అబద్ధం నిజం | The Short Story Taken By Anton Chekhovs The Bet | Sakshi
Sakshi News home page

Published Mon, May 21 2018 12:57 AM | Last Updated on Mon, May 21 2018 12:57 AM

The Short Story Taken By Anton Chekhovs The Bet - Sakshi

కథాసారం
పదిహేనేళ్ల క్రితం తాను ఇచ్చిన ఒక విందు గురించి ఆలోచిస్తున్నాడు ముసలి బ్యాంకర్‌. ఆ విందులో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. అంశం మరణశిక్ష మీదకు మళ్లింది. అతిథుల్లోని చాలామంది పండితులు, పాత్రికేయులు మరణశిక్షను నీతిబాహ్యమైనదిగా నిరసించారు. దానికి బదులుగా యావజ్జీవ కారాగారశిక్షను అమలు చేయాలన్నారు.
‘నేను మీతో ఏకీభవించను,’ అన్నాడు బ్యాంకర్‌. ‘నేను మరణశిక్షనుగానీ యావజ్జీవాన్నిగానీ అనుభవించనప్పటికీ, నా ఉద్దేశంలో మరణదండనే నీతివంతమైనదీ మానవీయమైనదీ కూడా. అది ఒకేసారి చంపేస్తుంది, యావజ్జీవం దశలవారీగా ప్రాణం తీస్తుంది. ఏది మానవీయం?’

‘రెండూ సమానంగా నీతిబాహ్యమైనవే’ అన్నాడు ఒక అతిథి. ‘వాటి లక్ష్యం ఒకటే, ప్రాణాన్ని తీయడం. ప్రభుత్వమేమీ దేవుడు కాదు, అది ఇవ్వలేని జీవితాన్ని తీసుకునే హక్కు దానికి లేదు’.
అతిథుల్లో ఒక పాతికేళ్ల న్యాయవాది కూడా ఉన్నాడు. అతడి స్పందన ఏమిటా అని అడిగినప్పుడు, ‘రెండూ కూడా సమానంగా అధర్మమైనవే. కానీ అవకాశం ఉంటే గనుక నేను యావజ్జీవాన్నే ఎంచుకుంటాను. చనిపోవడం కన్నా ఏదో విధంగా బతికివుండటం నయం కదా’ అన్నాడు.

బ్యాంకర్‌కు అసహనం పెరిగింది. టేబుల్‌ మీద గుద్దుతూ, ‘అది అబద్ధం. ఐదేళ్లు కూడా నువ్వు జైల్లో ఉండలేవని ఇరవై లక్షల పందెం’ అన్నాడు.
‘మీరు సీరియస్‌గానే అంటున్నారంటే, ఐదు కాదు పదిహేనేళ్లుంటాను’ బదులిచ్చాడు లాయర్‌.
‘పదిహేనా! సరే!’ అరిచాడు బ్యాంకర్‌. ‘నా పందెం ఇరవై లక్షలు’.
‘ఒప్పుకుంటున్నా. మీ పందెం ఇరవై లక్షలు, నా పందెం నా స్వతంత్రం’.

అట్లా ఈ అర్థం లేని పందెం అమలులోకొచ్చింది. భోజనం సమయంలో న్యాయవాదితో, ‘ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నాకు ఇరవై లక్షలతో పోయిందేమీ లేదు, నువ్వు అనవసరంగా నీ జీవితంలోని విలువైన నాలుగైదేళ్లను కోల్పోతావు’ అని హెచ్చరించాడు. ‘మూడు నాలుగు అని ఎందుకంటున్నానంటే నువ్వు అంతకంటే ఎక్కువకాలం ఉండలేవు. తప్పనిసరైతే సరే, కానీ ఐచ్ఛిక శిక్షను భరించలేవు. ఎప్పుడంటే అప్పుడే స్వేచ్ఛను పొందగలనన్న స్పృహ నీ ఖైదుకాలాన్ని విషతుల్యం చేస్తుంది’.

అప్పటి పందెం గురించి బ్యాంకర్‌ తలపోస్తూ ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ‘ఆ పందెం నేను ఎందుకు కాసినట్టు? దానివల్ల జరిగే మేలేమిటి? ఆ లాయర్‌ తన జీవితంలో పదిహేనేళ్లు కోల్పోతాడు, నేను నా ఇరవై లక్షలు తగలేస్తాను. దీనివల్ల యావజ్జీవం మరణదండనకన్నా మెరుగనో, హీనమనో ఏమైనా తేలుతుందా? డబ్బు కొవ్వున్నవాడి చపలచిత్తం నాదైతే, డబ్బు మీది దురాశ ఆ లాయర్‌ది’.
ఆ విందు తర్వాత న్యాయవాదిని బ్యాంకర్‌ పెరటింటిలో ఖైదు చేయాలని నిశ్చయించారు. అతడు తన ఖైదుకాలంలో గడప దాటి బయటకు రాకూడదు, మనుషులను చూడకూడదు, వారి గొంతు వినకూడదు, ఉత్తరాలు స్వీకరించకూడదు, వార్తాపత్రికలు తెప్పించుకోకూడదు. సంగీత వాద్యం ఉంచుకోవచ్చు, పుస్తకాలు చదవొచ్చు, లేఖలు రాయొచ్చు, మద్యం, పొగ తాగొచ్చు. వీటిల్లో ఏది కావాలన్నా ప్రత్యేకంగా నిర్మించిన గది కిటికీ గుండా చిన్న నోట్‌ పంపొచ్చు. అన్ని సూక్ష్మ వివరాలతో సహా ఒప్పందం రాయబడింది. నవంబర్‌ 14, 1870 పన్నెండు గంటల నుంచి నవంబర్‌ 14, 1885 పన్నెండింటిదాకా సరిగ్గా పదిహేనేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లోవుంటుంది. దీన్ని కనీసం రెండు నిమిషాల ముందు ఉల్లంఘించినా బ్యాంకర్‌  ఇరవై లక్షలు చెల్లించనక్కర్లేదు.

అతడు పంపిన చిన్న నోట్సుల ఆధారంగా తెలిసింది ఏమంటే, మొదటి సంవత్సరపు ఖైదులో లాయర్‌ తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాడు. ఆ గదిలోంచి రాత్రీ పగలని లేకుండా పియానో శబ్దాలు వినబడేవి. అతడు మద్యాన్నీ పొగనూ నిరాకరించాడు. ‘మద్యం కోరికలను రగిలిస్తుంది. ఖైదీకి ముఖ్య శత్రువులు కోరికలు’ అని రాశాడు. గదిలోని వాతావరణాన్ని పాడు చేస్తుందని పొగ కూడా తాగలేదు. మలుపులున్న ప్రేమ, క్రైమ్, ఫాంటసీ, కామెడీ వంటి చౌకబారు పుస్తకాలను తెప్పించుకున్నాడు.

రెండో ఏడాదిలో పియానో శబ్దాలు అసలు వినబడలేదు. క్లాసిక్‌ రచనలు మాత్రమే కోరుకున్నాడు. మళ్లీ ఐదో ఏడాదిలో ఆ గదిలోంచి సంగీతం వినబడింది. మద్యం కూడా కావాలని కోరాడు. ఆ సంవత్సరమంతా అతడు తినడం, తాగడం, తన మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. తరచూ ఆవలించేవాడు. తనలో తాను కోపంగా మాట్లాడుకునేవాడు. చాలాసేపు ఏదో రాసుకునేవాడు, దాన్ని మళ్లీ తెల్లారి మొత్తం చించేసేవాడు. చాలాసార్లు ఏడ్చేవాడు.

