తెనుగువాళ్లకు ఇతర భాషలు అబ్బవు కాని, ఇతరులకు తెనుగు భాష సుళువుగా యబ్బేటట్టు కనబడుతుంది.
అయినా తెనుగువాళ్లు పక్కా తెనుగు మాట్లాడ్డం గాని వ్రాయడం గాని యరుదు. ఏదో ఇతర భాషల సాంకర్యం వుండక తప్పదు.
∙∙
వానికి ‘‘ట్రేడ్‌లో బలే నేక్ వుంది’’ యన్నాడు బస్సులో కూర్చుని వొక కోమటి.
చూడండి: ఇంగ్లీషు మాటలు రెండు ఆ కోమటి గొంతుగ్గుండా గాలిలోకి దొర్లింపబడ్డాయి.
ఇలాగ్గానే హిందీ పదాలు. ప్రతీ నిత్యం కిస్మత్, ఔర, దున్యా ఇత్యాదులు గుండెలు చీల్చుకు వచ్చేస్తుంటాయి ఆంధ్రుని నోట.
అరవం యరచేతిలోని ఉసిరిక ఆంధ్రులకు. ఎన్న, ఇల్లె, కత్తిరికాయ, ములహప్పొడి ఇత్యాదులు కొల్లలు ఉభయ గోదావరీ మండలాల్లోనూ.
మఱి హిందూస్థానీ మాట్లాడ్డానికి తెనుగువాండ్లే మిన్నగాండ్లు. కబడ్డార్, ఖడేరావ్, ఇవన్నీ ఎప్పటికప్పుడు రోడ్డు దుమ్ములా ఎగిరి ఎదరవాణ్ణి దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి.
కాని వొక్క భాషలోనూ యచ్చంగా స్వచ్ఛంగా జటిలంగా శాస్త్రకట్టుగా సంపూర్ణ ప్రజ్ఞ యలవరచుకొన్నది కానరాదు. అలవరుచుకోడు ఆంధ్రుడు.
తన భాషే తనకు రానివాడు మరో భాషలో మాత్రం ప్రవీణుడు కాగలడా? కాలేడు సరిగదా ఎవర్నైనా కుదురైన జాను తెనుగు మాట్లాడేవాణ్ణి చూస్తే ఈసడింపు కూడాను, ఈ రోజుల్లో కూడా ఇంకా వెధవ తెనుగేనా అని.
అంచేత ఈ కథయొక్క మకుటంలోనే రెండు ఇంగ్లీషు మాటలు వాడేశాను. ‘‘సారీ’’ అని, ‘‘గార్డు’’ అని.
‘‘గార్డు’’ యన్నది పూర్తిగా తెనుగుపదం అయిపోయింది యని యనుకోవచ్చు. లోగడ వదినె పాటల్లో ‘‘గార్డు దొర’’ శృంగార నాయకునిగా ప్రవర్తించిన జ్ఞాపకం. అయితే ‘‘క్విట్ ఇండియా’’వచ్చాక ‘‘దొర’’ శబ్దం పోక తప్పదు. కాబట్టి కథలో ‘‘గార్డు’’ అనే వాడాను. సింపిల్ గార్డు!
దొర– గార్డు అయినా దొర–కాని– గార్డు అయినా ప్రతీ రైలు గార్డూ స్యూట్ మీద ట్రిమ్‌గా ఉండక తప్పదు. అందులోనూ మైయిల్ గాడీ గార్డు ఈ ‘‘వరల్డు’’ మనిషిలా కనబడడు.
ప్లాట్‌ఫారమ్ సిమెంటుదైనా రబ్బర్ మీద నడిచినట్టుగా ఎగిరెగిరి పడుతూ నడుస్తాడు. బండి ఆగిన పది నిమిషాలు డైనింగు కార్ నుండి కోలింగు ప్లాంకు దాకా, కోలింగు ప్లాంకు నుండి డైనింగు కార్ దాకా!
మధ్యే మధ్యే తేనీరుచ్చుకుంటాడు.
మరిన్నీ స్టేషన్ మాస్టర్ను మన్నిస్తూ మన్నన లందుకుంటాడు. గడియారం ముళ్లూ కనురెప్పలూ ఏకమయ్యేటట్టు రిస్టువాచ్ గమనిస్తూ యుంటాడు.
పచ్చజండా విప్పుతూ ఉంటాడు. చుడుతూ యుంటాడు. అంతా ఎక్కారో లేదో కంటూ వుంటాడు.
బ్రేక్‌వాన్‌లో సామాను లెక్క చూచుకుంటాడు. సహవాసుల్ని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు. వాళ్ల సౌకర్యాలను గురించి సెంట్ పెర్సెంట్ యోజిస్తాడు.
ఒక్క ‘‘వర్డు’’లో మెయిల్ గాడీ గార్డు ఫుట్‌బాల్ గేమ్‌లోని ‘‘ఫార్వార్డు’’ అనుకోండి.
∙∙
గంట కొట్టారు. ఎంజిన్ వాటరు తాగి కోల్ తిని తయారీలో విసిల్ వేసింది. గార్డు పచ్చజండా ఊపడమే తరువాయి. అవితే గార్డు ఎవరికోసమో యన్నట్టు ఇటూ యటూ త్రచ్చాడుతూ పచ్చజండా ఊపడాయిరి. అంతా కిటికీల గుండా గుమ్మాల గుండా బండీ నుండి తొంగి చూస్తూ వున్నారు.
ఒక ప్రయాణీకురాలు– చక్కని చీర కట్టుకు రెండో తరగతి లేడీస్ కంపార్టుమెంటు వద్ద ఎక్కకుండా నిలబడివుంది, ప్లాట్‌ఫారమ్ మీదనే– గార్డు తన హడావిడిలో ఆమెను చూచాడో లేదో, ఆమె చీర తగిలాడు. తగుల్తూ వెంటనే ‘‘సారీ’’ అన్నాడు.
ప్రేక్షకుల్లో కొందఱు ‘‘మరి గార్డు ‘సారీ’లో బడ్డాడు. మెయిలు వెళ్లినట్లే!’’ అన్నారు.
కొందరు ‘‘గార్డు లోబడ్డాక ‘సారీ’ ఏం? జోలీ గుడ్ కంపెనీ’’ అన్నారు.
ఇంగ్లీషు ‘‘సారీ’’కి తెనుగులో రెండర్థాలు. ‘చీర’ అని వొకటి. విచారకరమని వొకటి. కాని ఆ భాషలో వర్ణక్రమం వేఱు– వ్రాయడమంటూ వస్తే.
ఆమె– ఆ స్త్రీ– ‘‘నో మేటర్! ఇందులోనేనా కూర్చునేది’’ యని అడిగింది.
గార్డు ‘‘మీ కోసమే చూస్తూ యున్నది’’ అని ఆమెను నఖ శిఖ పర్యంతం చూస్తూ ‘‘చీర కట్టేరే! పోల్చలేకపోయినాను! గెట్ ఇన్ ప్లీజ్! గెట్ ఇన్!’’ అన్నాడు.
గట్టిగా ఈలేశాడు. పచ్చజండా రంయిని విప్పి వూపాడు. బండీ నడుస్తూయుంటేనే గార్డు తన రేక్‌లోకి, ఎగిరి ఎక్కినట్టు ఎక్కేశాడు.
మహాచెడ్డ నవ్వు నవ్వేశాడు.
∙∙
అయితే వొక సందేహంలో పడ్డాడు. ‘‘ఆ దొరసాని చీరకట్టి తల్లో పువ్వులు కూడా పెట్టుకుందా? లేదా?’’ అని.
అందుకోసం ఆమె తలకట్టెన్ని మాట్లు చూద్దామన్నా గార్డుతో ఆమె ముఖాముఖి మాట్లాడ్డమేగానీ తలకట్టు చూపింది కాదు.
‘‘చీర కట్టుకుంటే ఈ భారతీయులు మమ్మల్ని ఉండనిస్తారనుకుంటాను ఇండియాలో’’ యంది ఓ చోట గార్డుతో.
‘‘చీర కట్టుకుంటే చాలదు. పువ్వులు కూడా పెట్టుకోవాలి’’ అన్నాడు గార్డు.
ఆమె ‘‘అవీ పెట్టుకున్నాను. అదిగో చూడు నా తలకట్టు’’ యని చూపించింది తల్లో పువ్వులు.
‘‘సారీ’’ అన్నాడు గార్డు.
‘‘ఏం?’’ అంది ఆమె.
‘‘ఫువ్వులు డాఫోడిల్సు లాగున్నాయి. డాఫోడిల్సు బిలాంగ్ టు ఇంగ్లండు’’ అన్నాడు గార్డు.
‘‘ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఆఫ్‌టరాల్ వి ఆర్ ఏంగ్లో ఇండియన్సు. అవీ పెట్టుకుంటాం. ఇవీ పెట్టుకుంటాం. అన్నీ పెట్టుకుంటాం’’ యంది ఆమె.
‘‘సారీలో గౌను లేదు కదా?’’యని అడిగాడు గార్డు.
ఆమె చిరునవ్వు నవ్వింది.
‘‘ఇండీడ్. ఎవెరీ సారీ ప్రోబ్లెమ్. దిస్ క్విట్ ఇండియా ప్రోబ్లెమ్. యు సీ. బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్. బట్ వాటర్ ఈస్ ఎస్సెన్షియల్ ఫర్ మై ఎంజిన్. ఐ కాంట్ లీవ్ దిస్ ఎంజిన్. ది ఇంగ్లీష్‌మన్ కాంట్ లీవ్ యు’’ యన్నాడు గార్డు. అంటూ ఆమె సారీకేసి మరోసారి చూచాడు.
ఆమె ‘సారీ’ అంది.
కవికొండల వెంకటరావు కథ ‘సారీలో బడ్డాడు గార్డు’ ఇది. కవికొండల (20 జూలై 1892 – 4జూలై 1969) రాజమండ్రి దగ్గరి శ్రీరంగపట్నంలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది. కౌమారంలోనే సాహిత్యం పట్ల ఆసక్తివున్న కవికొండల మొదట్లో తన రచనలు ఆంగ్లంలో చేసేవారు. అయితే, ఆయన ప్రతిభను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపాల్ అయిన ఆంగ్లేయుడు ఒ.జె.కూల్డ్రె, మాతృభాషలో రాయమని సలహా ఇచ్చారట. అట్లా తెలుగులో రాయడం మొదలుపెట్టారు. కథలు, గేయాలు, వ్యాసాలు, నవలలు, ఖండ కావ్యాలు, నాటకాలు, శతకాలు, ఇలా విస్తారంగా రాశారు. కథలే మూడు వందల వరకూ ఉన్నాయి. ఈయన రచనలు 1929 నుంచీ పుస్తకాలుగా వచ్చాయి. ఇనుప కోట (నవల), విజన సదనము (నవల), కుమార కంఠము, నెలబాలుడు, చదువుల దుత్త, చిట్టి కైత (బాలల కోసం ఖండ కావ్యాలు), మాతృదేశ సంకీర్తనము (గేయాలు), జంటలు(వ్యాసాలు) ఆయన పుస్తకాల్లో కొన్ని. తనను ప్రభావితం చేసిన కవి కవికొండల అని శ్రీశ్రీ చెప్పుకున్నారు.
కవికొండల వెంకటరావు
సారీలో బడ్డాడు గార్డు
Published Mon, Jun 1 2020 12:17 AM | Last Updated on Mon, Jun 1 2020 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment