![Venkaiah Naidu suggested that the Pancha Sutra plan should be followed for covid - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/11/venkaiah.jpg.webp?itok=UaGPmy0S)
టెర్రస్ గార్డెన్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని జయించడానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, వ్యాయామం, ధ్యానం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత అనే పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనగలమన్నారు. శనివారం వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో ‘కొత్త (కరోనా) కథలు’పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాలు, నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితల కథలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. కరోనా కొత్త కథల్లో భాగస్వాములైన రచయితలందరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు.
మిద్దెతోట.. ఓ చక్కని ఆలోచన
మిద్దెతోట ఓ చక్కని ఆలోచనని, దీని వల్ల ఖర్చులు తగ్గుతాయని, మనకు మంచి సహజ పోషకాహారం లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచించిన మిద్దెతోట పుస్తకం ఆంగ్ల అనువాదం ‘టెర్రస్ గార్డెన్’ను శనివారం ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు బయట, మిద్దెల మీద కూరగాయలు పెంచే ఆలోచనపై దృష్టి పెట్టాలని సూచించారు. మన రోజువారీ కార్యక్రమాల్లో ఇదో భాగం కావాలని, దీనివల్ల మనకు నచ్చిన కూరగాయలు పండించుకుని తినే అవకాశం ఉంటుందన్నారు. ఈ పుస్తకాన్ని రాసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డిని, అంగ్లంలోకి అనువదించిన కోడూరు సీతారామ ప్రసాద్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు.
నేడు ‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన పల్లెకు పట్టాభిషేకం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించనున్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లోని అక్షర ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పుస్తకానికి మాజీ సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ముందుమాట రాశారు.
Comments
Please login to add a commentAdd a comment