ఆరో సంవత్సర ద్వితీయార్థంలో భాషాశాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర ఉత్సాహంగా చదివాడు. ఎంత ఆబగా చదివాడంటే అతడు కావాల్సిన పుస్తకాలను తెప్పించడానికి బ్యాంకర్‌కు సమయం చాలేది కాదు. నాలుగేళ్ల కాలంలో ఆరువందల ఉద్గ్రంథాలను కొనాల్సివచ్చింది. ఆ తీవ్రోత్సాహంలో ఉన్నప్పుడే లాయర్‌ నుంచి బ్యాంకర్‌కు ఓ లేఖ వచ్చింది. ‘నా ప్రియమైన జైలర్, నేను ఈ వాక్యాలను ఆరు భాషల్లో రాస్తున్నాను. వాటిని నిపుణులకు చూపించండి. అందులో గనక ఒక్క తప్పూ లేకపోతే దయచేసి పెరట్లో ఒకసారి తుపాకీని కాల్పించండి. ఆ శబ్దం వల్ల నా ప్రయత్నం విఫలం కాలేదని తెలుస్తుంది. భిన్న దేశాల్లోని భిన్న తరాల మేధావులు  భిన్న భాషల్లో మాట్లాడినప్పటికీ వాళ్లందరిలోనూ వెలిగే జ్యోతి ఒక్కటే. వాళ్లందరినీ అర్థం చేసుకోగలిన నా పరమానందాన్ని ఏమని వర్ణించను!’ అతడి కోరిక నెరవేరింది. బ్యాంకర్‌ ఆదేశం మీద రెండుసార్లు పెరట్లో తుపాకీ పేలింది.

పదో ఏడాది తర్వాత లాయర్‌ తన టేబుల్‌ మీద నిశ్చలంగా కూర్చుని న్యూ టెస్టమెంట్‌ చదివాడు. నాలుగేళ్లలో ఆరు వందల పాండిత్య గ్రంథాల్ని చదివినవాడు ఈ సన్నటి, తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని సుమారు ఏడాదికాలం చదవడం బ్యాంకర్‌ను ఆశ్చర్యగొలిపింది. తర్వాత లాయర్‌ మత చరిత్రలు, వేదాంతం కోరుకున్నాడు.
చివరి రెండేళ్లు లెక్కాపత్రం లేకుండా చదివాడు. ప్రకృతి శాస్త్రాలు, బైరన్, షేక్‌స్పియర్, ఒకసారి రసాయన శాస్త్రం కోరేవాడు, మరోసారి వైద్యశాస్త్రం, నవల, తత్వశాస్త్రం మీద సిద్ధాంత గ్రంథం... సముద్ర ప్రయాణంలో ప్రమాదానికి గురైన నౌకలోనివాడు దొరికిన చెక్కనల్లా పట్టుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఒక్కో పుస్తకం చదివాడు.
....
ఇక రేపు పన్నెండు గంటలైతే పందెం పూర్తవుతుంది. ‘నేను అతడికి ఇరవై లక్షలు చెల్లించాల్సి వుంటుంది’ అని గుర్తుచేసుకున్నాడు బ్యాంకర్‌. ‘చెల్లిస్తే గనక నేను దివాళా తీసినట్టే’.
పదిహేనేళ్ల క్రితం బ్యాంకర్‌ దగ్గర లక్షలు మూలిగాయి. కానీ ఇప్పుడు ఆస్తులకంటే అప్పులు అధికం. స్టాకు మార్కెట్లతో ఆడిన జూదం, జాగ్రత్తపడలేనితనం అతన్ని నిండా ముంచాయి. అతడి పూర్వపు ఆత్మవిశ్వాసం పోయింది. ‘శాపం లాంటి పందెం’ అనుకున్నాడు. ‘అతడెందుకు చావలేదు? మహా అయితే అతడికి నలబై ఏళ్లు. నా చివరి రూపాయి కూడా తీసుకుని వెళ్లిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, జూదం ఆడతాడు. నేనేమో బిచ్చగాడిలా దీనంగా నిలబడితే అతడు ‘నేనేమైనా మీకు సాయం చేయగలనా’ అని అడుగుతాడు. ఇది నేను భరించలేను. దీన్ని తప్పించుకోవాలంటే అతడు చావడం ఒకటే మార్గం’.
గడియారం మూడు కొట్టింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. నిశ్శబ్దంగా అతడు ఇనప్పెట్టెలోంచి ఆ పదిహేనేళ్ల పాటు తెరవని గది తాళంచెవి తీసుకున్నాడు. పెరడంతా చీకటిగావుంది. వర్షం కురుస్తోంది. వాచ్‌మన్‌ వానకు ఎక్కడో పడుకున్నట్టున్నాడు. పిలిస్తే బదులు రాలేదు. ‘నేను అనుకున్న పని ధైర్యంగా చేయగలిగితే అనుమానం వాచ్‌మన్‌ మీదికి పోతుంది’ అనుకున్నాడు. బందీ ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూశాడు. క్యాండిల్‌ వెలుగుతోంది. బందీ టేబుల్‌ ముందు కూర్చున్నాడు. కిటికీ మీద చిన్నగా తట్టాడు. బందీ కదలలేదు. బ్యాంకర్‌ జాగ్రత్తగా తాళం మీది సీల్‌ చించి, చెవితో తాళం తీశాడు. తుప్పు పట్టిన తాళం చప్పుడు చేస్తూ తెరుచుకుంది. లోపలినుంచి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఊహించాడు. కానీ పదిహేనేళ్ల బందీఖానా లాయర్‌ను కదలకుండా కూర్చోవడం నేర్పింది. బ్యాంకర్‌ లోపలికి పోదామని నిశ్చయించుకున్నాడు.

ఒక అస్థిపంజరంలాంటి శరీరం కూర్చునివుంది. పొడవైన వెంట్రుకలు. అవీ తెల్లబడుతున్నాయి. పసుపు పచ్చటి ముఖం. నలబై ఏళ్లవాడంటే ఎవరూ నమ్మరు. టేబుల్‌ మీద ఏదో రాసిన కాగితం ఉంది. ‘లక్షలు వస్తాయని కలగంటున్నట్టున్నాడు, మంచం మీదకు తోసి దిండుతో అదిమానంటే ఈ సగంప్రాణి పూర్తిగా చస్తుంది’ అనుకున్నాడు బ్యాంకర్‌. ‘ముందైతే ఏం రాశాడో చదువుదాం’.
‘రేపు అర్ధరాత్రి పన్నెండుకు నా స్వతంత్రం నాకు వెనక్కి వస్తుంది. కానీ ఈ గదిని వదిలి, సూర్యుణ్ని చూడటానికి ముందు కొన్ని మాటలు పంచుకోవాలి. నా స్వతంత్రాన్నీ, నా జీవితాన్నీ, నా ఆరోగ్యాన్నీ, మీ పుస్తకాలు ప్రపంచ భాగ్యాలని వర్ణించేవన్నింటినీ నా ఆత్మసాక్షిగా అసహ్యించుకుంటున్నాను. ఎండమావి లాగా ప్రతిదీ శూన్యంగా, మి«థ్యగా కనబడుతోంది. అందం, తెలివితేటలు ఎన్నివున్నా మృత్యువు తప్పదు. మేధావుల అమరత్వం కూడా నశించిపోయేదే. మీరు తప్పుదోవలో పయనిస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా, వికారాన్ని అందంగా భావిస్తున్నారు. మీరు దేనికోసమైతే జీవిస్తున్నారో దాని పట్ల నాకున్న తిరస్కారాన్ని తెలియజేసేందుకు నేను ఒకప్పుడు స్వర్గసమానంగా భావించిన ఇరవై లక్షలను  వదులుకుంటాను. సరిగ్గా రేపు ఐదు నిమిషాల ముందు గదిలోంచి వెళ్లిపోయి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాను’.
చదవగానే బ్యాంకర్‌ అతడి తలను ముద్దాడి, ఏడుస్తూ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. జీవితంలో ఏనాడూ తన పట్ల తనకు ఇంత అసహ్యం కలగలేదు. 
తెల్లారి, ఆ మనిషి గది కిటికీ ఎక్కి వచ్చి, గేట్లోంచి అదృశ్యమయ్యాడని పరుగెత్తుతూ వచ్చి చెప్పాడు వాచ్‌మన్‌. బ్యాంకర్‌ ఆ విషయాన్ని ధృవపరుచుకుని, అనవసరమైన పుకార్లు రాకుండా, ఇరవై లక్షలపై తన హక్కును వదులుకుంటున్నట్టుగా లాయర్‌ రాసిన కాగితాన్ని ఇనప్పెట్టెలో భద్రపరిచాడు. 
 

(ఆంటన్‌ చెహోవ్‌ (1860–1904) రష్యన్‌ కథ ‘ద బెట్‌’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో చెహోవ్‌ ఒకరు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement