కుతంత్రాలు పనిచేయకపోవడంతో ఆ రెండు పార్టీలు మరోసారి కుమ్మక్కై గ్రాఫ్ డ్రామా ఆడుతున్నాయన్నారు. వైఎస్సార్ గురించి అవాకులు, చెవాకులు పేలుతున్న నేతల రాజకీయ జీవితం వచ్చే ఎన్నికలతో ముగుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రాన్ని సైతం చీల్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. సోనియా రచించిన రాష్ట్ర విభజన నాటకంలో కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పగా నటిస్తున్నారన్నారు. బాబు రెం డు కళ్ల సిద్ధాంతం, టెంకాయ కథలతో విభజనకు సహకరిస్తున్నారని తెలిపారు. లేఖను వెనక్కు తీసుకోమని అడిగితే స్పందించని చం ద్రబాబును సీమాంధ్ర ప్రజలు తరిమికొట్టే రో జులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అసెంబ్లీలో సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ ఒక్కటే పోరాడుతుందన్నారు. తమ పోరాటంతోనే సమైక్యాంధ్ర నినాదం నిలబడిందన్నారు. పార్లమెంటులో బిల్లు వస్తే అక్కడ నెగ్గకుండా చేయాలని అన్ని పార్టీల నేతలను తమపార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కలిసి మద్దతు కూడగట్టారని తెలిపారు. మహానేత వెఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందడంలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే తండ్రిగా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలను కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని చెబుతున్నారని తెలిపారు. యువకులు, మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చూపుతున్న ఆదరణ తాను ఎ ప్పటికీ మరిచిపోనని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మర్రిపాడు నాయకులు బిజివేములు వెంకటసుబ్బరెడ్డి, సంగం, ఆత్మకూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీన్వర్లు డాక్టర్ ఐవీ కృష్ణారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, సంగం నాయకులు వాసుదేవరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, నారసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, నజీర్, నయీంమున్నీసా, మల్లికార్జునరెడ్డి, సురేంద్రరెడ్డి, రేవూరు గోపాల్‌రెడ్డి, వనిపెంట వెంకటసుబ్బారెడ్డి, ఎస్వీ రమణరెడ్డి, యర్రబల్లి శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
తెలుగులో తొలిసారి కాఫ్కా
కాఫ్కా కథలు తెలుగు: జి.లక్ష్మి వెల: రూ. 80 ప్రతులకు: విశాలాంధ్ర ఇరవయ్యవ శతాబ్దపు దోస్తవ్స్కీగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చెక్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా చిన్న, పెద్ద కథలు, కథానికలు తెలుగులో ఎట్టకేలకు గ్రంథరూపంలో వెలువడ్డాయి. తెలుగు కథానికా సాహిత్యానికి ఇది శుభం చేకూర్చే పరిణామం. గతంలో కాఫ్కా కథలు తెలుగులోకి తర్జుమా అయిన సందర్భాన్ని ఇక్కడ ప్రస్తుతించుకోవాలి. ముళ్లపూడి శ్రీనివాస ప్రసాద్ సుమారు 30 ఏళ్ల నాడు కొన్ని వారాల పాటు ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సాహితీ అనుబంధంలో కాఫ్కా కతలను, గల్పికలను (పారబుల్స్/ఫేబుల్స్) క్రమం తప్పకుండా తెలుగు చేశారు. అయితే మన దౌర్భాగ్యం మేరకు అవి పుస్తకరూపం తీసుకోలేదు. కాఫ్కా ప్రభావంతో రాసిన కథలతో కాఫ్కా మీద రాసిన కవితలతో తెలుగు సాహితీలోకానికి కాఫ్కా పేరును పరిచయం చేసిన ఖ్యాతి త్రిపురకు దక్కుతుంది. గమ్మత్తేమిటంటే కాఫ్కా కతలు, నవలలు, అన్య రచనలు, హిందీ మలయాళం కన్నడం బెంగాలీ వంటి ఇతర భారతీయ భాషలలోకి ఏనాడో అనువాదమయ్యాయి. తెలుగువారి భావదారిద్య్రం, వెనుకబాటుతనం ఎంత గాఢమైనవో తెలుసుకోవడానికి మచ్చుకు కాఫ్కా సందర్భం ఒక్కటి చాలు. రచయిత్రి జి. లక్ష్మి (గతంలో అల్బర్ట్ కామూ ‘అపరిచితుడు’ నవలను తెలుగు చేశారు) అనువాదం చేయడమే కాక అర్థవంతమైన ముందుమాటను ఈ కథల పుస్తకానికి సమకూర్చారు. కాఫ్కా పేరెన్నిక గన్న కథలు ‘ఇన్ ది పీనల్ కాలనీ’, ‘ఎ కంట్రీ డాక్టర్’, ‘ది జడ్జిమెంట్’, ‘ఎ హంగర్ ఆర్టిస్ట్’, ‘ది బరో’ ఇందులో చోటు చేసుకున్నాయి. ‘బిఫోర్ ది లా’ వంటి ముఖ్యమైన చిన్న కథలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి. కాఫ్కాకు పేరుతెచ్చిన ‘మెటమార్ఫసిస్’ కథను వేరెవరో తెలుగు చేస్తున్నారని తెలిసి అనువాదకురాలు లక్ష్మి ఆ కథను తర్జుమాకు ఎంచుకోలేదు. ఆ కథ కూడా ఇందులో చేరి ఉంటే సంకలనం మరింత సమగ్రంగా ఉండేది. మానవ లోకంలో న్యాయం అలభ్యం. దోషికి శిక్ష విధించడం అసాధ్యం. ఏ నేరం చేయనివాడే ఇక్కడ శిక్షార్హుడు. ఈ ప్రపంచం ఒక నిర్బంధ శిబిరం అని చాటి చెప్పిన దార్శనిక కథకుడు కాఫ్కా. ‘కాఫ్కా కథలను ఒకసారి చదివితే సరిపోదు. ఆ కథలను మరలా మరలా చదువుతూ పోవాలి. అప్పుడే వాటిని అర్థం చేసుకోగలం’ అని కామూ చెప్పిన మాటను మననం చేసుకుందాం. కాఫ్కాను ఇకనైనా మళ్లీ మళ్లీ ఆసాంతం చదువుకుందాం. - అం. సురేంద్రరాజు -
ఆలిస్ మన్రో ‘నోబెల్’ కథలు
ఆలిస్ మన్రో కథలు తెలుగు: జి.లక్ష్మి వెల: రూ. 70 ప్రతులకు: విశాలాంధ్ర ఆడపిల్లల జీవితాలను, కుటుంబంలో వారి బాధలను, సంతోషాలను, ఎదిగే వయసులో వారు ఎదుర్కొనే సంశయాలు, సందిగ్ధాలను ఎంతో నైపుణ్యంతో అతి మంద్రంగా అంతే నిశితంగా కళ్ల ముందుంచిన ఆలిస్ మన్రో కథలు ఇవి. రచయిత్రిగా ఇవి ఆమె ఆత్మను పట్టిస్తాయి. ఇటీవలే, సాహిత్యానికి ఇచ్చే నోబెల్ బహుమతిని పొందిన ఈ కెనడా దేశపు రచయిత్రి కథలు ఏడింటిని జి.లక్ష్మి తెలుగులోకి తర్జుమా చేసి తెలుగు కథానికా ప్రపంచంలో చిరకాలంగా ఉన్న ఓ లోటును కొంతలో కొంతయినా తీర్చారు. స్త్రీవాదులుగా చెప్పుకునే రచయిత్రులు, అంతకు మునుపు తెలుగు కథానికా రంగంలో లబ్ధ ప్రతిష్టులుగా ఉన్న రచయితలు, రచయిత్రులెవరూ ఎదుగుతున్న ఆడపిల్లల జీవితాలను, వారి దృష్టికోణం నుంచి చిత్రించిన దాఖలాలు కానరావు. పది పన్నెండేళ్ల వయసులో ఉండే అమ్మాయికి తన కుటుంబసభ్యులతో ఉండే సంబంధ బాంధవ్యాలలోని లోతు పాతులను రచయిత్రి తన స్వానుభవం నుంచి, లేదా సహానుభూతి చెంది రాస్తే తప్ప ఇటువంటి సాధికారమైన కథలు వెలుగు చూడవు. ముఖ్యంగా తల్లికి/తండ్రికి తమ కూతురితో ఉండే అనుబంధంలోని వైరుధ్యాలను రచయిత్రి ఎంతో సున్నితంగా అక్షరబద్ధం చేశారు. కళ్యాణ సుందరీ జగన్నాథ్, జలంధర, పి.సత్యవతి వంటి అతి కొద్దిమంది, అంతకు మునుపు సౌరిస్, కొమ్మూరి పద్మావతీ దేవి, ఆచంట శారదాదేవి, శివరాజు సుబ్బలక్ష్మి, రంగనాయకమ్మ వంటి రచయిత్రులు మరి కొందరు అగ్రకుల, మధ్య తరగతి స్త్రీల కుటుంబ జీవనాన్ని తమ స్వీయానుభవం నుంచి చిత్రిక పట్టారు. ఆడ పిల్లల పెంపకంలో ఇమిడి ఉన్న కుటుంబ రాజకీయాన్ని ఓల్గా తన ‘రాజకీయ కథలు’లో వ్యంగ్యంగానైనా బట్టబయలు చేశారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో కనబరిచే వివక్షకు ‘బాయ్స్ అండ్ గాళ్స్’ కథ అద్దం పడుతుంది. అలాగే ‘హెవెన్’ కథ కళాకారిణులైన స్త్రీల పట్ల పురుషులు చూపే అసహనం, వివక్షలను కళ్లకు కడుతుంది. భర్త తొలినాళ్ల ప్రియురాలు, హటాత్తుగా తమ జీవితంలోకి ప్రవేశిస్తే ఒక భార్య పడే వేదన, అంతర్మథనం ‘డాలీ’ కథ ఇతివృత్తం. నెలసరి (రజస్వల)కి చేరువైన ఆడపిల్ల మానసిక చిత్రణ, తండ్రి కలిగించిన సాంత్వన వలన సంఘర్షణ నుంచి బయటపడిన తీరు ‘నైట్’ కథలో చూస్తాం. ఈ సంకలనంలోని అన్ని కథలు... ఆడపిల్లలకు కౌమార దశలో బయటి లోకంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు వారి అంతర్లోకంలో చెలరేగే ఘర్షణలు, దేవులాటలు. భార్యగా, తల్లిగా స్త్రీలు ఎదుర్కొనే అంతఃసంఘర్షణలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి. మన్రో కథలు చదివి రచయిత్రులు పాఠాలు నేర్చుకోగలిగితే తెలుగు కథకు మరింత పుష్టి చేకూరుతుంది. మన్రోను సమర్థంగా తెలుగు చేసిన రచయిత్రి జి.లక్ష్మికి అభినందనలు. ప్రచురించిన ‘విశాలాంధ్ర’కు అభివందనాలు. - అం. సురేంద్రరాజు -
చెట్టూ చేమా.... రచన...
పుస్తకం నుంచి... తుపాను హెచ్చరికలు వినిపిస్తే తప్ప ఆకాశం వైపు చూడని రోజులొచ్చాయి. గ్రహణం రోజు తప్ప చంద్రుణ్ణి పరికించే తీరిక లేని దురదృష్టం. పాఠకులు సరే. రచయితలన్నా చూస్తున్నారా? పాఠకులను అటు చూడమని చెప్తున్నారా. అలాంటి పాత్రలు సృష్టిస్తున్నారా? ఊరటనిచ్చే జీవితాన్ని ప్రేరేపించే ప్రకృతి ప్రేమని బుచ్చిబాబు పలుమార్లు రాశారు. ఆయన ఆత్మకథ ‘నా అంతరంగ కథనం’ నుంచి ఈ వ్యాసఖండం. ‘‘మేం బాపట్లలో ఉన్న రోజులు. స్కూల్లో భూగోళ శాస్త్ర పాఠాలు తప్ప, స్కూలు పాఠాలు నాకెక్కలేదు. పొపకాటు పటల్, సవానా, సస్కాచివాన్, నయగారా, అమెజాన్ అడవులు, జాంబెసి... ఈ పేర్లు మధురంగా ఉండేవి. తరచూ పేలే వెసూవియస్ అగ్నిపర్వతం, దోవ తప్పి ప్రవహించే చైనాలో నదులు, భూకంపాలకు గురి అయ్యే జపాన్, తెల్లవారు చూడని టిబెట్ ప్రాంతం, ట్రాన్స్ సైబీరియన్ రైల్వే- ఇవన్నీ అద్భుతంగా తోచేవి. అగ్నిపర్వతాలు, భూకంపాలు, టార్పెడొలు, ఉత్తర ధ్రువంలో మంచుకొండలు, హిమాలయ శిఖరాల మీద నుండి జారే మంచు నదులు ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలనిపించేది. బాపట్లలోనే కొన్ని రోజులు మా అమ్మమ్మ ఉండేది మాతో. ఆ ఊళ్లో ఆలయంలో ఒక నెలరోజుల పురాణ కాలక్షేపమూ, హరికథలూ జరిగేవి. వాటిని వినేటందుకు బండి మీద అమ్మమ్మను తీసుకు వెళ్లేవాడిని. ఏసూ బేగ్ అనే మా నౌకర్ కూడా మాకు తోడుగా వచ్చేవాడు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ వచ్చేవారు. స్త్రీలలో చాలామంది వితంతువులే. ఈ హరికథలు, పురాణ కాలక్షేపాలు కేవలం వితంతువుల కోసమే అనుకొనేవాడిని. మొదటి రోజుల్లో నిద్రపోయినా రాను రాను హరిదాసు ఛలోక్తులతో, పిట్టకథలతో ఆకర్షించి, లేచి కూర్చునేటట్టు చేసేవారు. రామాయణ కథలో సీత, ఊర్మిళ, మండోదరి మొదలైన స్త్రీలకి ప్రాముఖ్యం ఉండేది. సీత ఒక గొప్ప వ్యక్తిగా, మహా ఇల్లాలుగా నాలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అమెలో హుందాతనం, నమ్రత, అమాయకత్వంతో కూడుకున్న వ్యక్తిత్వం- నాకెంతో గొప్పలక్షణంగా కనబడ్డాయి. ఎందుకా అని అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆమె నిరాడంబర జీవి. ఆభరణాలు విడిచేసి మేడలు, మిద్దెలు వదిలేసి నార చీరతో భర్తతో అడవులకు సిద్ధమైంది. రెండు- నాకు మల్లే సీతకి పూరి గుడిసెలు, చెట్లు, మొక్కలు, సెలయేళ్లు, పక్షులు, జంతువులు ఇష్టం. అరటి చెట్లు, లేళ్లు, సెలయేర్లు, పూలు, పిట్టలు- ప్రకృతి కావాలి. ఆమెకి నాగరికత అక్కర్లేదు. అందుకే సీతంటే గౌరవం. ఇలా నాగరికత నుండి ప్రకృతిలోకి పారిపోయే వ్యక్తులన్నా, అట్టివారిని గూర్చిన కథలన్నా నాకెంతో ఇష్టం. అలా నాకు ఇష్టుడైన రచయిత రాబర్టు లూయీ స్టెవెన్సన్. ఈయన గాడిద మీద అడవుల్లో సంచరించాడు. ఒక్కడూ నట్టడివిలో, కొండలోయల్లో, నక్షత్రాలకేసి చూస్తూ, గడ్డిలో పడుకుని, మిణుగురు పురుగుల మైత్రి చేశాడు. సోమర్సెట్ మామ్ రచనలంటే నాకిష్టం ఏర్పడ్డానికి ఆయన ఇల్లాంటి వ్యక్తులని గురించి ఎక్కువగా రాయడమే కారణమనుకుంటాను. ‘మూన్ అండ్ సిక్స్ పెన్’ అనే నవలలో నాయకుడు, పెళ్లాం పిల్లలు- సంసారం త్యజించి నాగరికతకే దూరమైన, నిర్జనమైన స్థలంలోకి పారిపోతాడు. ‘రేజర్స్ ఎడ్జి’ అనే నవలలో నాయకుడు పెద్ద హోదాగల ఉద్యోగం, విద్యాధికురాలై తన్ను ప్రేమించిన స్త్రీని విడిచేసి దేశదిమ్మరై దేన్నో అన్వేషిస్తూ తిరుగుతాడు. అయితే అందరు ఇల్లాగ ప్రకృతిలోకి పారిపోవాలి అనను. కొందరం బస్తీలలో ఉండి నాగరికతను పెంపొందించే సామాజిక విలువల్ని సాధించి, పాటుపడి నిత్య జీవితపు రథచక్రాల్ని నెట్టాల్సిందే. కాని కొందరు ఇల్లా ఉండలేరు. వారికి ప్రశాంత వాతావరణం కావాలి. పోటీ పడలేరు. దానితో వచ్చే పలుకుబడి, హోదా వారికి అక్కరలేదు. విశ్వాన్ని తిలకించడంలో ఆనందం ఉంది. ఆ ఆనందం వారికి కావాలి. సీత ఈ మహదానందాన్ని అనుక్షణమూ అనుభవించగలిగిన మహా ఇల్లాలు. నాగరికత పరాకాష్ఠనందుకున్న ఉన్నత దశలో ద్రౌపది లాంటి స్త్రీ ఆ నాగరికతకి ప్రతినిధిగా బైలుదేరొచ్చుగాని సీత వంటి స్త్రీలు అప్పుడవతరించరు. దీన్నొక ప్రాచీనతత్వం (ప్రిమిటివిజమ్) అనుకున్నా తప్పులేదు. మట్టిలోంచి పుట్టింది. మళ్లా మట్టిలోకే చేరుకుంటుంది సీత. భూగర్భంలో ఉద్భవించి మళ్లా భూదేవిలో ఐక్యం అయినట్లు చూపడం మహా ప్రతిభాశాలికే సాధ్యమౌతుంది. ఆమె జీవితం అంతా ఉద్యానవనాలలోనూ, అడవుల్లోనూ గడిపింది. లంక నుండి తిరిగి వచ్చాక ఎన్నో రోజులు రాజభవనంలో ఉండలేదు. నీ కోర్కె ఏమిటంటే- రుష్యాశ్రమంలోకి వెళ్లాలని ఉందని చెప్పుకుంది. అట్లా కోరిందని ఊహిస్తేనే నా కళ్లంట నీళ్లు తిరుగుతాయి. రేడియోలు, సినిమాలు, కార్లు, విమానాలు, నగలు, చీరలు, పుట్టింటివారికి కానుకలు- ఇవేవీ అడగలేదు. తోటలో, పాకలో ఉండాలని ఉందిట. కంచర్ల గోపన్న (రామదాసు) వెర్రివాడు. సీతమ్మకి చేయిస్తి చింతాకు పతకాము అని రాముడితో మొరెట్టుకున్నాడు. ఆయన రామభక్తుడు. సీతను ఎరగడు. ఎరిగి ఉంటే సీతమ్మకు వేయిస్తి మామిడి తోపు అని పాడి ఉండును. నాగరికతను విడిచేసి ప్రకృతిలోకి పారిపోవాలన్నది పాశ్చాత్య దేశాలలో ఉద్యమంగా లేవ దీసింది ‘రూసో’. టాల్‌స్టాయ్ ఆస్తినంతా వప్పగించేసి, వేరే ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు. గాంధీగారు ఆఫ్రికాలో ఫీనిక్స్ ఆశ్రమం ఏర్పరుచుకున్నారు. మనవారిలో వేమన్న ప్రకృతిలోకి పారిపోయి నగ్నంగా జీవించాడు. జవహర్లాల్ నెహ్రూ తన చివరి రోజుల్లో ‘నాలోన కొండల నడుమ తిరుగాడే ఆటవికుడు వొక్కడున్నాడు’ అని ఎక్కడో చెప్పుకున్నాడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీకి ఆటవికుల మధ్య గడపాలన్న కోరిక ఉండేది. అది సాధ్యం కాక ఆటవికులని గురించిన పుస్తకాలు చదవడంలో తృప్తి పడింది. ఈ ప్రాచీనతత్వం ఛాయలు నన్ను కూడా ప్రేరేపించాయి. అందుకే యెంకి, నాయుడుబావల ప్రేమ కథనంగా ‘ఉత్తమ ఇల్లాలు’ నాటకం రాశాను.’’ (ఈ పుస్తకం విశాలాంధ్రలో లభ్యం. వెల: రూ. 55) -
విభజన ప్రక్రియలో భాగస్వామి కాలేను: ఆంజనేయ రెడ్డి
విశాలాంధ్ర కోసమే కట్టుబడి ఉన్నానని మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి స్పషం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియలో తాను భాగస్వామిని కాలేనని ఆయన మంగళవారం హైదరాబాద్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలు, ఇతరత్ర అంశాలపై అధ్యాయనంపై కేంద్ర ప్రభుత్వం విజయ్‌కుమార్ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్ కమిటీ నియమించింది. ఆ కమిటీ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి కేంద్ర మానవ వనరుల అభివృద్ది సంస్థ లో ఆ టాస్క్‌ఫోర్స్ సమావేశం కానుంది. ఆ టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యులుగా ఆంజనేయరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీతో ఆంజనేయరెడ్డి మరికాసేపట్లో భేటీ కానున్నారు. అందులోభాగంగా ఆంజనేయరెడ్డిపై విధంగా స్పందించారు. -
సమరదీక్షలో నేతల ప్రసంగాలు
జగన్ సీఎం అవుతారనే భయంతోనే... ‘‘రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మున్ముందు విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు కాంగ్రెస్‌కు పుట్టగతులుండవన్న భయంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియకు యూపీఏ శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని విభజించే విషయంలో కేంద్రం శాస్త్రీయ దృ క్పథాన్ని పాటించలేదు. కేవలం తెలంగాణలో రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకునేందుకు, సీఎం పీఠం కోసమే వారికి ప్రత్యేక రాష్ట్రం అవసరమైంది. రాహుల్‌ని ప్రధానిని చేయాలన్న ఆశతో రాష్ట్ర విభజనకు సోనియా తెర తీశారు’’ - ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోస్తా ఉప్పునీటి ఎడారే ‘‘విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న కోస్తా జిల్లాలన్నీ ఉప్పు నీటి ఎడారులుగా మారతాయి. తెలంగాణకు, సీమాంద్రకు సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలి’’ - ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఈ గతి పట్టేది కాదు’’ - ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వైఎస్ ఉంటే విభజన జరిగేది కాదు ‘‘వైఎస్ ఉంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు కానిచ్చేవారు కాదు. ఆయన తదనంతరం రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మార్చింది. విశాలాంధ్రను ముక్కలు కాన్వికుండా ప్రజలందరూ ఉద్యమించాలి’’ - ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బాబు వంతపాడటం దారుణం ‘‘కేవలం రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే విభజనకు సోనియా శ్రీకారం చుట్టారు. ఇందుకు చంద్రబాబు కూడా వంత పాడటం దారుణం’’ - ఎమ్మెల్యే బాలరాజు బాబు వల్లే చేటుకాలం ‘‘పాపిష్టి చంద్రబాబు వల్లే రాష్ట్రానికి చేటు కాలం దాపురించింది. విభజన జరిగితే తెలుగు జాతిని చీల్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది’’ - ఎమ్మెల్యే జోగి రమేశ్ కాంగ్రెస్‌తో బాబు చీకటి ఒప్పందం ‘‘స్వార్థ రాజకీయంతో గద్దె నెక్కాలని కలలు కంటున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కారణమవుతున్నారు’’ - ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
సాదత్ హసన్ మంటో విభజన కథకుడు
కాలానికి తగినవాడు: మంటోకు అప్పుడు ఏడేళ్లు. ఒకరోజు ఊళ్లో అందరూ ఓ అంటూ ఏడుస్తున్నారు. చిన్నా పెద్దా ముసలీ ముతకా... అందరూ... ప్రతి ఒక్కరూ. ఇదేమిటి? పిల్లలు కదా ఏడుస్తారు. పెద్దలు కూడా ఏడుస్తారా? ఎందుకేడుస్తున్నారో మంటోకు అర్థం కాలేదు. తనూ ఏడవడం మొదలుపెట్టాడు. తల్లో తండ్రో మంటోను ఎత్తుకొని ఊళ్లో జరిగిన విషాదాన్ని చూడ్డానికి పరిగెత్తారు. ఎవరో చనిపోయారట. ఒకరు. ఇద్దరు. ముగ్గురు. నలుగురు. వెయ్యి మంది. కాదు ఎంత మందో తెలీదు. చనిపోయారు. కాదు బ్రిటిష్ వాళ్లు చంపేశారు. ఆ ఊరు అమృత్సర్. అది జలియన్ వాలాబాగ్ సంఘటన. మనిషి అసలు రూపాన్ని చూసినవాడు మంటో. ఆ వయసులో చూసి లోలోపల ఏమనుకున్నాడో ఏమో ఏదైనా చేయాలనుకున్నాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నాడు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌లో చేరాడు. ఆ వెంటనే కలం కూడా పట్టుకున్నాడు. ‘తమాషా’ అతడి మొదటి కథ. అందులో వేరేది ఏదీ రాయలేదు. చిన్నప్పుడు తాను చూసిన జలియన్ వాలాబాగ్ సంఘటనే ఆ కథ. ఆ తర్వాత అదే ఊపులో పుస్తకాల వెంట పడ్డాడు. ఫ్రెంచ్, రష్యన్ రచయితలు పరిచయమయ్యారు. వాళ్ల రచనలు చదివి, ఊగిపోయి, అరె... ఇవి జనానికి తెలియకపోతే ఎలా అని ఉర్దూలో స్వయంగా అనువాదం చేశాడు. విక్టర్ హ్యూగో, ఆస్కార్ వైల్డ్... మంటో ఇప్పుడు నలుగురికీ తెలుస్తున్నాడు. ఇరవై నాలుగేళ్లు వచ్చాయి. ఆ వెంటనే అతడి తొలి కథా సంపుటి - అతిష్ పరే (కయ్యానికి కాలు దువ్వే వాళ్లు). మంటో స్వభావం కూడా అలాగే ఉండేది. ఎవరి మీదైనా సరే తెగించి జోకులు పేల్చేవాడు. వాళ్లెంత... వీళ్లెంత. మజిలీ బొంబాయికి మారింది. సినిమాల్లో ఇలాంటి వాళ్లకు పని దొరకదా? హీరో అశోక్ కుమార్ క్లోజ్ అయ్యాడు. ఇంకా ఎంతో మంది యాక్టర్లు. సాహిత్యంలో సినిమాల్లో మంటో ఒక స్టార్. రోజులు గడుస్తున్నాయి. కథలూ కాకరకాయలూ.... అప్పుడు మరి స్వాతంత్య్రం వచ్చింది. దేశం విడిపోయింది. ఎటు వాళ్లు అటు వెళ్లిపోవాలి. భారతీయులు కాస్తా హిందూ- ముస్లింలు అయ్యారు. అన్నదమ్ములు కాస్తా పాకీస్తానీలు- ఇండియన్లు అయ్యారు. కొందరు బంధువులు అటు మిగిలారు. చావనీ. కొందరు అయినవాళ్లు ఇటు మిగిలారు. చావనీ. మంటో ఇదంతా చూసి- వెర్రెత్తినట్టు రోడ్ల వెంట నడిచాడు. అదే కథగా కూడా రాశాడు. దాని పేరు ‘దేఖ్ కబీరా రోయా’ (కవి కబీర్ ఏడ్చాడు). ఇరుమతాల ఉమ్మడి ప్రతీక అయిన కబీర్ ఈ విభజనను తట్టుకోలేక ఏడ్చాడని రాస్తాడు మంటో ఆ కథలో. కాని వాస్తవాన్ని అరాయించుకోక తప్పదు కదా. కాని రోజులు అంత స్మూత్‌గా కూడా లేవు. మనుషుల భావోద్వేగాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికి తెలుసు? బాంబే ఇండస్ట్రీలో కూడా హిందువులూ ముస్లింలూ అని విభజన. ఒకరి మీద మరొకరికి అనుమానం సందేహం కోపం ద్వేషం. మంటోకు పని దొరకడం కష్టమయ్యింది. పో... పాకిస్తాన్‌కు పో. నీ దేశం పో. లాహోర్‌కు చేరుకున్నాడు. అప్పుడప్పుడే కూడుకుంటున్న నగరం అది. మంటోలాంటి వాడికి ఏం పని చూపిస్తుంది? కాని ఊరికే ఉండే రకమా మంటో. ఇరువైపులా జరిగిన రక్తపాతం, హింసాకాండ, ముక్కలైన మనసులు, శిథిలమైన అనుబంధాలు, దివాలా తీసిన విలువలు, పెరిగిపోయిన కక్ష.... చూసింది చూసినట్టు వెరవకుండా రాశాడు. ‘థండా గోష్’ (చల్లబడ్డ మాంసం), ‘ఖోల్ దో’ (తెరు). మంటో కథలు పాఠకలోకంలో కలకలం రేపాయి. ఒక వర్గానికి చెందిన అమ్మాయి మరో వర్గం వారి చేత కొన్ని రోజుల పాటు అత్యాచారానికి గురవుతుంది. కొనప్రాణంలో ఆస్పత్రిలో చేరుస్తారు. డాక్టరు అడావిడిగా వచ్చి చూస్తాడు. లోపలంతా ఉక్కపోతగా ఉంటుంది. డాక్టర్ పేషెంట్‌ను చూస్తూ అటెండర్‌కు కిటికీ చూపిస్తూ ‘ఖోల్ దో’ (తెరు) అంటాడు. అప్పటి వరకూ స్పృహలో లేని ఆ అమ్మాయి అప్రయత్నంగా కదులుతుంది. డాక్టర్ దిగ్భ్రమగా చూస్తుంటాడు. ఆ అమ్మాయి అప్రయత్నంగా తన పైజామా బొందు తెరవడం మొదలుపెడుతుంది. అదీ కథ. ఈ కథలన్నీ పాఠకులని ఊపేశాయి. చాందసవాదులు కత్తి కట్టారు. ఈ కోర్టు ఆ కోర్టు అని చూడకుండా అన్ని కోర్టులూ తిప్పారు. ఈ తిరగడాలతో విసిగిపోయిన మంటో కోర్టు బోనులో నిలబడి ‘నా కథలు వికృతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. అవి వికృతంగా ఉన్నాయంటే సమాజం వికృతంగా ఉన్నట్టే. సమాజం నుంచే పుట్టినవి అవి’ అన్నాడు. అంతటితో మంటోని వదల్లేదు. పత్రికల్లో రాసుకొని బతుకుదామంటే ఎక్కడా ఏమీ రాయనీకుండా మేనేజ్మెంట్లే నిరుత్సాహ పరిచాయి. సత్యం పలికేవాడు సమాజ విరోధి. నీ దగ్గర నీ మాటా వాడి దగ్గర వాడి మాటా మాట్లాడి బతికేవాడు రచయిత అవుతాడా? సమాజం ఏది మెచ్చుతుందో అది రాసేవాడు రచయిత అవుతాడా? మంటో సంతోషంగా ఉండలేకపోయాడు.అతడి హృదయం బాంబేలో ఉంది. అతడికి లాహోర్‌లో పని లేకుండా ఉంది. క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. ఏ మాత్రం వీలు చిక్కినా ఒక కథ రాసి మెరిపిస్తూ ఉన్నాడు. అతడు రాసిన ‘తోబా టేక్ సింగ్’ కథ ఉర్దూ సాహిత్యంలో సర్వోన్నతమైన కథగా నిలిచింది. విభజన తర్వాత ఇరు దేశాల్లో ఉన్న ఖైదీలను ఇరు ప్రాంతాల వారు అటూ ఇటూ మార్చుకుందామనుకుంటారు. లాహోర్ జైలులో ఒక ఇండియన్ సిక్కు ఉంటాడు. అతణ్ణి మరి ఇండియాకు అప్పజెప్పాలి. కాని అతడు వెళ్లనంటాడే. ఎందుకంటే అతడి స్వగ్రామం ‘తోబా టేక్ సింగ్’ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఎంత బలవంతం చేసినా వినకుండా అతడు ఇరు ప్రాంతాల సరిహద్దు రేఖ వద్ద ప్రాణం విడుస్తాడు. ఈ కథలన్నీ ఇప్పుడు క్లాసిక్స్ అయ్యాయిగాని రాసిన కాలంలో అవి రాసి మంటో చెప్పలేనన్ని బాధలు పడ్డాడు. భార్యాబిడ్డలకు అన్నం పెట్టడానికి డబ్బుల్లేవు. మురికి బట్టలు. చివరకు ప్రమాణాల మీద ప్రమాణాలు చేసి కూడా బాత్రూమ్లో చాటుగా తాగే అగత్యం. ఒక గొప్ప రచయితను ఒక ఉపఖండం కాపాడుకోలేకపోయింది. ఒక మనిషిగా ఉండవలసినవాడు ఒక మతానికి ప్రతినిధి కావడం వల్ల ఒక ప్రాంతానికే పరిమితమయ్యి ముగిసిపోవాల్సి వచ్చింది. మంటో తన 42 ఏళ్ల వయసులో 1955లో మరణించాడు. ఇప్పుడతడు చిరంజీవి. ఎక్కడ ఏ విభజన ప్రస్తావన వచ్చినా ఇరుదేశాల సాహిత్యంలో మొదటగా వినిపించే పేరు మంటోనే. కాని ఏం లాభం? బతికి ఉండగా పొందలేనిది చనిపోయాక ఎంత వచ్చి ఏం లాభం? - సాక్షి సాహిత్యం (మంటో కథలు విస్తారంగా తెలుగులో అనువాదమయ్యాయి. విశాలాంధ్ర/ ప్రజాశక్తిలో ఆయన కథల పుస్తకాలు దొరుకుతాయి)