సార్వత్రిక ఎన్నికల భేరి మ్రోగింది. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అది పెద్ద ఎన్నికల క్రతువుకు ముహూర్తం ఖరారైంది. దేశమంతా లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం జెండా ఊపింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా? నేనా?.. విజయమా? పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది.
పోయినసారి మాదిరిగా ఈసారి కూడా ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపుతో అందరి జాతకాలు బయటపడతాయి. ఎవరి ధీమా వారిది. కొందరిది అతి విశ్వాసం. ఇక సర్వేలు, ప్రీ-పోల్, పోస్ట్-పోల్ అంచనాలు, బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, వికర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఎన్నికలు రాగానే సహజంగా జరిగే పెద్దతంతులో భాగమే ఈ చర్యలు.
ఓటరు మదిలో ఏముందో? చివరికి కానీ తెలియదు. ఓటింగ్ సరళి, ఎన్నికలు, రాజకీయాలు, దేశం గురించి పుంఖాను పుంఖంగా ఉపన్యాసాలు దంచే మేధావులు సగంమంది అసలు ఓటే వెయ్యరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక దురదృష్టకర సంప్రదాయం. 60-70 శాతం మంది వేసే ఓట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి. మిగిలినవారు ఎప్పటికీ ప్రేక్షకులుగానే మిగిలిపోతారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు 67 శాతం మాత్రమే. అందులో మహిళల భాగస్వామ్యం కాస్త ఆశాజనకంగా వుంది. 33శాతం మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా వున్నారన్నది పచ్చినిజం. ఈసారి ఎట్లా ఉంటుందో చూడాలి.
యువత పెరిగిన సమాజంలోకి వచ్చేశాం. అక్షరాస్యత పెరిగిన కాలంలోకి ప్రవేశించాం. ఈ క్రమంలో కులాల కుంపట్లు రగులుతూనే వున్నాయి, అవి పెరుగుతూనే వున్నాయి. ఇదొక విషాదం. రేపు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం వున్నాయి.
మొత్తం 545 స్థానాలు కలిగిన లోక్ సభలో, దేశ అధికార పీఠాన్ని అధిరోహించాలంటే 272 స్థానాల్లో గెలవాలి. 2014, 2019 రెండు పర్యాయలలోనూ బీజేపీ / ఎన్డీఏ అఖండంగా గెలిచి, అధికారాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో బిజెపి మరింత బలపడింది, కాంగ్రెస్ ఘోరంగా చతికిలబడిపోయింది.
గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకున్న అధికార పార్టీ ఈసారి 370-400 సీట్లు సాధించాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈసారి గెలిచి, అధికారంలోకి వస్తే? బీజేపీ హ్యాట్రిక్ సాధించడమే కాక, అత్యంత శక్తివంతమైన పార్టీగా స్థిరపడిపోతుంది. ఈ క్రమంలో తమ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే పనిలోనూ పడిపోయింది. కూటమి నుంచి విడిపోయిన టీడీపీ వంటి పార్టీలను మళ్ళీ తీసుకొచ్చుకొని తన దొడ్లో కట్టేసుకుంటోంది. తటస్థంగా వున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు కూడా ఇంకా తటస్థంగానే వున్నాయి.
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాటపై వున్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పదే పదే వెల్లడించారు. ఈ పదేళ్ల నరేంద్రమోదీ పాలనలో ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు మద్దతు పలికారు. కేంద్రంతో ఎటువంటి తగాదాలు లేకుండా స్నేహపూర్వకంనే వ్యవహరించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ది కూడా ఇంచుమించూ అదే తీరు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రయోజనాల వరకే తమను పరిమితం చేసుకున్నారు. కాకపోతే, ఈసారి బీజేడీతో ఎన్నికల బంధం ఏర్పరచుకోవడానికి బీజేపీ చూస్తోందని వింటున్నాం. సీట్ల సర్దుబాటు అంశం ఇంకా కొలిక్కిరాలేదు.దానిని బట్టిగానీ, ఆ ప్రయాణాన్ని అంచనా వేయలేం.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను తాజాగా ఈ.డి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ అంశం వేడివేడిగా వుంది. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - బీఆర్ఎస్ మధ్య బంధం ఏర్పడుతుందని నిన్నటి దాకా వార్తలు గుప్పుమన్నాయి. కవిత అరెస్టు నేపథ్యంలో ఈ బంధం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. దక్షిణాదిలో బలోపేతం కావాలనే లక్ష్య సాధనలో బీజేపీ ఎంత వరకూ విజయం సాధిస్తుందన్నది ఈసారి అనుమానమే. కర్ణాటక, కొంత తెలంగాణలో తప్ప, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళలో బీజేపీ పుంజుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం చూస్తుంటే, బీజేపీ చేపట్టిన పొత్తులు ఏ మాత్రం ఆ పార్టీకి లాభం తెచ్చిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఒరిస్సాలో బీజేడీ బలంగా వుంది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేని వాతావరణమే కనిపిస్తోంది. వైసీపీ ఒక్కటి ఒక వైపు - మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒక వైపు అన్నట్లుగానే వుంది. బీజేపీ -టీడీపీ -జనసేన ఒక పొత్తు కిందకు వచ్చాయి.
షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ కూడా తన బాణాలను ప్రధానంగా జగన్ వైపే ఎక్కుపెట్టి యుద్ధం చేస్తోంది. తమ పథకాలు, ప్రజలపై అత్యంత విశ్వాసంతో జగన్ వున్నారు. కొత్త పొత్తుతో బలమైన శక్తిగా మారుతామనే నమ్మకంలో చంద్రబాబు, పవన్ వున్నారు. ఏపీలో ఏమవుతుందో చూద్దాం!
తెలంగాణ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కవిత అరెస్టు అంశం కూడా తెలంగాణ రాజకీయ పార్టీలలో కొంత ప్రభావం చూపించకపోదు. ఎత్తుజిత్తులు బాగా ఎరిగిన కెసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో మళ్ళీ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన 'ఇండియా కూటమి' ఇంకా శక్తివంతంగా మారలేదు. ఆ కూటమిలోని నాయకుల మధ్య సయోధ్య పెద్దగా లేదన్నది బహిరంగ రహస్యం.
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జగన్ మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి ఎలాగైనా దించాలని ప్రతిపక్షాలన్నీ అనుకుంటున్నట్లుగా, కేంద్రంలో నరేంద్రమోదీని దించాలని విపక్షాలు అనుకుంటున్నాయి. ప్రతిపక్షాలు అలా అలోచించడం సహజమైన అంశం. ఆ మేరకు బలోపేతం కావడంలోనే అసలు రహస్యం దాగి వుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెద్ద ఎత్తున తేవాల్సిన అవసరం కూడా వుంది. కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత, నాయకత్వం పట్ల విశ్వసనీయత, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో బలంగా చెప్పగలగడం మొదలైన అంశాలు చాలా వున్నాయి. ఇవన్నీ సాధించకపోతే, కూటమి విజయం ఉత్తుత్తి ప్రగల్బాలుగానే మిగిలిపోతుంది.
ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే, బీజేపీ పాలన పట్ల, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. ఈ పదేళ్ల సామాజిక పరిణామాన్ని గమనిస్తే, హిందూ భావజాలం, ఐక్యత పెరిగాయనే చెప్పాలి. దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువుల 'ఓటుశక్తి'పై బీజేపీ పెంచుకున్న విశ్వాసం కూడా పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధిలేమి, ప్రభుత్వ ఉద్యోగాలు సన్నగిల్లడం, అధిక ధరలు మొదలైనవి అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనే మాటలు వినపడుతున్నాయి.
నరేంద్రమోదీ - అమిత్ షా ద్వయం తప్ప, మిగిలినవారికి స్వతంత్రత లేదని, కేంద్ర మంత్రులు సైతం డమ్మీలుగా మారిపోయారని, అంతా పిఎంఓ, గుజరాత్ గణమే చక్రం తిప్పుతున్నారనే మాటలు బలంగా వినపడుతున్నాయి. వీటన్నిటిని దాటుకుంటూనే నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ఇన్నాళ్లూ వరుస విజయాలు నమోదు చేసుకుంటూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లోనూ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, బీజేపీ అధికారంలో ఉండడం చారిత్రక అవసరంగా భావించి, మౌనముద్ర వహిస్తున్నారనే మాటలు వినవస్తున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి ఎంత ముఖ్యమో, కాంగ్రెస్‌కు అంతకంటే ముఖ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో, చంద్రబాబుకు అంతకంటే ముఖ్యం.
- మాశర్మ, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment