బాల వికాసం
బాల్యంలో తమకు ఇష్టమైనవి తమ పిల్లలకు దక్కాలనుకుంటారు తల్లిదండ్రులు. నటి ఆలియా భట్ తన తాతగారి నుంచి చాలా కథలు వినేది. కుమార్తె పుట్టాక ఆ పాపకు కథలు చెప్పాలనిపించింది. తన పాపకే ఏమిటి అందరు పిల్లలకూ కథలు చెప్తానని ఏకంగా కథల పుస్తకం రాసింది.
‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ దాని పేరు. సాహస బాలిక తన శునకంతో ఎన్ని అద్భుతాలు చేసిందనేదే కథ. పిల్లలకు అవసరమైన కథా ప్రపంచం గురించి ఆలియా మాటలు.....
‘ఒకమ్మాయికి ప్రకృతితో మాట్లాడే శక్తి వస్తే? చెట్లతో పుట్లతో పిట్టలతో జంతువులతో మాట్లాడే శక్తీ వాటి మాటలను అర్థం చేసుకునే శక్తి వస్తే? వాటి సమస్యలు తెలుసుకొని భూమిని, పర్యావరణాన్ని కాపాడాలని అనుకుంటే ఎంత బాగుంటుంది. అదే నా తొలి పుస్తకం కథ’ అని చెప్పింది నటి ఆలియా భట్.
ఆమె రాసిన మొదటి పుస్తకం ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’... పెంగ్విన్ సంస్థ ఉప విభాగం పఫిన్ ద్వారా మార్కెట్‌లో విడుదలైంది. బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ అయిన ఆలియా భట్ తనకు కూతురు పుట్టాక ఈ పుస్తకాన్ని విడుదల చేయడం వల్ల పిల్లల పుస్తకాల అవసరం, వాటి ఉద్దేశ్యం గురించి నేడు మళ్లీ బాలల సాహిత్య ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.
కరుణ, పర్యావరణ ప్రేమ
‘పిల్లల పుస్తకాలు పిల్లల్లో కరుణని పెంచాలి. పర్యావరణ స్పృహను కలిగించాలి. పిల్లలకు తన ఇంటి బయట ఉండే ప్రకృతి పరిసరాలు, దూరాన కొండల్లో ఉండే పక్షులు, పులులు, ఏనుగులు... ఇవి ఎంతో ఇష్టం. వాటిని పాత్రలుగా చేసుకుని కథలు చెప్తే వారు వింటారు’ అంటుంది ఆలియా. వివేక్ కామత్, తన సోదరి షబ్నమ్ మిన్‌వాలాల సహాయంతో ఆలియా ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ పుస్తకం రాసింది.
ఇందులో చిన్నారి అమ్మాయి పేరును ఆలియా అనే పెట్టింది. మరో ముఖ్యపాత్రైన కుక్కపిల్లకు ‘ఎడ్’ అనే పేరు పెట్టింది. ఇది ఆలియాకు ఉన్న మూడు పిల్లుల్లో ఒకదాని పేరు ఎడ్వర్డ్ నుంచి తీసుకుంది. ‘ఎవరూ పట్టించుకోకుండా వదిలేయడంతో దిక్కుతోచక తిరుగుతున్న కుక్కపిల్లను ఆలియా అనే చిన్నారి చేరదీస్తుంది.
వీరితోపాటు ఒక మాట్లాడే కాకి, మాట్లాడే కొబ్బరి చెట్టు ఈ కథలో పాత్రలుగా ఉంటాయి. మొదటి భాగంలో వీరంతా పరిచయం అవుతారు. తర్వాతి భాగాల్లో భూమి కాపాడే సాహసాలు ఉంటాయి. ఆలియా, ఎడ్‌లను ప్రధాన పాత్రలుగా చేసుకుని వరుసగా కథల పుస్తకాలు తెస్తాను. వీటిని యానిమేషన్ సిరీస్‌గా కూడా వెలువరిస్తాను. నా మొదటి పుస్తకం కూడా ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ పేపర్ మీదే అచ్చయ్యింది’ అని తెలియచేసింది ఆలియా.
పిల్లలకు కథలు అవసరం
‘నా చిన్నప్పుడు మా తాత (తల్లి సోనీ రాజ్దాన్ తండ్రి నరేంద్రనాథ్ రాజ్దాన్) నాకు చాలా కథలు చెప్పేవారు. ముఖ్యంగా చున్ను, మున్ను, గున్ను అనే మూడు పాత్రలతో ఆయన చెప్పే కథలు నాకు భలే నచ్చేవి. ఆ మూడు పాత్రలు మనుషులో చీమలో ఎలుకలో కూడా తెలియదు. ఇక మా అక్క షాహీన్ పుస్తకాల పురుగు. నాకు కథలు చదివి వినిపించేది.
మా అమ్మాయి రాహా పుట్టాక పిల్లల కథల గురించి మళ్లీ ఆలోచన వచ్చింది. ఇప్పుడు దానికి 19 నెలలు. రోజూ నేను దానికి నిద్రపోయే ముందు కనీసం మూడు కథల పుస్తకాలు చదివి వినిపిస్తాను. రకరకాల గొంతులతో పాత్రలను చదువుతాను. చాలా ఆసక్తిగా వింటుంది. తర్వాత ఆ పుస్తకాలను కౌగిలించుకుని నిద్రపోతుంది. నా పుస్తకంలోని కథ కూడా వినిపించాను. అయితే కథ కంటే కూడా దానికి పుస్తకంలోని బొమ్మలు బాగా నచ్చాయి’ అని నవ్వింది ఆలియా.
పుస్తకాలు, బొమ్మలు
‘పిల్లల పుస్తకాలే కాదు పిల్లల బొమ్మలు కూడా బోధనాత్మకంగా ఉండాలి. బొమ్మలు విజ్ఞానం పంచేలా ఉండాలి. అలాగే పర్యావరణహితంగా తయారవ్వాలి. ఇలాంటి పనులన్నింటిలో నేను నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను. నేను రచయితను కాను. స్టోరీటెల్లర్‌ని. మనందరం కథలు రాయలేకపోయినా చెప్పగలం. పిల్లలకు కథలు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలను కథల ప్రపంచానికి దూరం చేయవద్దు. వారికి ఆ ప్రపంచం చాలా ముఖ్యం’ అంటోంది ఆలియా.
Comments
Please login to add a commentAdd a comment