సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన భౌతికకాయాన్ని మఖ్ధుమ్ భవన్‌కు తరలించారు. రాఘవాచారి పార్థివ దేహానికి సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. అలాగే ఆయన మృతిపట్ల సీపీఐ నేత రామకృష్ణ, విశాలాంధ్ర గౌరవ చైర్మన్ ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. అనంతరం విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు.
రాఘవాచారి స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10వ తేదీన ఆయన జన్మించారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారి పేరుగాంచారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు. 33 ఏళ్లుపాటు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
రాఘవాచారి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం
పాత్రికేయులు రాఘవాచారి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. జర్నలిజం వృత్తిలో విలువల కోసం ఆయన కృషి చేశారని, రాబోయే తరాలకు రాఘవాచారి రచనలు స్ఫుర్తిదాయకమన‍్నారు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి చేసిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. రాఘవాచారి ఎందరికో ఆదర్శంగా నిల్చారని పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రాఘవాచారి మృతికి సంతాపం తెలిపారు. ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని...రాఘవాచారి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాఘవాచారి మృతికి సంతపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment