‘‘వైజ్ఞానిక కల్పనాసాహిత్యం అనే కంటే సైన్స్ ఫిక్షన్ అంటే తేలికగా అర్థం అవుతుందేమో! ప్రస్తుతం వున్న సైన్స్ ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో వూహాకల్పనా చేసి సృష్టించేదే సైన్స్ ఫిక్షన్. ఈ సైన్స్ ఫిక్షన్‌లో అనేక విధమైన ఉపశాఖలున్నాయి. పూర్తిగా సైన్స్ సూత్రాల మీద ఆధారపడి భవిష్యత్తులో జరగడానికి అవకాశం వున్నట్లు రాసేది సైన్స్ ఫిక్షన్ అయితే, కొన్ని జరగడానికి అవకాశం లేనివి, కల్పనలోనే సాధ్యమయ్యేవి అయితే ‘సైన్స్ ఫాంటసీ’ అనీ చెప్పుకోవచ్చు. ఎక్కువ క్లిష్టమైన సాంకేతిక వివరాలతో వున్నవి ‘హార్డ్‌కోర్ సైన్స్ ఫిక్షన్’ అనీ, సరళమైన వివరాలైతే ‘సాఫ్ట్‌కోర్’ అనీ అనొచ్చు. ఇదికాక భవిష్యత్తులో జరిగే గ్రహాంతర యుద్ధాలు, రోబోట్లు, కంప్యూటర్లు, కాలప్రయాణం ఇలాంటివన్నీ కూడా సైన్స్ ఫిక్షన్ కిందికే వస్తున్నాయి. మిలిటరీ సైన్స్ ఫిక్షన్, సైబర్ పంక్, సూపర్ హీరో, మెడికల్ థ్రిల్లర్స్, హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్, ఆల్టర్నేట్ హిస్టరీ, సమాంతర విశ్వాలు, ఇలా కొన్ని వూహాజనితమైనవీ, సైన్స్‌లో కొత్తగా వచ్చే సిద్ధాంతాల ఆధారంగా కూడా కథలు సృష్టించారు. ఇవి ఇంగ్లిష్‌లో అనేకం వున్నాయి. తెలుగులో ఇలాంటి సాహిత్యం సృష్టించాలనే ఆశయం నాది.
అయితే సైన్స్ ఫిక్షన్‌లో అన్నీ అలాగే జరుగుతాయా అనేదానికి ఆధారం ప్రస్తుతం లేకపోవచ్చు. భూమి అంతా నాశనమైపోవడం, గ్రహాంతర కాలనీలు, ఎలియన్స్, రోబోట్స్, కాలప్రయాణం, అంతరిక్షం నుంచి వచ్చే ఇతర జీవులు భూమిని ఆక్రమించడం...ఇవన్నీ ఫాంటసీ పరిధిలోకే వస్తాయి. ఆధారం లేకుండా వున్నాయి కాబట్టే ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ అనే మాట మార్చి ‘స్పెక్యులేటివ్ ఫిక్షన్’ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు వున్న సైన్స్ సిద్ధాంతాలే కాక, ఇంకా రుజువు కాని ఇతర సిద్ధాంతాలపైన ఆధారితం అయినవి కూడా కాబట్టి, ఈ పేరు ఎక్కువ సముచితంగా వుంటుంది. నేను మెడికల్ థ్రిల్లర్స్ ఐసీసీయూ, బైబై పొలోనియా, ఎపిడమిక్ లాంటి వైద్యశాస్త్ర ఆధారిత థ్రిల్లర్స్, కుజుడి కోసం, నీలి ఆకుపచ్చ, భూమి నుంచి ప్లూటోదాకా స్పేస్ ఒపెరా, స్పేస్ ఫిక్షన్ నవలలు రాశాను. ఇవికాక, సైన్స్ ఫిక్షన్‌లోని ఈ పై చెప్పిన జోనర్స్ అన్నిటిలోనూ కథలు రాయాలనే ఆసక్తితో ఈ కథలు రాయడం జరిగింది. నాకు లెఫ్టిస్ట్ లేక రైటిస్ట్ లేక మతవాదం ఏదీ ఇష్టం లేదు. మానవతావాదమే ఇష్టం. నా వుద్దేశంలో సైన్స్ ఒకటే వాస్తవం. ఆ సైన్స్ వెర్రితలలు వేస్తే మానవత్వం దెబ్బతినకూడదు, అన్యాయం గెలవకూడదు. ఈ కథలన్నిటినీ అదే వుద్దేశంతో రాశాను.
జెడ్ సైన్స్ ఫిక్షన్– మరికొన్ని కథలు
రచన: డాక్టర్ చిత్తర్వు మధు; పేజీలు: 264;
వెల: 150; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
ఫోన్: 8096310140
Comments
Please login to add a commentAdd a comment